సాక్షాత్కార సందర్భం


Sun,September 29, 2019 02:19 AM

ఒక అడవిలో ఆశ్రమం నిర్మించుకొని ఒక తాంత్రికుడు కాళీమాత గురించి తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు. ఎంతో నిష్ఠతో నిరంతర ధ్యానంలో మునిగాడు. అద్భుతాలు అందుకొని అందరికీ తన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించాలని అతని కాంక్ష. ఆ శక్తుల్ని కాళికాదేవి తనకు తప్పక ప్రసాదిస్తుందని అతని నమ్మకం. సూర్యోదయాన్నే వేచి స్నానాదికాలు ముగించి చీకటి పడే పర్యంతం అతను కాళీమాత నామజపంలో గడిపేవాడు.ఒక పేదవాడు రోజూ అడవికి వచ్చి వనమూలికలు సేకరించి వాటిని ఊళ్లో అమ్మి జీవించేవాడు. అతను దాదాపు రోజూ తాంత్రికుణ్ణి చూసేవాడు. గౌరవంతో అతనికి అభివాదం చేసేవాడు. ఒకరోజు పేదవాడికి తాంత్రికుడు ఎందుకు తపస్సు చేస్తున్నాడో అడగాలనిపించింది.మెల్లగా తాంత్రికుణ్ణి సమీపించి స్వామీ! నేను ఎన్నో రోజుల నుంచీ మిమ్మల్ని చూస్తున్నాను. ఎప్పటినుండో మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నా? మీరు ఎందుకని ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నారు. ఏమి సాధించాలనుకుంటున్నారు? అని అడిగాడు.తాంత్రికుడు బాబూ! నేను అద్భుత శక్తుల్ని సంపాదించాలనుకుంటున్నా. దానికి కాళికాదేవిని ప్రత్యక్షం చేసుకోవాలని తపస్సు చేస్తున్నా. ఆమె ప్రత్యక్షమైతే ఆ శక్తుల్ని అందుకునే వరాన్ని అడగాలనుకుంటున్నా అన్నాడు.
Kalimatha

మరి ఆ సందర్భం ఎప్పుడు వస్తుంది?ఈ అమావాస్య రోజు తప్పక ఆ మహాకాళి ప్రత్యక్షమవుతుందని నా మనసు చెబుతోంది అన్నాడు.పేదవాడు సెలవు తీసుకున్నాడు.ఎప్పటిలా పేదవాడు రోజూ వనమూలికల కోసం వస్తూనే ఉన్నాడు. అట్లాగే అమావాస్య రోజు కూడా వచ్చాడు. వనమూలికలు సేకరించి వెళ్ళబోతూ తాంత్రికుడు ఈ రోజు మహాకాళి ప్రత్యక్షమవుతుందని చెప్పడు కదా? నేనూ ఆ మహాతల్లిని చూస్తే నా జన్మ తరిస్తుంది కదా! అనుకున్నాడు.ఇంత గొప్ప అవకాశం తనలాంటి పేదవాడికి మళ్ళీ మళ్ళీ రాదు కదా! అనుకొని ఆశ్రమానికి దగ్గరగా వున్న ఒక పెద్ద చెట్టు ఎక్కి కూర్చున్నాడు.దూరంగా ధ్యానంలో ఉన్న తాంత్రికుణ్ణి చూస్తూ కూర్చున్నాడు.అంతలో పెద్దపులి గాండ్రింపు వినపడింది. పులి గర్జన అరణ్యమంతా ప్రతిధ్వనించింది. పేదవాడికి కూడా భయం కలిగింది. ధ్యానంలో ఉన్న తాంత్రికుడు కూడా అదిరిపడ్డాడు.రెండోసారి పులి గాండ్రింపుకు ధ్యానం ఎగిరిపోయి తాంత్రికుడు లేచి పారిపోయి పొదల్లో మాయమయ్యాడు. తరువాత అంతా నిశ్శబ్దం.

పేదవాడు మెల్లగా చెట్టుదిగి తాంత్రికుడు తపస్సు చేసే స్థలానికి వచ్చాడు. అక్కడవున్న పులిచర్మంపై కూర్చున్నాడు. పద్మాసనం వేసుకొని అచ్చం తాంత్రికుడిలా కళ్ళు మూసుకొని కాళికాదేవి నామజపం ప్రారంభించాడు.అంతలో హఠాత్తుగా కాళికాదేవి అతనిముందు ప్రత్యక్షమై నాయనా! నీ ప్రార్థన ఫలించింది. నీ ముందు ప్రత్యక్షమయ్యాను. నీకు ఏమి కావాలంటే అది ఇస్తాను. ఏదైనా వరం కోరుకో అంది.పేదవాడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అంతా అతనికి కలలా వుంది. అతను కాళికాదేవికి సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి అమ్మా! నేను మామూలు మనిషిని. నేను ఎప్పుడో కానీ దేవుణ్ణి తలచుకోనివాణ్ణి. అట్లాంటి నా మీద నీకు ఎందుకు తల్లీ ఇంత దయ కలిగింది అన్నాడు.కాళికాదేవి! నాయనా! నువ్వు నిష్కల్మషమైన వాడివి. స్వచ్ఛమైన వాడివి. దైవంతో సరాసరి సంబంధమున్నవాడివి. ఏ ప్రయోజనమూ ఆశించని ఉత్తముడివి. అద్భుత శక్తుల్ని ఆశించే స్వార్థం నీకు లేదు. అందుకనే నువ్వంటే నాకూ ఇష్టం. నేను ప్రత్యక్షం కావాల్సిన సరైన సందర్భమిదే! అంది.తల్లి అపారకరుణకు పేదవాడు తన్మయం చెందాడు.

184
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles