సర్వపాపాలు తొలగించే దామగుండం


Sun,September 8, 2019 01:19 AM

చుట్టూ దట్టమైన అరణ్యం, అందులో మూడు కొండలు. ఆ కొండల నడుమ నాలుగు వందల ఏండ్ల క్రితం వెలసిన దేవాలయం. సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠించిన లింగం వల్ల శ్రీ దామగుండ రామలింగేశ్వరస్వామిగా గుర్తింపు పొంది నిత్యం భక్తుల పూజలందుకుంటూ వారికి కొంగు బంగారమై నిలుస్తున్నాడు. దామగుండం కోనేరులో స్నానం చేస్తే పాపాలు తొలగుతాయి.
temple
వికారాబాద్‌ జిల్లా పూడూరు మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో వెలిసిందీ దేవాలయం. ప్రతి సంవత్సరం ఉగాది పండుగకు 5 రోజుల ముందు ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. దేవాలయం వద్ద కోనేరులో మండువేసవిలోనూ నీరు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. దేవాలయం సమీపంలో పూర్వం మునులు తపస్సు చేసిన గుహలు కనిపిస్తాయి. ఈ గుహల్లో నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూడూరు గ్రామానికి దారి ఉందని స్థానికులు చెబుతారు. దేవాలయంలో అన్ని పండుగలకూ ప్రత్యేక పూజలతో పాటుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆలయ చరిత్ర

పూర్వం ఈ ప్రాంతంలో దాముడు, గుండడు అనే ఇరువురు అన్నదమ్ములు ఉండేవారు. వారిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఒకరోజు తమ పొలంలో నాగలి దున్నుతున్నారు. సాయంత్రం కావడంతో నాగలిని అక్కడే వదిలి దానిపై ఒక రాయి పెట్టి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు రాగా నాగలిపైన పెట్టిన రాయి లేదు. గమనిస్తే ఆ రాయిని ఎక్కడి నుండి తీశారో అక్కడే ఉంది. ఆరోజు కూడా రాయిని మళ్లీ తీసుకువచ్చి నాగలిపై పెట్టి వెళ్లిపోయారు. మర్నాడు మళ్లీ అదే స్థానంలో ఉంది. అయితే రాయిని ఎవరో తీసుకువెళ్లి అక్కడ పెడుతున్నారనుకుని, వారిని గుర్తించాలని ఆ రోజు రాత్రి దాముడు, గుండడు పొలం వద్దే మాటువేశారు. రాత్రి కాగానే నాగలిపై పెట్టిన గుండ్రటి రాయి దొర్లుకుంటూ మొదటి స్థానంలోకి వెళ్లింది. దీంతో ఆశ్చర్యపోయిన వారిద్దరూ ఓ పూజారిని కలిసి జరిగిన విషయం వివరించారు. ఆ రాయి సాక్షాత్తు శివుని రూపమని, అక్కడ శివాలయం నిర్మించాలని పూజారి చెప్పాడు. దీంతో దాముడు, గుండడు శివాలయం నిర్మించారు. శ్రీ రాముడు ఈ ప్రాంతం నుంచి వెళ్ల్లే సమయంలో ఆయన చేతుల మీదుగా శివలింగ ప్రతిష్ఠాపన జరిగిందట. దీంతో ఈ దేవాలయానికి దామగుండ రామలింగేశ్వరస్వామి అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. నాటినుంచి ఇక్కడ శివలింగానికి పూజలు నిర్వహిస్తూ ప్రతి ఉగాది పండుగకు ముందు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.
temple1

దామగుండంలో స్నానం

ఆలయం పక్కనే గల కోనేరులో స్నానం ఆచరిస్తే పాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. దామగుండంలో స్నానం చేసి భక్తితో దైవ దర్శనం చెసుకున్న వారికి యమగండం తప్పుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ దేవాలయం పక్కన తేనెగుండం, నేతిగుండం, పాలగుండం, కాశీగుండం, నీటిగుండం, మాలగుండం, రాతిగుండం.. లా ఏడు గుండాలు ఉండేవని స్థానికులు తెలిపారు. వేసవిలో భూగర్భ జలాలు అడుగంటినా దేవాలయ సమీపంలోని గుండాల్లో పుష్కలంగా నీరు ఉంటుంది. దేవాలయానికి సరైన ఆలనాపాలనా లేకపోవడంతో కొన్ని గుండాలు పూడుకు పోయాయి.
temple3

ఎలా వెళ్లాలి?


temple2
దామగుండ రామలింగేశ్వరస్వామి ఆలయానికి వికారాబాద్‌, పూడూరు గేటు నుంచి చేరుకోవచ్చు. హైదరాబాద్‌-బీజాపూర్‌ అంతర్‌రాష్ట్ర రహదారి మీదుగా పూడూరు మండల కేంద్రం నుంచి రోడ్డు మార్గంలో సుమారు 3 కిలో మీటర్ల దూరంలో దేవాలయం ఉంది. వికారాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి ఎన్నెపల్లి మహవీర్‌ ఆసుపత్రి వద్ద నుంచి రోడ్డు మార్గం ఉంది. ఈ రోడ్డు మార్గం దేవాలయానికి సుమారుగా 10 కిలో మీటర్లు ఉంటుంది. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా బస్సులు లేకపోయినా ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లవచ్చు. దేవాలయానికి ఈ రెండు ప్రాంతాల నుంచి రోడ్డు మార్గం ఉంది.

134
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles