వదులుకోవడం


Sun,October 6, 2019 02:30 AM

king
‘రాజా! నేనంత అర్హుణ్ణో పాదాభివందనానికి మీరూ అంత అర్హులే’ అన్నాడు.రాజు ‘అన్నీ ఉన్నవాణ్ణి నేను. మీరేమో అన్నీ వదులుకున్న వాళ్ళు. మీరే అర్హులు’ అన్నాడు.‘మీరు కూడా వదులుకున్నవారే’ అన్నాడు సన్యాసి.‘అదెలా?’ సందేహం వ్యక్త పరిచాడు రాజు.

ఒక రాజు మందీ మార్బలంతో తీర్థయాత్రకు బయల్దేరాడు. ఆయనేదో సర్వసంగపరిత్యాగి అవుదామని కాదు. తన పేరు పలుకుబడి, ఆస్తి, ఐశ్వర్యం మరింత పెరుగాలన్న కాంక్షతో పుణ్యక్షేత్రాల సందర్శనకు బయల్దేరాడు. అంతేకానీ దైవభక్తితో కాదు.
అట్లా వెళుతూ మార్గమధ్యంలో ఒక గ్రామంలో విడిది చేశాడు. ఆ గ్రామాన్ని ఆనుకునే పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక సన్యాసి ఆశ్రమం ఉంది. గ్రామస్థులకు ఆయనంటే ఎంతో గౌరవం. పైగా ఆయన ఒకప్పుడు రాజు. ఆధ్యాత్మిక అన్వేషణలో అన్నీ వదులుకుని వచ్చిన వాడు. అందువల్ల జనాలకు ఆయనంటే మరింత ఇష్టం.

రాజుకు ఆ సన్యాసిని కలుసుకోవాలన్న కోరిక కలిగింది. పైగా అతను కూడా ఒకప్పుడు తనలాగే రాజు. వైభోగాలు అనుభవించినవాడు. హఠాత్తుగా అన్నీ వదులుకొని సన్యాసిగా మారిన అతని పట్ల రాజుకు ఇష్టం కలిగింది.
రాజు మొదట తన రాకను తెలుపుతూ మనుషుల్ని పంపాడు. సన్యాసి సంతోషించి రాజును సాదరంగా ఆహ్వానించాడు. రాజు పరిసరాల్ని పరిశీలించి సన్యాసి నిరాడంబర జీవితానికి ఆశ్చర్య పడ్డాడు. అంత గొప్ప వ్యక్తికి ప్రణమిల్లడం తన కర్తవ్యంగా భావించాడు. తలవంచి సన్యాసి పాదాల్ని తాకబోయాడు. సన్యాసి తన పాదాల్ని వెనక్కి తీసుకొని ‘మహారాజా! మీరు సార్వభౌములు ఎందుకని మీరు నా పాదాల్ని తాకాలనుకుంటున్నారు?’ అని అడిగాడు.
రాజు! ‘మీరు ఒకప్పుడు రాజు అని విన్నాను. ఎన్నో రాజ వైభోగాలు, కీర్తి ప్రతిష్ఠలు అన్నీ తృణప్రాయంగా వదులుకొని ఇలా సన్యాసి జీవితం గడపడం అన్నది గొప్ప విషయం. పైగా ఇది అందరికీ సాధ్యపడేది కాదు. అంత గొప్ప త్యాగం చేసిన మీరు అభివాదానికి అర్హులు. అందుకనే మీ పాదాల్ని తాకాలని నేను ప్రయత్నించాను’ అన్నాడు.

సన్యాసి చిరునవ్వు నవ్వాడు.
‘రాజా! మొదట మీరు విశ్రాంతి తీసుకోండి. నా ఆతిథ్యం స్వీకరించండి. తరువాత మనం సావధానంగా ఈ విషయమై చర్చించుకుందాం’ అన్నాడు.

రాజు ‘సరే’నన్నాడు.
సన్యాసి తన నిరాడంబరమైన సాధారణ భోజనాన్ని, ఫలాల్ని రాజుకు సమర్పించాడు. రాజు వాటిని భుజించి జరుగబోయే చర్చ గురించి ఆలోచించాడు.
సన్యాసి ‘రాజా! మనం ఈ విషయమై చర్చించేముందు మీ పరివారాన్ని బయట ఉండమనండి. మనిద్దరమే ఈ విషయం చర్చించుకోవాలి’ అన్నాడు. రాజు ఆజ్ఞతో పరివారం దూరం వెళ్ళారు.
సన్యాసి ‘రాజా! నేనంత అర్హుణ్ణో పాదాభివందనానికి మీరూ అంత అర్హులే’ అన్నాడు.
రాజు ‘అన్నీ ఉన్నవాణ్ణి నేను. మీరేమో అన్నీ వదులుకున్న వాళ్ళు. మీరే అర్హులు’ అన్నాడు.

‘మీరు కూడా వదులుకున్నవారే’ అన్నాడు సన్యాసి.
‘అదెలా?’ సందేహం వ్యక్త పరిచాడు రాజు.
సన్యాసి ‘రాజా ఇద్దరు వ్యక్తులకు రెండు గదులు ఎదురెదురుగా ఉన్నాయి. వాటిలో వజ్రాలు నగలు ఉన్నాయి. కానీ, అవన్నీ మురికినీటిలా ఉన్నాయి. ఒకరేమో వజ్రాలు, బంగారం కోసం మురికినీటిని బయటకు విసురుతున్నాడు. మరొకరేమో మురికినీటికోసం వజ్రాల్ని బంగారాన్ని బయటికి విసురుతున్నాడు. మీరు ఆ మురికి నీటిని ఆధ్యాత్మిక జలంగా భావించండి. మీరు ఐశ్వర్యం కోసం మీ ఆధ్యాత్మిక జలాన్ని వదులుకుంటున్నట్లే కదా! నేను ఆధ్యాత్మిక జలం కోసం వజ్రాల్ని, బంగారాన్ని వదులుకుంటున్నా కదా! మనిద్దరిలో ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అని ఎట్లా చెబుతాం?’ అన్నాడు.
రాజు తన అహంకారాన్ని వదిలి సన్యాసికి అభివాదం చేశాడు.

ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్‌ నంబర్‌లో తెలియజేయండి.

168
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles