సహజసిద్ధ భస్మరేఖలతో వెలసిన ఈజ్‌గాం శివమల్లన్న


Sun,October 27, 2019 02:29 AM

ఆలయప్రాశస్త్యం:

కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈజ్‌గాం శివమల్లన్న ఆలయం ఉంది. తొమ్మిదో శతాబ్దంలో స్వయంభూగా వెలసిన శివున్ని జైనులు బైరవునిగా పిలుచు కునేవారు. ఆ తర్వాత కాకతీయుల కాలంలో మల్లన్నగా రూపుదిద్దుకుం ది. దానికి గుర్తుగా వారి కాలం నాటి కళాఖండాలు ఆలయంలో కనబడుతాయి. 1979లో కంచికామకోటి పీఠాధిపతి శంకరాచార్యులు శివమల్లన్నగా ప్రాణప్రతిష్ఠ చేసినట్లు స్థలపురాణం చెబుతున్నది.
Temple

భస్మరేఖలు:

ఆలయ గర్భగుడిలో గణేషుడు, పార్వతి, విష్ణు, సూర్యాదిదేవతలు ఉండగా, ప్రాకారానికి నలువైపులా కాళభైరవ, వీరభద్ర, మహంకాళి, వీరాంజనేయ ఆలయాలు ఉన్నాయి. గర్భగుడిపై శివలీలలు బోధించే శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నంది, ధ్వజస్తంభం గాలిగోపురం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉండగా శివాలయాల్లో మరెక్కడా లేని విధంగా ఇక్కడి స్వామి వారికి సహజసిద్ధ భస్మరేఖలుండడం ప్రత్యేకత.

తొలినైవేద్యం :

ఏటా పంట చేతికి వచ్చిన తర్వాత ఇక్కడి రైతులు మల్లన్న దేవుడికి నైవేద్యం వండిపెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. కొమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్ పట్టణం, కౌటాల, బెజ్జూర్, దహెగాం, సిర్పూర్(టి), కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

వైభవంగా మహాశివరాత్రి :

ఈ ఆలయంలో ఏటా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జాతర నిర్వహిస్తుంటారు. శివరాత్రికి ఒకరోజు ముందు నుంచి ప్రారంభమయ్యే ఈ జాతర శివరాత్రి మరుసటి రోజు వరకు మూడురోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరకు జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల, కరీంనగర్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. అంతేగాకుండా యేటా షష్టి బోనాలను నెలపాటు నిర్వహిస్తారు. కార్తీకమాసంలో మాస శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కల్యాణాన్ని జరిపిస్తారు. ఆ గ్రామంలో తొమ్మిదో శతాబ్దంలో స్వామివారు స్వయంభు ఈశ్వరనామంతో వెలిసినట్లు స్థలపురాణం చెబుతున్నది. ఈశ్వరనామంతో వెలిసినందున ఈజ్‌గాంగా పేరు గాంచింది. శివమల్లన్నగా పిలుచుకునే ఆయన భక్తుల పాలిట కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందింది. జైనుల కాలంలో భైరవనామంతోనూ, అనంతరం కాకతీయుల కాలంలో మల్లన్నగా రూపుదిద్దుకున్న ఈజ్‌గాం శివమల్లన్న కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి పొందారు.

424
Tags

More News

VIRAL NEWS