గబ్బిలాలే దేవుళ్లు!


Sun,September 8, 2019 01:43 AM

ఇటీవలి కాలంలో నిఫా వైరస్‌ కేరళ రాష్ర్టాన్ని వణికించింది. అందుకు కారణం గబ్బిలాలు. వాటివల్ల వచ్చిన ఆ వైరస్‌తో చాలామంది చనిపోయారు కూడా. దీంతో ఆ రెండు గ్రామాల్లో మినహా.. అన్ని రాష్ర్టాల్లో నిఫా వైరస్‌పై జాగ్రత్తలు పాటించారు. జనమంతా భయపడ్డా.. ఆ రెండు ఊళ్లే ఎందుకంత ధైర్యంగా ఉన్నాయంటే? గబ్బిలాలే వారికి దేవుళ్లు, దేవతలు కనుక!
Bats
అది చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలంలోని నడవలూరు గ్రామం.ఈ ఊరు చెరువు కట్టపై 11 చింతచెట్లు ఉన్నాయి. ఆ చెట్లలో ఒకటి పెద్ద చింతచెట్టు. దానికి మధ్యలో పెద్ద తొర్ర కూడా ఉంది. ఆ చెట్ల వద్దకు చాలామంది వస్తున్నారు. వాటికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. అంతేకాదు.. బలహీనంగా ఉన్న చిన్నారులను తీసుకొచ్చి వారి నుదుటిన ఏదో పూశారు. ఆ తర్వాత అదే పదార్థాన్ని పిల్లల ఒంటికి పూసి, స్నానం చేయించి కొత్త బట్టలు కట్టారు. పూజలు చేసి, ఓ పిల్లాడిని ఆ పెద్ద చింతచెట్టు తొర్రలో ఆటూ, ఇటూ మూడుసార్లు దాటించారు. అనంతరం బాలుడి కొత్త బట్టలు తీసి ఆ చెట్లకు కట్టారు. అక్కడ పూజలు చేస్తున్న ఓ మహిళ.. ఆ బాలుడి మెడలో ఓ తాయెత్తులాంటిది కట్టింది.

రెండో గ్రామం.. కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలోని మాధవరంపోడు. ఈ గ్రామంలో కూడా చెట్లపై వందల సంఖ్యలో గబ్బిలాలు కనిపిస్తాయి. ఇక్కడా అదేవిధంగా పూజలు చేయడం, పిల్లలకు తాయెత్తులు కట్టడం ఆనవాయితీ. ఇక్కడికి వచ్చేవారంతా చాలా దూరప్రాంతాల నుంచి వస్తున్నవారే. ఆదివారం వస్తే చాలు ఇక్కడ కొద్దిపాటి జాతర కనిపిస్తుంటుంది. బలహీనులైన పిల్లలు, వారి తల్లిదండ్రులతో ఈ ప్రాంతమంతా కోలాహలంగా ఉంటుంది.ఈ రెండు గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలిస్తే.. కొత్తవారు షాక్‌ అవుతారు. అసలు విషయం ఏంటంటే.. ఈ రెండు ఊళ్లకు గబ్బిలాలే దేవుళ్లు, దేవతలు. మనమైతే గబ్బిలాలను చూడగానే అసహ్యించుకుంటాం. కొంతమందైతే గబ్బిలాలకు భయపడిపోతారు. అవి ఇంట్లోకి వస్తే ఆశుభమని అంటుంటారు. చిత్తూరు జిల్లాలోని నడవలూరు, కడప జిల్లాలోని మాధవరంపోడు గ్రామాల్లో ప్రజలు ఇవేమీ పట్టించుకోరు. కారణం.. వారు గబ్బిలాలను దైవంగా పూజించడమే.

Nadavaluru

గబ్బిలాలకు హాని చేస్తే శిక్షే!

నడవలూరు గ్రామంలో వందలాది సంవత్సరాలుగా గబ్బిలాలకు పూజలు చేస్తున్నారు. గ్రామం మొదట్లోనే స్వాగత తోరణాల్లాగా చెరువు కట్టపై 11 చింతచెట్లలో ఈ గబ్బిలాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. ఈ గ్రామస్తులు ఏ రోజూ వాటిని ఇబ్బంది పెట్టలేదు. అవికూడా ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టలేదు. విచిత్రమేంటంటే.. ఈ గ్రామంలోని గబ్బిలాలు పంటలు, మామిడి తోటలను ముట్టుకున్న దాఖలాలూ లేవని స్థానికులు చెబుతున్నారు. వీటికి ఎవరైనా హానీ తలపెట్టాలని చూస్తే ఆ చెట్టుకే కట్టి వారిని శిక్షించడం గ్రామ సంప్రదాయం. పగలు మొత్తం చెట్లలో ఉండి, రాత్రి సమీపంలోని అడవులకు ఆహారం కోసం వెళ్లి తిరిగి ఉదయానికి అక్కడికే చేరుకుంటుంటాయి. నడవలూరు మండల కేంద్రమైన రామచంద్రపురం నుంచి 2 కి.మీల దూరం. సమీప పట్టణమైన తిరుపతి నుంచి 13 కి.మీల దూరం.

ఊరి అభివృద్ధి జరిగింది..

మాధవరంపోడు గ్రామం ఎప్పటి నుంచో ముఠాకక్షలతో రగిలిపోతూ అభివృద్ధికి దూరంగా ఉండేది. అలాంటి సమయంలో ఓ రోజు ఊరి చివరనున్న మర్రిచెట్టుపైకి వందలాది గబ్బిలాలు వచ్చి వాలాయి. ఆ తరువాత అక్కడి నుంచి ఊరిలోని కొన్ని చెట్లపైకి చేరుకున్నాయి. అప్పటినుంచి గ్రామంలో ముఠాకక్షలు తగ్గి, అభివృద్ధి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గబ్బిలాలు వచ్చాకే ఊరు బాగుపడిందని, తమ కష్టాలు తీర్చేందుకు భగవంతుడే వాటిని పంపాడని గ్రామస్తులు నమ్ముతున్నారు. తమ ఊరికి గబ్బిలాలు వచ్చాకే పంటలు బాగా పండుతున్నాయని, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని, పూరి గుడిసెల్లో ఉన్నవారంతా పక్కా ఇండ్లు కట్టుకున్నారని గ్రామ సర్పంచ్‌ అంటున్నాడు. తమకష్టాలు తీర్చినందుకే తాము వాటిని ఆరాధిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచమంతా గబ్బిలాలకు దూరంగా ఉండాలంటుంటే.. ఈ రెండు గ్రామాల ప్రజలేమో వాటితో సహవాసం చేస్తామని చెబుతున్నారు.

పక్షిదోష నివారణ


Madhavarampodu
పక్షిదోషం.. ఇది చిన్నారుల్లో ఎక్కువగా వస్తుందని నమ్ముతారు. ఈ దోషం కారణంగా పిల్లలు బరువు తక్కువగా, బలహీనంగా ఉండి, రాత్రిళ్లు కాళ్లు పెనవేసుకొని పడుకుంటారని విశ్వసిస్తారు. ఈ పక్షిదోషం నివారణ కావాలంటే గబ్బిలాల ద్వారానే జరుగుతున్నదని ఈ రెండు గ్రామాల ప్రజలు విశ్వాసం. అందుకే వీరు గబ్బిలాలను దైవంగా పూజిస్తున్నారు. పక్షిదోషం ఉన్న చిన్నారులను ఈ చెట్లకు తీసుకొచ్చి, గబ్బిలాల పెంట(మలం) వారి నుదుటికి బొట్టుగా పెట్టి, ఒళ్లంతా ఆ మలాన్ని రాసి, స్నానం చేయిస్తారు. పూజలు చేసి.. చెట్టు మొదలులోని తొర్రలో ఇటు వైపు నుంచి అటువైపుకు మూడుసార్లు దాటిస్తారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం చిన్నారికి వేసిన వస్ర్తాన్ని ఆ చెట్టుకు కడతారు. ఇలా చేయడం ద్వారా పక్షిదోషం నివారణ అవుతుందని విశ్వసిస్తారు. మరీ బలహీనంగా ఉన్న పిల్లలకు గబ్బిలాల ఎముకలు, కళేబరం మెడలో తాయెత్తులాగ కడతారు. ఈ పూజల కోసం చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల నుంచీ భక్తులు వస్తుంటారు.

154
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles