అక్కడ ఆరోగ్యం మన చేతుల్లోనే!


Sun,October 6, 2019 02:38 AM

హంజాలోయ..
Khanjaloya
ఓ వంద.. 120 ఏండ్లు ఎలాంటి రోగాలు రాకుండా హాయిగా, ఆరోగ్యంగా బతకాలనుకుంటున్నారా? క్యాన్సర్‌ బారిన అసలు పడకూడదనుకుంటున్నారా? అయితే వెంటనే పాకిస్థాన్‌లోని ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న హంజాలోయకు వెళ్లి స్థిరపడండి. పిల్లల చదువుకు ఎలాంటి లోటూ ఉండదు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు వందేళ్లొచ్చినా యవ్వన ఛాయలతో ఉండొచ్చు. ఇంతకీ హంజా లోయలో ఏముంది? దాని ప్రత్యేకత ఏంటన్న విషయాలు తెలియాలంటే ఇది చదువాల్సిందే..
Khanjaloya1
కలుషితం అయిన, అవుతున్న వాతావరణంలో జీవిస్తున్న భారతీయులు 30 ఏండ్లకే ఆంటీ, అంకుల్‌ అవుతున్నారు. దీనికి కారణం చిన్న వయసులోనే చర్మంపై ముడుతలు, వృద్ధాప్య ఛాయలు రావడం. ఎప్పటికీ యంగ్‌లా కనిపించాలని మనసులో కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లు హంజాలోయకు వెళ్లి సెటిల్‌ అవ్వొచ్చు. అక్కడ సిటీ కల్చర్‌ లేకపోయినా 90 శాతం అక్షరాస్యత ఉంది. హంజాలోయ పాకిస్థాన్‌ గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ పర్వతాల మధ్యలో కారాకోరం హైవే చెంత ఉంది. ఈ అద్బుతమైన ప్రకృతి రమణీయ ప్రాంతాన్ని చూశాక, మళ్లీ రావాలనిపించదు. అక్కడే స్థిరపడాలనుకునే ప్రదేశం. చైనా సరిహద్దున హంజానది పక్కన ఉంది. ఇందులో చాలా పట్టణాలున్నాయి. వీటిని ‘యవ్వనుల ఒయాసిస్సులు’ అంటారు. అక్కడ 15 వేల మంది జనం ఒక్కొక్కరు సగటున 120 ఏండ్లపాటు జీవిస్తున్నారు. అందుకే ఈ ప్రదేశాన్ని బ్లూజోన్‌గా పిలుస్తారు. వీల్లందరికీ అలెగ్జాండర్‌ అంటే ఇష్టం. ఆయన యుద్ధం విరమించుకొని వెళ్తూ గాయాల పాలైన సైనికుల్ని బాల్టిర్‌ లోయలో వదిలి వెళ్లాడు. ఆ బాల్టిర్‌ ఉన్నది హంజా లోయలోనే. వాళ్లకు రోగాలు నయమయ్యాయి. దాంతో అక్కడే స్థిరపడ్డారు. వారి వారసులమంటూ అక్కడి ప్రజలు చెప్పుకుంటారు. వీరిలో కొంతమంది యూరోపియన్లలా, రష్యన్‌లలా కనిపిస్తారు. వీళ్లు మాట్లాడే బురుషాస్కీ భాషకు ప్రపంచంలోని ఏ భాషతోనూ సంబంధం ఉండదు. వీరికి ఉర్దూ తెలుసు. ఇంగ్లీష్‌ మాట్లాడగలరు.
Khanjaloya2

వారి ఆరోగ్య రహస్యం

హంజాలోయలోని వాళ్లంతా ఆరోగ్యంగా, యవ్వనంగా ఎలా కనిపిస్తున్నారన్నది ప్రపంచమంతా తెలుసుకోవాలనుకుంటున్న విషయం. వీరంతా స్వచ్ఛమైన పర్వత గాలిని పీలుస్తున్నారు. మైనస్‌ 15 డిగ్రీల మంచు పర్వతాల నుంచి వచ్చే చల్లటి నీటితోనే స్నానం చేస్తారు. ఆ స్వచ్ఛమైన నీటినే తాగుతారు. అందువల్ల వందేండ్లు వచ్చినా అలసిపోకుండా ఆటలు ఆడుతారు. వీరు ఎక్కువగా టీ తాగుతారు. కాకపోతే టీ పొడి వాడరు. స్థానికంగా పండే తుమురు తేయాకులు, తులసి, పుదీనా ఆకుల్ని ఉడకబెట్టి తాగుతారు. చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఇది కాపాడుతున్నది. మహా అంటే పాకిస్థాన్‌లో ప్రజలు 67 ఏండ్లు, భారత్‌లో 68, చైనాలో 75 ఏండ్లు జీవిస్తారని అంచనా. ఐతే హంజాలోయలో సగటు జీవితకాలం 120 ఏండ్లుగా ఉంది. అక్కడ వృద్ధులు కూడా ఎంతో బలంగా, చురుగ్గా ఉంటారు. రోజుకు రెండుసార్లు భోజనం. బ్రెడ్‌తో ఆకుకూరల్ని మిక్స్‌ చేసి తింటారు. దీన్ని గార్మా అంటారు. ఇది దాదాపు సూప్‌లా ఉంటుంది. బోజనంతోపాటు ఎండిన ఆప్రికాట్‌ సూప్‌ తీసుకుంటారు. సూర్యుడు అస్తమించగానే భోజనం చేస్తారు. అందువల్ల వీరికి షుగర్‌లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి. రొట్టెలు, కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్లు బాగా తీసుకుంటారు. ఎండాకాలంలో పండ్లు బాగా తింటారు. చలికాలంలో ఎండబెట్టిన ఆఫ్రికాట్‌, మొలకెత్తిన గింజలు, వెన్న తీసుకుంటారు. పండించే పంటలు సహజసిద్ధంగానే సాగు చేస్తారు.
Khanjaloya3

ఆ పద్ధతే వేరు!

వీరు క్షణం కూడా ఖాళీగా కూర్చోరు. టీవీ చూడరు. మొబైల్‌ వాడరు. ఎప్పుడూ ఏదో పనిచేస్తూనే ఉంటారు. సంప్రదాయ ఆటలు ఎక్కువగా ఆడుతారు కాబట్టి శరీరం, కండరాలూ నిరంతరం కదులుతూనే ఉంటాయి. మరో విషయం ఏంటంటే 90 ఏండ్ల వయసులో కూడా పిల్లల్ని కనేవాళ్లు ఉన్నారంటే నమ్మగలరా? వీరి ముఖంపై చిరునవ్వు కనిపిస్తూనే ఉంటుంది. మనసును ప్రశాంతంగా ఉంచడం వల్ల బీపీ, షుగర్‌, గుండెజబ్బులు వంటివి దరిచేరవు. హన్జావ్యాలీలో ప్రజలు తినే ఎండబెట్టిన ఆప్రికాట్‌ పండ్లు.. క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటున్నాయి. వీటిలో బి-12 ఎక్కువగా ఉంటుంది. వీటి ధర ఎక్కువగానే ఉంటుంది. వీరు పండించే పంట కాబట్టి రోజూ ఆహారంగా తీసుకుంటారు. ఏడాదిలో 4 నెలలు ఆహార కొరత ఏర్పడుతుంది. ఆ సమయంలో ఆహారానికి బదులుగా ఈ పండ్ల రసాన్ని తాగుతారు. ఆప్రికాట్‌ ఎండిపోయిన తర్వాత కూడా అందులో పోషకాలు ఏమాత్రం తగ్గవు. కాబట్టి హంజా ఆప్రికాట్‌కు ఆమెరికాలో విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఇక్కడ కేన్సర్‌ ఎందుకు రావడంలేదన్న దానిపై లోతైన పరిశోధనలూ జరుగుతున్నాయి.

262
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles