పద్య రత్నాలు-21


Sun,September 29, 2019 01:58 AM

లోభత్వం పనికిరాదు!

అతిగుణహీన లోభికి బదార్థము గల్గిన లేకయుండినన్
మితముగగాని కల్మిగల మీదట నైన భుజింప డింపుగా
సతమని నమ్ము దేహమును సంపద, నేఱులునిండి పాఱినన్
గతుకగ జూచు గుక్కదనకట్టడ మీఱకయెందు భాస్కరా!

-భాస్కర శతకం
Poem
తాత్పర్యం:ఏటిలో నీరు నిండుగా పారుతున్నా కుక్క నాలుకతోనే కొంచెం కొంచెమే నీటిని తాగినట్లుగా లోభి పిసినారితనాన్ని ప్రదర్శిస్తాడు. సంపదలెన్ని ఉన్నా కడుపు నిండా తినక, దాచిదాచి దొంగల పాల్జేస్తాడు. సృష్టిలో ఏది శాశ్వతం, ఏది అశాశ్వతమో తెలుసుకొని మెలగాలి. అక్కర్లేని లోభత్వాన్ని ప్రదర్శిస్తే ఎవరికీ ఏ లాభమూ లేకపోగా, విలువైన సమయాన్ని కోల్పోతాం.

ప్రేమకు ఏవీ సాటిరావు!

జపములు గంగాయాత్రలు
తపములు నోములు దానధర్మంబులు పు
ణ్యపురాణములు పతిభక్తికి
నుపమింపను సాటిరాక యుందు కుమారీ!

- కుమారీ శతకం
Poem1

తాత్పర్యం:భార్యాభర్తల నడుమ అనుబంధాన్ని మించినదేదీ ఉండదు. భర్తపట్ల భార్యకు, భార్యయెడల భర్తకు ప్రేమానురాగాలు సమాన స్థాయిలో ఉండాలి. ప్రేమతోనే వారిమధ్య పరస్పర బంధం పెనవేసుకొంటుంది. జపాలు, గంగాయాత్రలు, తపాలు, నోములు, దానధర్మాలు వంటి పుణ్యకార్యాలెన్ని చేసినా, ప్రేమ (భక్తి)ను మాత్రం మరవరాదు.

మనసారా నిన్నే పూజిస్తాను!

ఱాలన్ ఱువ్వగ చేతులాడవు, కుమారా రమ్మురమ్మంచు నే
చాలన్ చంపగ, నేత్రము ల్దివియగా శక్తుండ నే గాను, నా
శ్రీలంబేమని చెప్పనున్న దిక నీ చిత్తంబు, నా భాగ్యమో
శ్రీలక్ష్మీసపతి సేవితాంఘ్రియుగళా! శ్రీకాళహస్తీశ్వరా!

- శ్రీ కాళహస్తీశ్వర శతకం
Poem2

తాత్పర్యం:శంకరా! నేను అతి సామాన్య భక్తుడను. మనసారా నిన్నే సేవించడం తప్ప మరేమీ చేయలేను. బోయవాని వలె రాళ్లను పూలుగా చేసి పూజించలేను. నా కుమారుని అర్పించలేను. ఏకంగా నా కండ్లు పీకి నీకివ్వలేను. అంతటి హింసాత్మక భక్తిని నేను ప్రదర్శించలేను. నా మనసారా నిన్నే పూజిస్తాను. నీకు ప్రియమైన నన్ను నీ దరిజేర్చుకొనుమయ్యా!

ఎందరుంటే ఏమి లాభం?

తల్లిదండ్రులు భార్య తనయు లాప్తులు బావమఱదు లన్నలు మేనమమామ గారు
ఘనముగా బంధువుల్ కల్గినప్పటికైన దాను దర్లగ వెంటదగిలి రారు
యుముని దూతలు ప్రాణమపహరించుక పోగ మమతతో బోరాడి మాన్పలేరు
బలగమందఱు దు:ఖపడుట మాత్రమెకాని, యించుక యాయుష్య మీయలేరు
చుట్టములమీది భ్రమదీసి చూరజెక్కి
సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు
భూషణ వికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!!

- నరసింహ శతకం
Poem3

తాత్పర్యం:మరణం ఆసన్నమైతే మృత్యుబారినుంచి కాపాడే వారెవరూ ఉండరు. తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఆప్తులు, బావమరుదులు, అన్నలు, మేనమామలు ఎందరు బంధువులున్నా వారెవరూ మన ప్రాణం పోయేవేళ యమునితో పోరాడలేరు. ఈ సత్యం తెలిసి, ఆ భ్రమను వదిలి, నిన్నే నమ్మి నా జీవితాన్ని సార్థకం చేసుకొంటాను స్వామీ!

181
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles