ఆ యజమాని ఏమయ్యాడు?


Sun,October 6, 2019 02:33 AM

dogs
టెక్సాస్‌లోని అదొక ఏకాంత ప్రదేశం. ఇంటి చుట్టూ ఆరు అడుగుల ఫెన్సింగ్‌. కానీ, ఆ ఇంట్లో ఉండేది 57 యేండ్ల ఫ్రెడ్డీ మ్యాక్‌ ఒక్కడే. అతనికి బంధువులు, స్నేహితులున్నా ఎవరూ ఇంటివైపు వచ్చే ధైర్యం చెయ్యరు. ఎందుకంటే అతనింట్లో 18 రకాల కుక్కలు ఉంటాయి. వాటిని చూసిన ఎవ్వరైనా ‘బతుకుజీవుడా’ అంటూ పరుగెత్తాల్సిందే. ఆ కుక్కలే అతనికి అన్నీ. అలాంటి జంతుప్రేమికుడు ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు.

జాన్సన్‌ కౌంటీ షరీఫ్‌కు చెందిన పోలీసులు రెండు కార్లలో ఫ్రెడ్డీ మ్యాక్‌ ఇంటికి వచ్చారు. కారణం.. గత ఏప్రిల్‌ 19 నుంచి మ్యాక్‌కు సంబంధించి ఎలాంటి సమాచారమూ లేకపోవడమే. అప్పుడప్పుడూ బంధువులు, స్నేహితులు ఫోన్‌లో మాట్లాడేవారు. మ్యాక్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తుండడం, అతని జాడ తెలియకపోవడంతో అతడి ఇంటికి వెళ్లే ధైర్యం లేక పోలీసులకు ఫిర్యాదుచేశారు.విచారణలో భాగంగా మ్యాక్‌ ఇంటికి వెళ్లిన పోలీసులను ఆ 18 రకాల కుక్కలు అడుగు పెట్టనివ్వలేదు. వారిని చూసి అవన్నీ ఒక్కసారిగా ఎగబడ్డాయి. వాటి అరుపులు, కోపానికి పోలీసులు సైతం భయపడ్డారు. ఆ కుక్కలను అదుపులోకి తీసుకోకపోతే విచారణ ముందుకుసాగదని వారికి అర్థమైంది.
dogs1
బయటి నుంచే మ్యాక్‌ ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అపరిచితులు, దొంగలు ఎవరైనా వచ్చారేమోనని అడుగు జాడల కోసం వెతికారు. అందుకోసం ఫెన్సింగ్‌ పక్కనే ఉన్న గడ్డిని మొత్తం కత్తిరించారు. ఎక్కడా ఎలాంటి ఆధారం దొరకలేదు. పోలీసులు ఎటువైపు అడుగుపెట్టినా.. ఐదారు కుక్కలు గుంపుగా ఎగబడేవి. ఇక లాభం లేదనుకొని ఆ కుక్కలకు మత్తు మందు ఇచ్చారు.ఒక్కొక్కరుగా ఇంట్లోకి అడుగుపెట్టిన పోలీసులు.. లోపల ఇల్లంతా గాలించారు. కుక్కల షెడ్డులో కూడా వెతికారు. ఎక్కడా మ్యాక్‌ జాడ కనిపించలేదు. దీంతో మ్యాక్‌ను ఎవరైనా హత్య చేసి ఉంటారేమోనని అనుమానించారు పోలీసులు. హత్యచేస్తే అక్కడ శవం ఉండాలి. కానీ అది కనిపించలేదు. హత్య చేసిన ఆనావాళ్లూ లేవూ. దీంతో అతడిని ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఉండొచ్చని, హత్యచేసి శవాన్ని తీసుకెళ్లిపోయి ఉండవచ్చని భావించారు. అప్పటి నుంచి ఫ్రెడ్డీ మ్యాక్‌ గురించి ఆరా తీస్తూనే ఉన్నారు. మ్యాక్‌ అదృశ్యం కేసు టెక్సాస్‌ పోలీసులకు సవాల్‌గా మారింది.
dogs2
మే 9న డిటెక్టివ్‌లు రంగంలోకి దిగారు. ఫ్రెడ్డీ మ్యాక్‌ ఇంటిలోకి వెళ్లేందుకు మరోసారి విఫలమయ్యారు. కారణం కుక్కలే. చేసేది లేక డ్రోన్‌తో ఇల్లంతా జల్లెడ పట్టారు. చుట్టు పక్కల పరిసరాలను డ్రోన్‌తో పరిశోధించారు. ఎక్కడా ఎలాంటి ఆధారం దొరకలేదు.
మే 10న ఇరుగు పొరుగువారిని విచారించారు. వారు చెప్పిన కొన్ని వివరాల ద్వారా మ్యాక్‌ తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఆస్పత్రుల్లో గాలించారు. జైళ్లలో వెతికారు. అయినా ప్రయోజనం లేదు. ‘ఫ్రెడ్డీ మ్యాక్‌ తప్పిపోయాడు’ అంటూ ప్రకటన చేశారు. చివరి ప్రయత్నంగా సోషల్‌ మీడియాలో, స్థానిక చానెళ్లలో వార్తలు ఇచ్చారు. ఫలితం శూన్యం.మ్యాక్‌ అదృశ్యమైన దగ్గర్నుంచి ఆ 18 రకాల కుక్కల బాగోగులు అతని బంధువులే చూసుకుంటున్నారు. కొద్ది రోజులకు వాటి పోషణ భారమైంది. ‘వాటిని పోషించలేమని’ పోలీసులకు తెగేసి చెప్పారు.

మ్యాక్‌ కోసం ఏప్రిల్‌ 19 నుంచి ఇటు పోలీసులు, అటు డిటెక్టివ్‌లు వెతుకుతూనే ఉన్నారు. ఎంతపెద్ద నేరమైనా హంతకులు ఎక్కడో ఒక చిన్న ‘క్లూ’ వదులుతారనే విశ్వాసం ఉన్నా.. మ్యాక్‌ విషయంలో అది నెరవేరడం లేదు. ఇక ఆఖరి ప్రయత్నంగా మరోసారి మ్యాక్‌ ఇంటిని పరిశీలించాలనుకున్నారు.మే 15న కుక్కలను అదుపులోకి తీసుకున్న పోలీసులకు ఈసారి 16 కుక్కలే కనిపించాయి. మిగతా రెండు ఆకలికి తట్టుకోలేకనో, తోటి కుక్కల దాడిలోనో మరణించాయి. డిటెక్టివ్‌లు మ్యాక్‌ ఇంటికి వెళ్లారు. ఇంటి లోపల గడ్డిని శుభ్రం చేశారు. ఈసారి కుక్కలున్న గదిని చాలా ‘క్షుణ్ణంగా’ పరిశీలించారు. ఒక డిటెక్టివ్‌కు ఎందుకో కుక్కల మలంపై అనుమానం వచ్చింది. ఓ చోట కుక్క మలంలో ఓ గుడ్డ పీలక కనిపించింది. మొదట దానిపై అనుమానం వ్యక్తం చేయని డిటెక్టివ్‌.. మరోచోట మలంలో చిన్నచిన్న ఎముకలు ఉన్నట్లు గుర్తించాడు. మరికొన్ని ఆధారాలు సేకరించి వాటిని డీఎన్‌ఏ టెస్టుకు పంపారు.
dogs3
డీఎన్‌ఏ వివరాలు చూసిన పోలీసులు, డిటెక్టివ్‌లు షాక్‌కు గురయ్యారు. కారణం ఆ ఆధారాలన్నీ ఫ్రెడ్డీ మ్యాక్‌వే. అయితే కుక్కలే అతన్ని చంపి తిన్నాయా? అంటే అవుననే అన్నారు అక్కడి డిటెక్టివ్‌లు. పోషించిన యజమానినే కుక్కలు దారుణంగా చంపి తినడం, చుట్టుపక్కల ఎక్కడా కూడా కనీసం రక్తపు మరకలు కూడా లేకపోవడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. వేటాడే జంతువులేవైనా మాంసం తిని, రక్తం తాగి.. పుర్రె, ఎముకలు వంటివి ముట్టుకోవు. అలాంటిది ఈ కుక్కలు రక్తపు మరకలు, అస్థికలు కూడా కనిపించనంతగా మనిషిని తినేయడంపై పోలీసులు, డిటెక్టివ్‌లు అవాక్కయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న మ్యాక్‌ను చనిపోయిన తర్వాత కుక్కలు తినేశాయా? లేదా అతన్ని చంపిన తర్వాత తిన్నాయా? అనే సందేహం. మ్యాక్‌ను ఎవరైనా హత్యచేసి వాటికి ఆహారంగా వేశారా? అనే కోణంలో ఆలోచించినా.. చిక్కుముడి వీడడం లేదు. ఎందుకంటే.. ఆ కుక్కలు ఎవరినీ ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చేవి కావని, అతని బంధువులు కూడా లోపలికి వెళ్లాలంటే భయపడేవారని స్థానికులు చెబుతున్నారు. దీంతో పోలీసులు అతడిని కుక్కలే తినేశాయని నిర్ధారించి కేసు మూసివేశారు. పోలీసులు, డిటెక్టివ్‌లు మిస్టరీ ఛేదించామని చెబుతున్నా.. అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. చివరికి కుక్కలే దోషులని తేలింది.

367
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles