చెడీతాలింఖానా వీరంగం!


Sun,September 29, 2019 01:34 AM

కత్తి దూసే ధీరుల నుంచి కర్రసాము చేసే వీరుల వరకూ ఇంటికొకరు ఉంటారక్కడ. గొడవలైనా, అల్లర్లు జరిగినా, ధర్మమైనా, అధర్మమైనా ఏనాడూ ఆయుధాన్ని ఉపయోగించరు, ఆ ఒక్కరోజు తప్ప. పాండవులు ధర్మయుద్ధం గెలిచేందుకు జమ్మిచెట్టు మీది నుంచి ఆయుధాలు తీసినట్లే.. ఆ ఊరి వారంతా ఆ ఒక్కరోజు మాత్రమే ఆయుధాలు చేపడతారు. వీధుల్లో వీరవిహారం చేస్తారు. ఒళ్లు గగుర్పొడిచేలా విన్యాసాలు ప్రదర్శిస్తారు.

-డప్పు రవి

భారత స్వాతంత్య్ర పోరాటం ముమ్మరంగా సాగుతున్న రోజులవి. అందులో యువకులను ఎక్కువ సంఖ్యలో భాగస్వాములను చేయాలంటే వారందరినీ ఐక్యపరిచే వేదికలు కావాలని యోచించారు బాలగంగాధర్ తిలక్.ఆ సమయంలోనే వాడవాడల్లో వినాయక చవితికి వినాయకుడి విగ్రహాల ఏర్పాటు, దసరాకు దుర్గామాత విగ్రహాల ఏర్పాటుకు పిలుపునిచ్చారు. అతను అనుకున్నట్టుగానే యువతలో చలనం వచ్చింది. వాడవాడల్లోని ఉత్సవాల్లో యువకులే అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదే సరైన సమయం అనుకున్న తిలక్.. బర్మా వేదికగా యువకులకు యుద్ధ మెళకువలు నేర్పిస్తున్నారు. శత్రువును ఎదుర్కొనేందుకు, తప్పని పరిస్థితుల్లో క్షణాల్లోనే మట్టుపెట్టేందుకు ఎన్నో యుద్ధవిద్యలు నేర్పించారు. వాటిల్లో ఒకటి చెడీతాలింఖానా. కత్తులు, కర్రలు, అగ్గిబరాటాలు, బాణాలు, లేడికొమ్ములు, పట్టాకత్తులతో వేగంగా శత్రువుపై దాడి చేయడం ఈ యుద్ధక్రీడలోని అంశాలు. అత్యంత రహస్యంగా సాగుతున్న ఈ శిక్షణ గురించి తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన అబ్బిరెడ్డి రామదాసు తన మేనమామ ద్వారా తెలుసుకున్నారు. రామదాసు కూడా బర్మా వెళ్లి.. చెడీతాలింఖానా నేర్చుకున్నారు. ఆ విద్య అంతరించిపోకుండా అమలాపురంలో యువతకు నేర్పించారు. అలా 160యేండ్ల నుంచి ఈ క్రీడను కాపాడుతున్నారు.
Fest

విజయదశమి రోజున..

ప్రతియేటా దసరా పండుగ కోసం అమలాపురంలోని యుద్ధవీరులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులోని ఈ యుద్ధకళ గురించి తెలిసినవారు వేయికండ్లతో ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే విజయదశమి రోజు అమలాపురంలో పెద్ద ఊరేగింపు నిర్వహిస్తారు. ఇందులో ఆ యుద్ధక్రీడ అయిన చెడీతాలింఖాన విన్యాసాలను ప్రదర్శిస్తారు. చిడతకర్రలు, బాణా కర్రలు, లేడికొమ్ములు, వేణుబాణం, అగ్గిబరాటాలు, పటాకత్తులతో చిన్నారుల నుంచి యువకుల వరకు చేసే విన్యాసాలు అదరహో అనిపిస్తాయి. ఇవి వీక్షకులను ఆద్యంతం గగుర్పాటుకు గురిచేస్తాయి. అడుగుల ఆధారంగా చేసే ఈ విద్యలో ఏ అడుగు తడబడినా అటు ఎదుటివారి ప్రాణాలకే కాదు.. వీరుడి ప్రాణాలకూ ప్రమాదమే. కత్తుల ఖణేల్‌లు, బళ్లేల జిగేల్‌లు.. రణవేదికలుగా మారిన రహదారులను, రాచరికపు యుద్ధ విన్యాసాలను విజయదశమి రోజు చూడొచ్చు.

బేతాళ పూజల అనంతరం..

దసరా వేడుకల్లో ముందుగా చెప్పుకోదగింది బేతాళుడి గురించి. విజయదశమికి 5 రోజులు ముందుగా పదేళ్ల వయసుగల బాలుడిని ఎంచుకొని బేతాళుడుగా భావిస్తారు. అతనితో గుడిలో ప్రత్యేక పూజలు చేయిస్తారు. విజయదశమి రోజు వరకు ఆ దీక్ష కొనసాగుతుంది. దీక్ష ముగిసే వరకు బాలుడ్ని గుడిలోనే ఉంచుతారు. దీక్ష అనంతరం విజయదశమి రోజున ఆయుధాలు తీసుకుని, వాటిని జమ్మిచెట్టు వద్ద ఉంచి, ఆయుధపూజ నిర్వహిస్తారు. అనంతరం దశమి సంబరాలకు ఆ ఆయుధాలతో ఊరేగింపుగా వెళ్తారు. అప్పుడు కర్రలు, కత్తులు, అగ్గిబరాటాలు, బళ్లేలు ఇలా వారు ఏది పట్టుకున్నా అగ్గిపిడుగులే కనిపిస్తాయి. వారి చేతుల్లో ఆయుధాలు మెలితిరిగే విన్యాసాలు చూపరుల కళ్లను పక్కకు తిప్పుకోకుండా చేస్తాయి. ఒక్క వేణుబాణంతో 50 మంది ప్రత్యర్థులను నిలువరించగల ధీరత్వం వారి సొంతం. ఈ చెడీతాలింఖానా గురించి తెలుసుకున్న ప్రముఖ దర్శకుడు రాజమౌళి మగధీర సినిమాలో వారి ప్రదర్శనలను ఉపయోగించుకున్నారంటే ఈ యుద్ధక్రీడకు ఎంత గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు.

చిన్ననాటి నుంచే శిక్షణ

చెడీతాలింఖానా విద్యను దాదాపు 160 యేండ్ల పైబడి అబ్బిరెడ్డి రామదాసు కుటుంబసభ్యులు నేర్పుతూనే ఉన్నారు. అమెరికాలో ఇంజినీర్‌గా పని చేస్తున్న రామదాసు వారసుడు మల్లేష్.. వారసత్వంగా వస్తున్న చెడీతాలింఖానా గురువుగా బాధ్యతలు చేపట్టి యువకులకు శిక్షణ ఇస్తున్నారు. పిల్లలు, వృద్ధులు తారతమ్యం లేకుండా 10 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వృద్ధుల వరకు ఈ విద్యను నేర్చుకొని ప్రతి దసరాకు ప్రదర్శిస్తుంటారు. అందుకే దశాబ్దాల నుంచి ఈ చెడీతాలింఖానాకు గుర్తింపు వస్తూనే ఉన్నది.
Chaditalinkhana-Boy

పలు వీధుల్లో పోరుదళాలు

విజయదశమి నాడు అమలాపురం వీధుల్లో జరిగే ప్రదర్శనల సందడి అంతాఇంతా కాదు. చెడీతాలింఖానా ఆద్యంతం ఉద్విగ్నభరితంగా సాగుతుంది. కండ్లకు గంతలు కట్టుకుని మనిషి శరీరం, కంఠం, నుదురు, పొత్తికడుపుపై కొబ్బరికాయలు, కాయగూరలు పెట్టి నరకడం వంటి విన్యాసాలు ముఖ్య ఘట్టాలు. అగ్గిబరాటాలు, లేడికొమ్ములు, పట్టాకత్తులతో వేగంగా, ఒడుపుగా కదులుతూ యువకులు చేసే విన్యాసాలు చూస్తే.. ఔరా అనాల్సిందే. ఏడు వీధుల వారు ప్రదర్శనగా పట్టణ పురవీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. బాజాభజంత్రీలు, డప్పువాయిద్యాలు, శక్తివేషాలు, కోయ నృత్యాలు, బుట్టబొమ్మలు, తీన్‌మార్ బ్యాండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

233
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles