కుటుంబం చేసిన హత్య


Sun,September 8, 2019 02:35 AM

-నల్లసూరీడు నెల్సన్‌ మండేలా

Nelson-Mandela
ఒక దేశానికి అధ్యక్షుడిగా ఉండి 80 ఏళ్ల వయస్సులో తను ప్రేమలో పడ్డానని ప్రకటించడమే కాకుండా పక్క దేశపు మాజీ అధ్యక్షుడి భార్యను పెళ్లి చేసుకున్న విలక్షణ వ్యక్తి నెల్సన్‌ మండేలా. అధ్యక్ష పదవి ముగియగానే తన భార్యతో గడపడానికి వెళుతున్నట్లు చెప్పి కొంతకాలం ప్రజాజీవితానికి దూరంగా గడిపాడు. అయితే చివరిరోజుల్లో ఆయన కుటుంబ సభ్యుల నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఒకవైపు ఆయన వారసులు ఆస్తిమీద హక్కుల కోసం పోరాటాలు ప్రారంభించారు. మానసిక సమస్యలు, శ్వాసకోశ జబ్బులు అయనను మరింత ఇబ్బందులకు గురిచేశాయి. ప్రపంచమంతా ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తుంటే కుటుంబసభ్యులు మాత్రం ఆయన మరణించాడని ప్రకటించి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు.
నల్లజాతి వారి జీవితాలలో శాంతిని నెలకొల్పడం, వారికి జాతీయ. ప్రాంతీయ ఎన్నికలలో ఓటు హక్కును కల్పించడం తన ప్రాథమ్యాలలో భాగమని పేర్కొంటూ ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు నెల్సన్‌ మండేలా. ఆయన పూర్తిపేరు ‘నెల్సన్‌ రోలిహ్లాహ్లా మండేలా’ మండేలా కుటుంబం ‘తెంబు‘ వంశానికి చెందింది. వీరు దక్షిణ ఆఫ్రికాలో ‘కేప్‌ ప్రాంతం‘లో ‘ట్రాన్సకెయన్‌" భాగాలకు సాంప్రదాయికంగా పాలకులు. ఇతడు ఉమాటా జిల్లాలో మవెజో అనే ఊరిలో 18 జూలై 1918న జన్మించాడు. ఇతని తాతలకాలంలో వారు పాలించే తెంబూ తెగల ప్రాంతం బ్రిటిష్‌ వలస పాలకుల పరమయ్యింది. మండేలా తండ్రి ‘గాడ్లా‘ హక్కుల ప్రకారం పాలకుడు కాకపోయినా కొన్ని స్థానిక తెగలకు నాయకుడిగా గుర్తింపు కలిగి ఉండేవాడు. స్థానిక కౌన్సిల్‌లో సభ్యుడు. గాడ్లాకు నలుగురు భార్యలు. పదముగ్గురు పిల్లలు. వారిలో గాడ్లా 3వ భార్య ‘నోసెకెని ఫాన్నీ‘కి జన్మించిన మగబిడ్డకు ‘రోలిహ్లాహ్లా‘ (అంటే కొమ్మలు లాగేవాడు -‘దుడుకు స్వభావం కలవాడు’) అని పేరు పెట్టారు.

మండేలా బాల్యం తల్లి కుటుంబానికి చెందిన గూడెం (‘ఉమ్జీ‘)లో అధికంగా గడచింది.ఏడవయేట రోలిహ్లాహ్లా చదువు ప్రారంభమైంది. వారి కుటుంబంలో బడికి వెళ్ళిన మొదటి వ్యక్తి అతనే. స్కూలులోని ఒక మెథడిస్ట్‌ ఉపాధ్యాయుడు అతనికి ‘నెల్సన్‌" అనే పేరు తగిలించాడు. ఎందుకంటే ఆయనకు రోలిహ్లాహ్లా పేరు పలకడం కష్టంగా ఉండేదట.తరువాత నెల్సన్‌ మండేలా చదువు వివిధ పాఠశాలలలో సాగింది. మెట్రిక్యులేషన్‌ తరువాత మండేలా ఫోర్ట్హేర్‌ విశ్వవిద్యాలయంలో బి.ఎ.లో చేరాడు. ఒక సంవత్సరం తరువాత విశ్వవిద్యాలయ రాజకీయాలలో పాల్గొన్న ఫలితంగా మండేలాను విశ్వవిద్యాలయంనుండి తీసేశారు. తరువాత అతను జైలులో ఉన్నపుడు లండన్‌ విశ్వవిద్యాలయం వారి దూరవిద్యా సదుపాయంతో బి.ఎల్‌. పూర్తి చేశాడు. ఆ తర్వాత ఫోర్ట్హేర్‌ వదిలిన కొద్దికాలానికే మండేలా జోహాన్స్‌బర్గ్‌కు వెళ్ళిపోయాడు. నగరంలో మండేలా చిన్నచిన్న ఉద్యోగాలు చేశాడు. తాను మధ్యలో ఆపివేసిన బి.ఎ. డిగ్రీ కోర్సును కరెస్పాండెన్స్‌ కోర్సు ద్వారా పూర్తి చేశాడు. తరువాత విట్‌వాటర్స్‌రాండ్‌ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువసాగాడు.

ఆ సమయంలో దక్షిణాఫ్రికా నేషనలిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. నల్ల, తెల్ల జాతుల మధ్య వివక్షత, ఇద్దరినీ వేరువేరుగా ఉంచడం వారి విధానం. ఆ పరిస్థితులలో 1952 డిఫెన్స్‌ క్యాంపెయిన్‌, 1955 పీపుల్స్‌ కాంగ్రెస్‌ కార్యక్రమాలలో నెల్సన్‌ మండేలా ప్రముఖంగా పాల్గొన్నాడు. ఈ సమయంలో మండేలా, అతని మిత్రుడు కలిసి స్థాపించిన ఒక లా సంస్థ ద్వారా అనేక పేద నల్లజాతివారికి ఉచితంగా న్యాయవాద సౌకర్యం కలిగించారు. మండేలా ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో చేరి వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాడు. మొదట్లో మండేలా శాంతియుతంగానే తన ప్రతిఘటనను నిర్వహించాడు. 5 డిసెంబరు 1956న మండేలా, మరో 150 మంది దేశద్రోహనేరంపై అరెసు అయ్యారు. 1956-61 కాలంలో సుదీర్ఘంగా నడచిన ఈ విచారణ అనంతరం వారందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. 1961లో మండేలా ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు సాయుధ విభాగాన్ని ఏర్పరచి దానికి అధ్యక్షుడు అయ్యాడు. ఈ విభాగం దళాలు ప్రభుత్వ, మిలిటరీ స్థానాలను లక్ష్యాలుగా చేసుకొని దాడులు నిర్వహించింది. జాతి వివక్షను అంతం చేయడానికి గెరిల్లా పోరాటం కొరకు ప్రణాళికలు కూడా తయారు చేసుకొన్నారు. 1980 దశకంలో వీరి దళాలు నిర్వహించిన గెరిల్లా పోరాటాలలో అనేకమంది మరణించారు.

శాంతియుత ప్రతిఘటన వల్ల ప్రయోజనం లేనందున, ప్రభుత్వం విచక్షణారహితంగా దమన విధానాన్ని అమలు చేస్తున్నందువల్ల, అన్ని మార్గాలూ మూసుకుపోవడం వల్ల తాము సాయుధపోరాటం వైపు మళ్ళవలసివచ్చిందని మండేలా సమర్ధించుకొన్నాడు. అయితే ఈ విధమైన సాయుధచర్యలవల్ల ఆఫ్రికా నేషనల్‌ కాంగ్రెస్‌ మానవ హక్కులను ఉల్లంఘించిందని తరువాతి కాలంలో మండేలా అంగీకరించాడు. 5 ఆగస్టు 1962న మండేలాను అరెస్టు చేశారు. అంతకు ముందు అతను 17 నెలలు అజ్ఞాతంలో ఉన్నా డు. మూడు రోజుల తరువాత అతనిపై అభియోగాలు మోపారు. 1961లో కార్మికులతో సమ్మె చేయించడమూ, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళడమూ కారణాలుగా. 25 అక్టోబర్‌ 1962న మండేలాకు ఐదు సంవత్సరాల శిక్ష విధించబడింది. రెండేళ్ళ తరువాత 11 జూన్‌ 1964న, అంతకుముందు ఆఫ్రికా నేషనల్‌ కాంగ్రెస్‌ లో అతని కార్యకలాపాల విషయంలో మరొక తీర్పు వెలువడింది. మండేలాపైన, తక్కినవారిపైన తీవ్రమైన నేరాలు ఆరోపించారు. ఆయనకు జీవితకాలం ఖైదు శిక్ష 12 జూన్‌ 1964న విధించబడింది.

జైలులో ఉన్న కాలంలోనే మండేలా లండన్‌ విశ్వవిద్యాలయం వారి విదేశీ ప్రోగ్రామ్‌ ద్వారా న్యాయవాద పట్టాను సాధించాడు. మార్చి 1982లో మండేలా, మరికొందరు నాయకులను రాబెన్‌ దీవినుండి పోల్స్మూర్‌ జైలుకు మార్చారు. 27 ఏళ్లు ఆయన జైలు జీవితాన్ని గడిపాడు. 1989లో ఫ్రెడెరిక్‌ విలియం క్లర్క్‌ అధ్యక్షుడయ్యాడు. క్లర్క్‌ ఫిబ్రవరి 1990 లో మండేలాను జైలు నుంచి విడుదల చేయడానికి ఉత్తర్వులు జారీ చేశాడు. ఫిబ్రవరి 2, 1990న దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన ఫ్రెడెరిక్‌ డీ క్లర్క్‌ ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, ఇతర జాతి వివక్ష వ్యతిరేక పోరాట సంస్థల మీద నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు మండేలా తొందరలో విడుదలవబోతున్నట్లు ప్రకటించాడు. దాంతో మండేలా విక్టర్‌ వెర్సర్‌ జైలు నుంచి ఫిబ్రవరి 11, 1990న విడుదలయ్యాడు. ఈ దృశ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం చేశారు. జైలు నుంచి విడుదలైన తరువాత ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నాయకత్వ పగ్గాలను తిరిగి స్వీకరించాడు. 1990,1994 మధ్యలో బహుళ పక్షాలతో సమావేశాన్ని ఏర్పరిచి దేశంలో మొట్టమొదటిసారిగా అన్ని జాతులవారికీ కలిపి ఎన్నికలను నిర్వహించేటట్లు చేశాడు.1993లో దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్‌ డి క్లర్క్‌తో కలిపి మండేలాకు సమిష్టిగా నోబెల్‌ బహుమతి ఇవ్వడం ద్వారా వారి కృషికి మరింత గుర్తింపు, ప్రోత్సాహం లభించాయి.

ఏప్రిల్‌ 27, 1994వ తారీఖున దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా పూర్తి ప్రజాస్వామ్యంతో కూడిన ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ 62 శాతం ఓట్లను సాధించింది. 1994, మే 10 వతేదీన మండేలా దేశానికి నల్లజాతికి చెందిన మొట్టమొదటి అధ్యక్షుడయ్యాడు. డీ క్లర్క్‌ ఉపాధ్యక్షుడిగానూ, థాబో ఎంబెకీ రెండవ ఉపాధ్యక్షుడిగానూ ఎన్నికయ్యారు. మే 1994 నుంచి జూన్‌ 1999 దాకా అధ్యక్షుడిగా పని చేసిన మండేలా జాతీయ, అంతర్జాతీయ విధానాలలో ఆయన చూపిన చొరవకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు లభించాయి.మూడవసారి పెళ్లి చేసుకుని భార్యతో వెళ్లిపోయిన నెల్సన్‌ మండేలా ప్రోస్టేట్‌ గ్రంథి క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుని 85వ ఏట తిరిగి ప్రజాజీవితంలోకి వచ్చాడు. అయితే ఆయన చివరిరోజుల్లో అనారోగ్యానికి గురయ్యారు. అయినా ఆయనను ఇతరులెవ్వరూ కలుసుకోకుండా ఆయన భార్య ఆంక్షలు విధించింది.

ఆభిమానులు వచ్చినా, నాయకులు వచ్చినా వెనక్కిపంపేది. విదేశీ ప్రముఖులు పోన్‌ చేసినా ఆయనకు ఇచ్చేదికాదు. 2012లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌, గాల్‌బ్లాడర్‌లో రాళ్లు తొలగింపు ఆపరేషన్‌ చేసి ఇంటికి పంపారు. కానీ మూడు నెలలకే వ్యాధి మళ్ళీ ముదిరింది. ఆయనను తిరిగి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ కూడా ఎవరూ ఆయనను కలుసుకోలేని పరిస్థితి కల్పించారు. ఆయనను ఒకరకంగా బంధీని చేశారు. ఒక దశలో ఆయన అవయవాలన్నీ చచ్చుబడిపోయాయి. ఇక ఆయన మరణించినట్లే అంటూ ప్రకటన ఇప్పించింది ఆయన భార్య. కానీ ఆయన కోలుకొని ఇంటికి వచ్చి మరో మూడు నెలలు బతికే ఉన్నాడు. అయితే అప్పటికే ఆయనకు యాంటీ బయాటిక్స్‌ పనిచేయని పరిస్థితి వచ్చింది. ఇంట్లో ఆ మూడు నెలలు జీవచ్ఛవంగా పడి ఉన్నాడు. ఆయన కుటుంబం కూడా ఆయన ఎప్పుడూ మరణిస్తాడా అని ఎదురు చూసింది. ప్రపంచాన్ని దుంఖసాగరంలో ముంచి ఆ నల్లసూరీడు 5 డిసెంతబర్‌ 2013న తుదిశ్వాస విడిచాడు. ఒక రకంగా ఆయన మరణానికి ఆయన కుటుంబమే కారణమైంది.
Nelson-Mandela2
జాతి వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించిన వీరుడు. సాయుధ పోరాటమే విజయాన్ని సాధిస్తుందని నమ్మి గెరిల్లా యుద్ధాన్ని ఎంచుకున్నవాడు. విద్యార్థి దశలో ఉద్యమాల బాట పట్టి యూనివర్సిటీ నుండి బహిష్కరణకు గురై జోహన్స్‌బర్గ్‌లో తొలి నల్లజాతి న్యాయవాదిగా అవతరించినవాడు. వర్ణవివక్ష ఉద్యమంలో జరిగిన మారణకాండకు బాధ్యుడిగా 27 సంవత్సరాల పాటు ‘రోబెన్‌' ద్వీపంలో జైలు శిక్షను అనుభవించినవాడు. ప్రారంభంలో హింసాత్మక పోరువైపు పయనించి ఆ తర్వాత గాంధేయవాదాన్ని తలకెత్తుకుని దక్షిణాఫ్రికాలో శాంతి స్థాపనకు కృషి చేసినవాడు. మొట్టమొదటిసారిగా అన్ని జాతులవారికీ కలిపి ఎన్నికలను నిర్వహించేటట్లు చేసినవాడు. ప్రజాస్వామ్య దక్షిణాఫ్రికాకు తొలి అధ్యక్షుడవ్వడమే కాకుండా అహింసాయుత పోరాటంలో విజయం సాధించి నోబెల్‌ శాంతిబహుమతి, భారతరత్న వంటి ప్రతిష్ఠాత్మక బహుమతులు అందుకున్నవాడు. ‘సానబట్టిన ఓ నల్లని వజ్రమా..నల్లజాతి గుండెల్లో రత్నమా, మరువలేము నిన్ను నెల్సన్‌మండేలా తరతరాలు మా గుండెల్లో ఉండేలా’ అంటూ ప్రపంచం తో కీర్తించబడిన దక్షిణాఫ్రికా గాంధీ నెల్సన్‌మండేలా చివరిపేజీ.
Nelson-Mandela3
మూడవ సారి పెళ్లి చేసుకుని భార్యతో వెళ్లి పోయిన నెల్సన్‌ మండేలా ప్రోస్టేట్‌ గ్రంథి క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుని 85వ ఏట తిరిగి ప్రజాజీవితంలోకి వచ్చాడు. అయితే ఆయన చివరిరోజుల్లో అనారోగ్యానికి గురయ్యారు. అయినా ఆయనను ఇతరులెవ్వరూ కలుసుకోకుండా ఆయన భార్య ఆంక్షలు విధించింది. ఆభిమానులు వచ్చినా, నాయకులు వచ్చినా వెనక్కిపంపేది.
Nelson-Mandela1
మండేలా విక్టర్‌ వెర్స్టర్‌ జైలు నుంచి ఫిబ్రవరి 11, 1990న విడుదలయ్యాడు. ఈ దృశ్యా న్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం చేశారు. జైలు నుంచి విడుదలైన తరువాత ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నాయకత్వ పగ్గాలను తిరిగి స్వీకరించాడు. 1990- 1994 మధ్యలో బహుళ పక్షాలతో సమావేశాన్ని ఏర్పరిచి దేశంలో మొట్టమొదటిసారిగా అన్ని జాతులవారికీ కలిపి ఎన్నికలను నిర్వహించేటట్లు చేశాడు. 1993లో దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్‌ డి క్లర్క్‌తో కలిసి మండేలా సమిష్టిగా నోబెల్‌ బహుమతి అందుకున్నారు.
-మధుకర్‌ వైద్యుల, సెల్‌: 9182777409

1663
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles