జ్ఞానదంతం


Sun,September 29, 2019 01:04 AM

అబ్బా.. పన్ను నొప్పిగా ఉంది. మూడు రోజుల నుంచి ఏమీ తిననీయడం లేదు నా భార్య పద్మ బాధతో పొద్దున్నుంచి ఇప్పటి వరకు అలా అనడం పదహారోసారి. దవడ పన్ను వస్తున్నట్లుంది.. ఈ నొప్పి భరించలేకపోతున్నా.. నొప్పి తగ్గేందుకు టాబ్లెట్స్ తెమ్మన్నా కదా గుర్తు చేయడంతో పాటు.. తన బాధ పట్టించుకోవడం లేదనే కోపం కూడా కనిపించిందామె మాటల్లో.జ్ఞానదంతం వస్తున్నట్లుంది. అది వచ్చేటపుడు నొప్పి అట్లనే ఉంటుంది కారణం వివరించి చెప్పాను. ఏం జ్ఞానదంతమో ఏమో.. అది వచ్చుడేమో కానీ నొప్పి భరించలేనంత ఉంది అన్నది నొప్పి తాలూకు బాధను దిగమింగుతూ. ఏం తిననిస్తలేదు.. నీళ్లు కూడా తాగేటప్పుడు గొంతు దగ్గర నొప్పి పెడుతున్నది అన్నది పద్మ. నొప్పి కొంచెం భరించు. అదే పోతది. మొత్తానికి నీకు జ్ఞానోదయం అవుతుందన్న మాట అన్నాను, టాపిక్‌ను డైవర్ట్ చేస్తూ. జ్ఞానోదయం అంటే నాకు ఇపుడే జ్ఞానం వస్తుందనా? ఇప్పటి వరకు జ్ఞానం లేదన్నట్టా? కొరకొరా చూస్తూ అడిగింది.అదేం కాదు.. ఈ పన్ను కొద్దిగా లేట్‌గా వస్తుంది. అందుకే దాన్ని జ్ఞానదంతం అంటారు. దాన్నే ఇలా నీకు చెప్పాను అన్నాను. అవునూ.. నీకు జ్ఞానోదయం అయిందా? అన్నది చురక వేసినట్లుగా. ఓ నాకు అయి పదేండ్లవుతున్నది అన్నాను వెంటనే తమాయించుకోకుండా. ఏమో నాకైతే అనుమానమే అన్నది. నాకు అర్థం కాలె. అంటే అన్నాను. నువు అప్పుడప్పుడు జ్ఞానం ఉన్నోడిలెక్క మాట్లాడవు కద. అందుకే అన్నది ముక్కుసూటిగా, కుండబద్దలుకొట్టినట్లు. ఆ మాట తూటలెక్క వచ్చి తాకింది.
Memory

ఒక్కసారి గతుక్కుమని వెంటనే నిబాయించుకొని... అంత జ్ఞానం లేని పనులు నేనెప్పడు చేశానో అన్నాను. కొంచెం వెటకారం, కొద్దిగా కోపం జోడించి. నేను ఇంట్లో లేనప్పుడు నీ ఫ్రెండెవడో చికెన్ మంచిగా వండిండని పొగిడినవ్ కద. ఏనాడైనా నేను కూరలు మంచిగ చేసిన అని చెప్పినవా? టాపిక్ మెల్లగా ఎటో డైవర్టయితుందని తెలిసిపోతున్నది. అవును వాడు మంచిగ చేసిండు అని చెబితే తప్పా? అన్నాను సమర్థించుకుంటు. మంచిగ చేసిండని చెప్పడమే కాదు.. కొద్దిగా అలా తెలుసుకొని నువ్వు కూడా చెయ్ అని కూడా అన్నావు కద. అది తప్పు కాదా? వాదన ఎటో పోతున్నదని అర్థమవుతున్నది. కొంచెం మౌనంగా ఉండటమే బెటర్ అనిపించింది. తనే మళ్లీ అందుకున్నది. నేను చేసినవి నచ్చవ్ కానీ.. పొరుగింటోళ్లు, ఎదురింటోళ్లు.. ఎవరెవరో చేసినవి నీకు నచ్చుతయ్ వెటకారం పాలు పెంచుతూ పోతున్నది. అయినా నేను నేర్చుకునుడేంది? నువ్వే మీ దోస్తు దగ్గర ఎట్లా కూర వండాల్నో నేర్చుకునేదుంటివి? ఏం నువ్వు కూరలు చేస్తే తప్పా? ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ ధాటికి తట్టుకోలేక కొద్దిగా ఆనకట్ట వేయాలని.. సరే... సరేలేవే నేనే నేర్చుకుంటగాని.

ఇక పోనియ్ అన్నాను, ఇంతటితో దీనికి పుల్‌స్టాప్ పెడదామని. ఇదొక్కటే కాదు.. వాడికి హోంవర్క్ విషయంలో నువ్వేమైనా సహాయం చేస్తున్నావా? వాడి పుస్తకాలు ఒక్కసారైనా చూశావా? మళ్లీ అందుకున్నది. ఇపుడు ఇంకో విషయంపై కడిగేస్తుందని అర్థమయింది. కొడుకు శరత్ చదువు మీదకు మళ్లింది టాపిక్. నీకు తెలుసు కద పద్మ. ఆఫీసు నుంచి వచ్చుడే లేట్‌గా వస్త. అలిసిపోయి ఉంట. మళ్లీ ఇవన్నీ నేనెక్కడ చూసుకోవాలె చెప్పు మళ్లీ సమర్థించుకునే ప్రయత్నం చేసిన. అయినా నీకు ఇంట్లో పనేగా.. ఆ హోం వర్క్ సంగతి నువ్వు చూసుకోలేవా? అన్నాను. తోక తొక్కిన తాచులా ఒక్కసారి కస్సున లేచింది. ఇంట్లో పనేగా అంటే.. అంత అల్కగ కనబడుతుందా? ఒక్కసారి నువ్వు ఇంట్లో పనంతా చేసి పెట్టు చూస్త? సవాల్ విరిసింది. నేను చేసే పనితో పోల్చితే ఇంటి పనే కష్టమనే రీతిలో మాట్లాడింది. ఈ స్కూల్ మంచిగ లేదు.. ఆ స్కూల్ మంచిగ లేదని రెండేండ్ల కొకసారి మారుస్తున్నవ్. మారిస్తే అయిపోయిందా? వాడి చదువు గురించి నీకు పట్టింపు ఉండొద్దా? అన్నది. ఈ ప్రశ్నల తుఫాను ఇప్పట్లో ఆగేటట్లు లేదురా దేవుడా అని నన్ను నేను మనసులో తిట్టుకున్నా, అనవసరంగా జ్ఞానదంతం గురించి మాట్లాడి విషయం పెద్దది చేశానని. అనుభవించు బిడ్డ.. అని నన్ను నేను తిట్టుకుంటూ... అయినా హోం వర్క్‌లో నేను కలుగజేసుకునేటంత పెద్ద విషయం ఏముంటుంది పద్మ. నువ్వు చూసుకోగలవు కద. అన్నాను.

ఇదో పెద్ద సమస్యా అన్నట్లుగా. మీరట్లనే అంటారు. మీరు మార్చిన కొత్త స్కూల్‌లో కొత్త కొత్త హోం వర్క్‌లిస్తున్నారు. సిలబస్‌కు సంబంధం లేనివి. అన్నది. అప్పుడర్థమయింది నాకు హోం వర్క్ బాధ. అయితేంటంట.. నీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందిగ.. ఏ విషయం కావాలన్నా గూగులమ్మ తల్లిని అడిగేస్తే సరి. ఆమె అన్నీ చెప్పేస్తది. వాటినే బుక్కులో పెడితే ఖలాస్ అన్నాను ఉచిత సలహా పారేస్తూ. ఇంగ్లీష్, తెలుగు కథల పుస్తకాల్లోని కథలు, వాటి పబ్లిషర్ల పేర్లు, సమీక్ష చేయాలంట ఇదంతా మనం దగ్గరుండి చేయాలి అని కొద్ది సేపు ఆగి.. కొంచెం మీరు టైమిస్తే ఈ పని తొందరగా అవుతుంది కద అన్నది. కొంచెం కోపం తగ్గినట్లుంది. అయినా మీరు స్కూల్ అప్లికేషన్ ఫారంలో ఒక కాలమ్ చూశారా? మీరు మీ పిల్లలతో రోజుకు ఎంతసేపు గడుపుతారు? అని ఉంది అన్నది గుర్తు చేస్తూ. మా వాడికి నేను టైమ్ ఇవ్వడం లేదనే విషయాన్ని పరోక్షంగా గుర్తు చేస్తున్నదన్నమాట. నాకర్థమయింది. సరేలే .. రేపట్నుంచి నేను కూడా హోం వర్క్ చూస్తాను సరేనా? అన్నాను ఇక ఈ వాదనకు ముగింపునిద్దామని. పేరెంట్స్ మీటింగుకు డుమ్మా కొడితే నడువదు మరి మళ్లీ అందుకున్నది పద్మ. మొన్న పేరెంట్స్ మీటింగ్‌కు భార్యాభర్తలు కలిసి వచ్చారు. నేనొక్కదాన్నే వెళ్లి కలిసిన. మీరు కూడా వచ్చి ఉంటే కొన్ని విషయాలు టీచర్‌తో మాట్లాడి ఉండేవాళ్లం కద. అన్నది. సరే సరే.. వస్తాలే అన్న కొంచెం అసహనంగా. జ్ఞానం నాకు లేదంటున్నారు. మీకే ఇంకా రాలేదనుకుంటా అన్నది మళ్లీ బాంబువేస్తూ. మీ కన్నీ తెలుసంటారు కదా. మరి, ఈ విషయాలను ఎందుకు పట్టించుకోరు? అన్నది.
ఆఫీసు పనే కాదు.. ఇంట్లో కూడా సమయం ఇవ్వాలి. భార్యను గౌరవించాలి. ప్రేమించాలి. అస్తమానం అవమానించొద్దు. పొగడకపోయినా పర్వలేదు. చులకనగా చూస్తే తట్టుకోలేము అని కళ్లలోకి కళ్లు పెట్టి చూసేందుకు మొహమాటపడుతూ పక్కకు తిరిగి అన్నది. ఆఫీసు పని సరిపోలేదని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ ఫోన్‌లోనో, టీవీలోనో ముఖం పెడతారు. గంటలు గంటలు ఫోన్లు మాట్లాడతారు.. ఓ రెండు నిమిషాలు మాతో మాత్రం మాట్లాడరు అని ఒక్కొక్క బాణాన్ని సూటిగా సంధిస్తూ వెళ్తున్నది. నాకు జ్ఞానోదయం అయిందే బాబు.. ఇక వదిలిపెట్టు అన్నాను, కొంచెం కోపం, కొంచెం అసహనం, కొంచెం తెచ్చిపెట్టుకున్న నవ్వుతో.

మీరు మీ పిల్లలతో రోజుకు ఎంతసేపు గడుపుతారు? అని ఉంది అన్నది గుర్తు చేస్తూ. మా వాడికి నేను టైమ్ ఇవ్వడం లేదనే విషయాన్ని పరోక్షంగా గుర్తు చేస్తున్నదన్నమాట. నాకర్థమయింది. సరేలే .. రేపట్నుంచి నేను కూడా హోం వర్క్ చూస్తాను సరేనా? అన్నాను ఇక ఈ వాదనకు ముగింపునిద్దామని. పేరెంట్స్ మీటింగుకు డుమ్మా కొడితే నడువదు మరి మళ్లీ అందుకున్నది పద్మ. మొన్న పేరెంట్స్ మీటింగ్‌కు భార్యాభర్తలు కలిసి వచ్చారు. నేనొక్కదాన్నే వెళ్లి కలిసిన. మీరు కూడా వచ్చి ఉంటే కొన్ని విషయాలు టీచర్‌తో మాట్లాడి ఉండేవాళ్లం కద. అన్నది.

-దండుగుల శ్రీనివాస్ , సెల్: 8096677451

270
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles