వాస్తు


Sun,October 6, 2019 02:05 AM

vasthu

మా ఊరు అడవిలో, కొండల ప్రాంతంలో ఉంది. అలాంటి ఊళ్లలో ఉండవచ్చా? అక్కడ ఇల్లు కట్టుకోవచ్చా?

- యశ్వంత్‌, ఆదిలాబాద్‌
పల్లెలు, తండాలు కొన్ని గూడెంలు అటవీ ప్రాంతంలోనే ఉంటాయి. అవి చిన్న గ్రామాలుగా ఉంటాయి. పరిసరాలు పటిష్ఠంగా ఉండి ఊర్లు, ఎక్కడ ఉన్నా అవి పెద్దపెద్ద భవనాలు కాకపోయినా దిశానుకూలంగా కుదిరి ఉంటే కొన్ని డాబుసరి ఇండ్ల కన్నా గొప్పగా ఉంటాయి. గడ్డి పువ్వుకు ఉన్న ప్రాణప్రదమైన ఉనికి బంగారు పుష్పానికి రాదు. వైభవం వేరు, వ్యాల్యూ వేరు. మీ ఊరిలో మీ ఇల్లు ఎలా కట్టారో తెలియదు కానీ ఊర్లు లేకుండా పట్టణాలు పుట్టలేదు. గొప్ప ఇండ్లు నగరాల్లోనే ఉంటాయి. పల్లెల్లో ఉండవు అనుకోవద్దు. మహా నేతలు అందరూ పల్లెటూర్ల నుండి వచ్చిన వాళ్లే. చక్కని ఇల్లు అనేది శాస్త్ర సంబంధంగా నిర్ధారణ అవుతుంది. అది పల్లె పట్టణాలతో కాదు. మీకు అవకాశం ఉంటే మీ గూడెంలో లేదా ఊరిలో మంచి ఇల్లు కట్టండి. దానిని మట్టి గోడలతో, పెంకులతో కట్టినా ఫరవాలేదు. మన పల్లెటూర్లలో ఎన్నో ఛత్రశాల భవంతులు సాధారణంగా కట్టినవి కనబడతాయి. అవి వ్యాపారాత్మకంగా కనబడకపోవచ్చు కానీ అమ్మలా పూర్ణంగా ఉంటాయి.

స్థలం మధ్యలో సెల్లార్‌ తీసుకోవచ్చా?

-వి.రోహన్‌, రాజాపేట, యాదగిరిజిల్లా
భూమిని ఎలా వాడుకోవాలి.. అనేది మనిషికి అర్థం కాక అనేక అవస్థలు పడుతున్నాడు. సహజ సిద్ధమైన భూమి పొరలతో ఎన్నో అద్భుత నిధులు మానవుల మనుగడను కాపాడుతుంటాయి. దానిని తవ్వితవ్వి గుళ్లు చేస్తున్నాడు. సెల్లార్‌ తీయడం వల్ల చాలావరకు భూశక్తి తగ్గుతుంది. అందుకే వాణిజ్య సెల్లార్‌ నిర్మాణాలలో వ్యాపార సంబంధ భావనలు తప్ప ఆత్మిక భావనలు పొడచూపవు. నిర్వీర్యత అన్నది వ్యక్తిలో ఉత్పన్నమైనప్పుడు వాటిని చక్కని పరిసరాలు మాత్రమే లేకుండా చేస్తాయి. ఒక పూర్ణత్వ తృప్తిని ఇవ్వగలుగుతాయి. కాబట్టి గృహాలలో సెల్లార్‌ నిషేధం. మీరు మీ నిర్మాణంలో సెల్లార్‌ ప్రాధాన్యం తగ్గించి ప్లాన్‌ చేయండి. పైగా స్థలం మధ్యలో సెల్లార్‌ తీసి చుట్టూ కట్టడాలు చేయడం మంచిదికాదు. భూమిపై నుండే చుట్టూ కట్టడం చేసి మధ్య ఓపెన్‌ వదలడం వేరు, గొయ్యితో వదలడం వేరు. మీరు అనుకున్నట్టు దిగుడుబావులు, స్నానగుండాలు తదితర యాత్రాస్థలాల్లో మధ్య నీటిగుండం ఉండి చుట్టూ గదుల నిర్మాణం పనికి వస్తుంది. మీరు అవసరం అయితే తూర్పు ఉత్తర, ఈశాన్యాలతో సెల్లార్‌ తీసుకొని దానికి దక్షిణం లేదా పడమరల నుండి లోపలికి వెళ్లే విధంగా ర్యాంపులు ఏర్పాటు చేసుకొని వాడండి.

బాధలు తొలగడానికి భగవంతుని ప్రార్థన చాలా? ఇల్లు పగులగొట్టాలా?

-కల్వల మౌనిక, పరిగి
వాస్తు అనగానే ఇండ్లు పగులగొట్టే బ్యాచి అనే భావన మీకు ఉన్నట్టుంది. టేకు చెట్టును కొట్టి నిట్టనిలువుగా కోసి చెక్కలు తీసి చేస్తేనే చక్కని సింహద్వారం అవుతుంది. జీవితాలను నిలబెట్టాలంటే కొన్ని సందర్భాలలో ఇల్లు కొట్టాల్సి వస్తుంది. కొన్ని భాగాలను తిరిగి కట్టాల్సి వస్తుంది. అదంతా శాస్త్ర పద్ధతిననుసరించే చేయాలి. సర్జరీ చేసే డాక్టరుకు రోగిని బతికించే లక్ష్యం మాత్రమే ఉంటుంది కానీ కడుపుకోయాలనే ఇంటెన్షన్‌ ఎందుకుంటుంది. ఇక ఇల్లు బాగున్నా లేకున్నా భగవంతుడి ప్రార్థన, పూజ అనేవి తప్పక అవసరమే. జన్మగతంగా వచ్చేకొన్ని ఇబ్బందులు, వాటి తీవ్రతలు తగ్గాలంటే మంచి ఇంటితోపాటు భగవంతునికి నివేదన కూడా చేయాలి. అన్నింటికీ దేవుడిని ముందువేసి మనిషిగా ఏ ప్రయత్నం చేయకుంటే ప్రయోజనం ఉండదు. వరాలిచ్చే గుడినైనా ఎవరో కొందరు శ్రమించి నిర్మించిందే కదా. శాస్ర్తాలను అర్థం చేసుకోవడానికి కేవలం అక్షరజ్ఞానం ఒక్కటే సరిపోదు. సంగీత జ్ఞానం రావాలంటే స్వరాల పుస్తకం చదివితే రాదు. గాత్రంతో సాధన చేయాలి. అనంతమైన ప్రకృతి అంతరంగం అర్థం కావటానికి ఋషుల దారి అనుసరించక తప్పదు.
SUDHHALA
సుద్దాల సుధాకర్‌ తేజ
[email protected]
Cell: 7993467678

195
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles