మహిమాన్వితం చెర్వుగట్టు క్షేత్రం


Sun,September 29, 2019 02:45 AM

నల్లగొండ జిల్లాలో అతిపురాతనమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఆలయం చెర్వుగట్టు జడల రామలింగేశ్వరస్వామి వారి ఆలయం. ఈ ప్రాంతం చెరువు గట్టున ఉండటం, శివలింగంపై జడల మాదిరిగా రేఖలు ఉండటం, ఈ లింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించడం వల్ల,కొండ దిగువన పార్వతీదేవి కొలువై ఉండటంతో... పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంగా ప్రసిద్ధికెక్కింది. యుగాల నాటి చరిత్ర ఉన్న ఈ దేవాలయం అతిపురాతనమైన ఆలయాల్లో ఒకటి. లోక కల్యాణార్థం పరశురాముడు 108 క్షేత్రాల్లో శివలింగాలను ప్రతిష్ఠించగా... అందులో ఈ ఆలయంలోని శివలింగమే ఆఖరిది.

పశ్చిమాభిముఖంతో ఇక్కడ శివుడు కొలువై ఉండడం చెర్వుగట్టు క్షేత్రం ప్రత్యేకత. భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారమై కష్టాలను తొలగించి సకల సంపదలతోపాటు ఆరోగ్యాలను అందిం చే మహిమాన్విత క్షేత్రంగా ఇది పేరొందుతున్నది. కొండపై స్వామివారి ప్రధాన ఆలయంతోపాటు పంచముఖ ఆంజనేయస్వామి, ఎల్లమ్మ దేవత, కాలభైరవస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజూ ఈ ఆలయాల్లో నిత్యపూజలు జరుగుతుంటాయి.
Temple

పాదుకలు తాకించడం: భూత ప్రేత పిశాచ బాధలతో సతమతమయ్యేవారికి స్వా మి వారి పాదుకలను తాకించడం ఆనవాయతీగా వస్తున్నది. వివాహ ం, సంతానం కావలసినవారు ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి వేడుకుంటారు. స్వామిపాదాలను శిరస్సుపై పెట్టుకొని 11, 21 లేదా 41మార్లు ప్రదక్షిణలు చేయడం, సాష్టాంగ నమస్కారంతో తలపై పాదుకలను పెట్టుకొని స్వామివారిని వేడుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. సమీపంలోని స్వామివారి పుష్కరిణిలో స్నానమాచరించి తడివస్ర్తాలతోపాదుక పూజ చేస్తారు.

ఘనంగా లక్ష పుష్పార్చన: ప్రతీ అమావాస్య నాడు గట్టుపై పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలకు లక్ష పుష్పార్చన ప్రధానార్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి కోనేరు వద్ద పంచహారతులు సమర్పిస్తారు. అమావాస్య రోజున గట్టుపై నిద్రచేసే భక్తులు లక్షపుష్పార్చనలో పాల్గొని భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయంలో తొలి ఏకాదశినాడు, కార్తీక సోమవారాల్లో, పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాలలోఉత్సవాలు జరుగుతుంటాయి.
cheruvugattu

మూడు గుండ్లు: కైలాసాన కొలువై ఉన్న శివుడు భూలోకాన చెర్వుగట్టు సమీపాన అతి ఎత్తైన మూడు గుండ్లపై వెలిశాడు. తనను మూడు గుండ్లు ఎక్కి దర్శించే భక్తుల సమస్త కోరికలు తీర్చుతాడనే నమ్మకంతో ప్రతి భక్తుడు మూడు గుండ్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. సమస్త పాపభీతి, కష్టాలు, కల్మషాలు, శారీరక, మానసిక క్షీణతలు పోయి ఆరోగ్యవంతులుగా, సిరిగల భక్తులుగా విరాజిల్లుతారనే మూడు గుండ్లపై గల శ్రీరామలింగేశ్వరుని దర్శించుకోవడానికి భక్తులు పోటీ పడుతారు. గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి స్వామివారిని దర్శించుకొని క్షీరాభిషేకం చేస్తారు. ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తుంటాడు. కొండపై గుహలోగల జడల రామలింగేశ్వరునికి 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ గణపతిదేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడు.

పుష్కరిణి ప్రత్యేకత: గతంలో గుట్టపై ఇరుకైన స్థలంలో పుష్కరిణి ఉండేది. ఆలయానికి భక్తుల ఆదరణ పెరగడంతో 10 ఏండ్ల క్రితం నూతనంగా పుష్కరిణి నిర్మించారు. ఈ దేవాలయానికి వచ్చే ప్రతి భక్తుడు పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. పుష్కరిణిలో నీటిని భక్తులు బాటిళ్లలో తీసుకొని తమ ఇళ్లల్లో, వ్యవసాయ భూముల్లో చల్లుకుంటారు.

అమావాస్య జాతర

హరహర మహాదేవ.. శంభోశంకర అంటూ అమావాస్య రోజు న శివనామ స్మరణలతో చెర్వుగట్టు క్షేత్రం మారుమోగుతుం ది. ఈ క్షేత్రం ఆరోగ్య క్షేత్రంగా కూడా ప్రాచుర్యం పొందింది. మానసిక రుగ్మతలతో బాధపడే భక్తులు ఈ క్షేత్రంపై మండల దీక్ష చేసి స్వామివారిని సేవిస్తే అనారోగ్యం మటుమాయమై సంపూర్ణ ఆరోగ్యవంతులౌతారని భక్తుల నమ్మకం. ఈ కారణంగానే వివిధ జిల్లాల నుంచి ప్రతి అమావాస్య తిథి రోజున జాతరను మించి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. తమ కోరికలు తీర్చుకునేందుకు భక్తులు వరుసగా 5 లేక 9 అమావాస్యలు గుట్టపై నిద్రచేసి స్వామివారిని దర్శించుకుంటారు. అమావాస్య రోజు రాష్ట్రం నలుమూలల నుంచి శివసత్తులు చెర్వుగట్టుకు చేరుకొని అమ్మవారికి బోనం సమర్పిస్తారు.
cheruvugattu1

ఎక్కడ ఉంది? :నల్లగొండ జిల్లాకు 14 కిలోమీటర్ల దూరంలో, నార్కట్‌పల్లి మండల కేంద్రానికి 6 కిలో మీటర్ల దూరంలో ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఆ గ్రామానికి తూర్పువైపున ఒక చెరువు, ఆ చెరువు గట్టున పార్వతీ సమేత మల్లికార్జునస్వామి దేవాలయం ఉంది.

229
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles