కొత్త ఇల్లు


Sun,September 8, 2019 02:15 AM

Kotha-ellu
రంపం లాంటి నాలుక గల తన భార్యని అలెక్‌ ఇక భరించలేకపోయాడు.
“నీకొకటి చూపించాలి. రా” కోరాడు.
గత రెండు రోజులుగా అతను ఆమెను అది కోరుతున్నాడు. సాధారణంగా అలెక్‌ చెప్పిన మాటని అతని భార్య మేరియన్‌ వినదు. మూడో రోజు అతను పదమూడోసారి అడిగాక విసుగ్గా చెప్పింది.
“ఏం చూపిస్తావు? సరే. పద.”
ముందు అలెక్‌, వెనక మేరియన్‌ మెట్లు దిగి వారి ఇంటి బేస్‌మెంట్లోకి వెళ్ళారు.
“ఏమిటి?” ఆమె చుట్టూ చూస్తూ అడిగింది.
“ఈ గోడ చూడు.”
మేరియన్‌ కంటిచూపు బావుండదు. ఆమె గోడ దగ్గరకి వెళ్ళి కళ్ళు చిట్లించి గోడనుండి పొరలుగా ఊడొచ్చే రంగుని చూసింది.
“ఇది చూపించడాని...”
అలెక్‌ సిద్ధంగా ఉంచుకున్న పొడుగు కాడగల పారతో వెనుకనించి ఆమె తలమీద బలంగా మోదడంతో ఆమె మాటలు మధ్యలో ఆగిపోయాయి. అతను ఎన్నడూ వినని వింత శబ్దం ఆమె నోట్లోంచి వినపడింది. కిందపడ్డ మేరియన్‌ తలమీద కోపంగా మరో దెబ్బ వేశాడు. ఇంకో దెబ్బ కూడా.
“పదమూడేళ్ళ నీ పీడ ఈనాటితో విరగడైంది” కోపంగా చెప్పాడు.
ఆ తర్వాత పైకొచ్చి, ఫ్రిజ్‌ తెరచి ఓ బీర్‌ సీసాని బయటకి తీసి తెరచి, ఫైర్‌ ప్లేస్‌ ముందున్న కుర్చీలో కూర్చున్నాడు. దాన్ని నెమ్మదిగా తాగుతూ, మండే నిప్పు వంక చూస్తూ కొద్దిసేపు కూర్చున్నాడు. ఇక తనని హింసించే భార్య లేదనే నిజాన్ని ఆనందంగా అనుభవించాక, ఆ భావోద్వేగం తగ్గాక నెమ్మదిగా లేచి మళ్ళీ కింద బేస్‌మెంట్‌కి వెళ్ళాడు.

ఆఖరి మెట్టుమీద నుంచి మేరియన్‌ వంక చూశాడు. ఆమెలో కదలిక లేక ఇందాక ఎలా పడుందో అలాగే పడుంది. అప్పటికి ఆమె తలలోంచి రక్తం కారడం ఆగింది.
కాళ్ళు పట్టుకుని పక్కకి లాగి తడిసిన నేలమీద చాక్‌పీస్‌తో గుర్తుకి గీత గీసి పలుగు అందుకున్నాడు. అతనికి ఆ గోతిని పూర్తిగా తవ్వడానికి ఎనిమిది గంటలు పట్టింది. అలసటతో మధ్య మధ్య ఆగి తవ్వాడు. ఐదడుగుల లోతు, ఆరడుగుల పొడవు, రెండున్నర అడుగుల వెడల్పు గల గోతిని తవ్వాక మేరియన్‌ శవాన్ని అందులోకి నెట్టాడు. ఆమె మెడలోని గొలుసుని కానీ, వేళ్ళకి ఉన్న రెండు ఉంగరాలు, వాచీలని కానీ తీయలేదు.
తమ పడకగదిలోకి వెళ్ళి వార్డ్‌రోబ్‌ని తెరచి ఆమె బట్టలన్నీ తెచ్చి ఆ గోతిలో శవం మీద వేశాడు. తర్వాత ఆమె బూట్లు, మేకప్‌ సామాను, నీలం రంగు తోలు సూట్‌కేస్‌ని కూడా తెచ్చి, దాని మూతని వేరు చేసి గోతిలో పడేశాడు. ఆమె ఇంట్లోంచి ఇంకో ఊరుకి వెళ్తే ఏమేం తీసుకెళ్తుందో అవన్నీ ఆ గోతిలో పడేశాడు. ఆమె కళ్ళజోళ్ళు, హేండ్‌బ్యాగ్‌, బంగారునగలతో సహా. తర్వాత ఏ తాకట్టు షాప్‌లోనో వాటిని తెలిసిన వాళ్ళు చూస్తే ప్రమాదమని అలెక్‌ మొదటి నుంచీ వాటిమీద ఆశ పడకూడదని నిర్ణయించుకున్నాడు.

అన్ని వస్తువులూ తెచ్చాడని తెలిసినా తృప్తి పడక ఇల్లంతా పిచ్చివాడిలా తిరిగి మేరియన్‌ వస్తువులు ఇంకేమైనా ఉన్నాయా అని వెదికాడు. వాషర్‌, డ్రైయర్‌ గదిలో ఆమె లోదుస్తుల మూట కనిపించింది. తీసుకెళ్ళి దాన్నీ గోతిలో పడేశాడు. తర్వాత గోతిని మట్టితో నింపాడు.
ఆ రోజుతో ఇక మేరియన్‌ తన జీవితంలోంచి శాశ్వతంగా నిష్ర్కమించిందని తృప్తిపడ్డ అలెక్‌ ఓ రెస్ట్‌రెంట్‌కి వెళ్ళి షాంపేన్‌ బాటిల్‌తో పండగ చేసుకున్నాడు.
మర్నాడు హోమ్‌ డిపో నుంచి కొనితెచ్చిన కాంక్రీట్‌ రెడీమిక్స్‌ సంచిని విప్పి మేరియన్‌ని పాతిపెట్టిన చోట సిమెంట్‌ చేసి మట్టి కనపడకుండా చేశాడు. అక్కడ కొత్తగా సిమెంట్‌ చేసినట్లు తెలిసినా కొద్ది నెలల తర్వాత పాత, కొత్త రంగులు కలిసిపోయి ఆ తర్వాత తేడా తెలీదు.
మర్నాడు చూస్తే తను సిమెంట్‌ చేసిన మేర మిగతా నేలతో పోలిస్తే వీసమెత్తు పైకి కనిపించింది. అతనిలో భయం కలిగింది. దాన్ని చూస్తే ఎవరికైనా మనిషి సమాధి అనే అనుమానం కలగచ్చు.
తన బేస్‌మెంట్లోకి ఎవరూ రారు. కానీ, మరమ్మత్తు చేయించాల్సిన అవసరం వస్తే ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌, గ్యాస్‌ రిపేర్‌మేన్‌ అక్కడికి రావాల్సి ఉంటుంది. పరిష్కారం ఏమిటా అని ఆలోచించాడు. శనివారం హోం డిపోకి వెళ్ళి బేస్‌మెంట్‌కి అవసరమైనవి కొని, నేలమీద టైల్స్‌ని అతికించి మొత్తానికి ఎత్తు తెలీకుండా నేలంతా సమానంగా కలిపాడు.

తర్వాతి శనివారానికల్లా నేల బాగా ఎండింది. కార్పెట్‌ని కొనుక్కొచ్చి నేలమీద పరిచాడు. ఇప్పుడు కింద సమాధి ఉందని ఎవరికీ తెలీదని నిర్ధారణ చేసుకుని తృప్తిపడ్డాడు.
“మా ఆవిడ కనపడిందా? మీరు ఎవరైనా చూశారా? ఒంటరిగా వెళ్ళిందా? లేక కూడా ఎవరైనా ఉన్నారా?” తన ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ప్రశ్నించాడు.
అతని పొరుగున ఉండే మిసెస్‌ రయాన్‌ వాళ్ళింటికి వచ్చిన ప్రతి మగాడితో మేరియన్‌కి సంబంధం ఉందని ప్రచారం చేయసాగింది. ఆమె అలా మాట్లాడి ఉండకపోతే బహుశ పోలీసులు మేరియన్‌ ఎలా మాయమైందా అని ఆరా తీసేవారని అలెక్‌ అనుకున్నాడు.
ఆ తర్వాత మేరియన్‌ వస్తువులు అడపా, దడపా కనిపిస్తూంటే వాటిని ఫైర్‌ ప్లేస్‌లోని నిప్పులో వేశాడు. నూలు దారబ్బంతి, హెయిర్‌ నెట్‌, అల్లిక సూదులు లాంటి ఆమె వస్తువులని చెత్తబుట్టలో పడేశాడు. తన భార్య విడిచి వెళ్ళిపోయిందని, ఎప్పుడు వస్తుందో, అసలు మళ్ళీ వస్తుందో, రాదో తెలీదని, తమ కుటుంబంతో పరిచయం ఉన్న అతి తక్కువ మందితో చెప్పాడు.
మేరియన్‌ మరణించిన నాలుగైదు నెలలదాకా అతనికి ఆమె తిరిగి వచ్చినట్లు పీడకలలు వచ్చేవి. ఫోన్‌ మోగినా, డోర్‌ బెల్‌ విన్నా పోలీసులేమో అని భయపడేవాడు. కానీ, క్రమంగా ఆ భయం తగ్గింది. తన రహస్యం బయట పడవచ్చనే ఒత్తిడి కూడా అతనిలో తగ్గింది.
ఆమె మరో పురుషడితో లేచిపోయిందన్న వదంతి విని మనసులో నవ్వుకున్నాడు. ఆ పని చేసి ఉంటే ఆమె చచ్చేది కాదని అనుకున్నాడు.

రాత్రుళ్ళు ఇంట్లో ఒంటరిగా తినలేక అలెక్‌ ఓ రెస్టారెంట్‌కి వెళ్ళి తినసాగాడు. అందులో పనిచేసే కోలెట్‌ అనే వెయిట్రెస్‌తో అతనికి పరిచయమైంది. త్వరలోనే అది పెళ్ళికి దారి తీసింది.
“ఓ చలికాలం రాత్రి ఆఫీస్‌ నుంచి ఇంటికి తిరిగి వచ్చాక చూస్తే మేరియన్‌ లేదు. ఐదు నెలలైనా తిరిగి రాలేదంటే ఇక రాదు. ఎవరితో లేచిపోయిందో తెలీదు. కానీ, చాలా పేర్లు బయటకి వచ్చాయి” అతను బాధగా చెప్పాడు.
మేరియన్‌తో పోలిస్తే కోలెట్‌ మృదుస్వభావి. మేరియన్‌లా సదా తిట్టదు. అతన్ని ఆనందంగా ఉంచాలనే చూసేది. మేరియన్‌ చేయని చాలా సేవలు కోలెట్‌ చేయసాగింది. కోలెట్‌తో అతని జీవితం ప్రశాంతంగా కొనసాగుతున్నది.
అకస్మాత్తుగా కోలెట్‌కి ఆ ఇల్లు నచ్చలేదు.
“ఈ పాత ఇంటిని అమ్మేసి ఆధునిక ఇంటిని కొందాం” ఓ రోజు భర్తని కోరింది.
తక్షణం అతనికి తన బేస్‌మెంట్‌లో కొత్త మనుషులు తిరుగుతారన్న ఆలోచన కలిగింది.
“ఇది నా ఇల్లు కోలెట్‌. నేను పుట్టింది ఇందులోనే. దీంతో నాకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. దయచేసి ఇల్లు అమ్మాలనే ఆలోచన మాను” బాధగా కోరాడు.
అతని వరకు అది సమసిపోయింది. కానీ, కోలెట్‌ మనసులోంచి కొత్త ఇంటి ఆలోచన పోలేదు. అప్పుడప్పుడు ఆమె తనకా ఇల్లు ఎందుకు నచ్చలేదో చెప్పి, దాన్ని అమ్మి కొత్త ఇల్లు కొందామని అడుగుతూనే ఉంది. ఐతే, కోలెట్‌ మేరియన్‌ లాంటిది కాదు కాబట్టి గయ్యాళిగా అమ్ముదామని పట్టు పట్టలేదు.
‘ఈ ప్రకటన చూడు. ఈ ఇల్లు మనిద్దరికీ సరిపోదూ?’ అని పేపర్లలోని ప్రకటనలని అలెక్‌కి చూపిస్తుంటుంది.
“మనిల్లు అమ్మితే చాలా తక్కువ వస్తుంది. ఇది పాత ఇల్లు కాబట్టి కొనేవాళ్ళు ఇంటికి విలువ కట్టరు. కేవలం భూమి ధరే చెల్లిస్తారు. ఆ ఇల్లు కొనడానికి దీన్ని అమ్మితే వచ్చే సొమ్ము సరిపోదు” అలెక్‌ ఇలా ప్రతీసారి ఏదో ఓ కారణం చెప్పాడు.

ఓ సాయంత్రం అతను ఆఫీస్‌నుంచి ఇంటికి తిరిగి వచ్చాక కోలెట్‌ అతన్ని ఆనందంగా కౌగిలించుకుని చెప్పింది.
“మీకో శుభవార్త.”
“ఏమిటి?” అడిగాడు.
“ఓ గొప్ప విషయం. మనం త్వరలో కొత్తింటికి మారబోతున్నాం. ఇప్పుడు దాన్ని కొనగలం.” ఆనందంగా చెప్పింది.
ఆమె కళ్ళనిండా వెలుగుని చూశాడు.
“నేను అనేకసార్లు చెప్పాగా, కోలెట్‌ నేనీ ఇంటిని అమ్మనని? నువ్వు ఎవరితో ఏం మాట్లాడావో తెలీదు కానీ, వాళ్ళకీ ఇల్లు అమ్మనని చెప్పు” చిరుకోపంగా చెప్పాడు.
ఆమె మొహంలోని ఆనందం మాయమైంది. చిన్నబుచ్చుకుంటూ చెప్పింది.
“కానీ, అలెక్‌. ఇందులో నా ప్రమేయం ఏం లేదు. మధ్యాహ్నం ఒకతను వచ్చి మన ఇంటి కొలతలు తీసుకెళ్ళాడు. అతను హైవే అథారిటీస్‌ ఆఫీస్‌ నుంచి వచ్చాడు. కొత్త హైవే నిర్మాణానికి అడ్డుగా ఉన్న మన ఇంటిని స్వాధీనం చేసుకుని, నష్ట పరిహారంగా మార్కెట్‌ ధరని చెల్లిస్తామని చెప్పాడు. మనకి ఇష్టం ఉన్నా, లేకపోయినా సరే, ఈ ఇంటిని వాళ్ళు కూల్చేసి, నాలుగైదు అడుగుల లోతు తవ్వి దానిమీద రోడ్డు నిర్మిస్తారట. ఇదంతా నెల్లోగా జరుగుతుందని చెప్పాడు”
అలెక్‌ మొహం తక్షణం పాలిపోయి అందులోకి భయం ప్రవేశించింది.
(సుజాన్‌ బ్లాంక్‌ కథకి స్వేచ్ఛానువాదం)

మర్నాడు చూస్తే తను సిమెంట్‌ చేసిన మేర మిగతా నేలతో పోలిస్తే వీసమెత్తు పైకి కనిపించింది. అతనిలో భయం కలిగింది. దాన్ని చూస్తే ఎవరికైనా మనిషి సమాధి అనే అనుమానం కలగచ్చు.తన బేస్‌మెంట్లోకి ఎవరూ రారు. కానీ, మరమ్మత్తు చేయించాల్సిన అవసరం వస్తే ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌, గ్యాస్‌ రిపేర్‌మేన్‌ అక్కడికి రావాల్సి ఉంటుంది.

“ఈ పాత ఇంటిని అమ్మేసి ఆధునిక ఇంటిని కొందాం” ఓ రోజు భర్తని కోరింది. తక్షణం అతనికి తన బేస్‌మెంట్‌లో కొత్త మనుషులు తిరుగుతారన్న ఆలోచన కలిగింది. “ఇది నా ఇల్లు కోలెట్‌. నేను పుట్టింది ఇందులోనే. దీంతో నాకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. దయచేసి ఇల్లు అమ్మాలనే ఆలోచన మాను” బాధగా కోరాడు. అతని వరకు అది సమసిపోయింది. కానీ, కోలెట్‌ మనసులోంచి కొత్త ఇంటి ఆలోచన పోలేదు. అప్పుడప్పుడు ఆమె తనకా ఇల్లు ఎందుకు నచ్చలేదో చెప్పి, దాన్ని అమ్మి కొత్త ఇల్లు కొందామని అడుగుతూనే ఉంది. ఐతే, కోలెట్‌ మేరియన్‌ లాంటిది కాదు కాబట్టి గయ్యాళిగా అమ్ముదామని పట్టు పట్టలేదు.
-మల్లాది వెంకట కృష్ణమూర్తి

343
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles