విరాట్ షో


Mon,August 12, 2019 02:53 AM

సెంచరీతో చెలరేగిన కోహ్లీ.. రాణించిన శ్రేయస్ అయ్యర్
రికార్డులను తిరగరాయడమే పనిగా పెట్టుకున్న విరాట్ కోహ్లీ.. వీరవిహారం చేసిన వేళ.. టాపార్డర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ సరైన తోడ్పాటు అందించడంతో టీమ్‌ఇండియా మంచి స్కోరు చేసింది. వన్డే ప్రపంచకప్‌లో ఐదు అర్ధశతకాలు సాధించినా.. ఇంకా ఏదో తక్కువైనట్లు కనిపించిన కోహ్లీ చాన్నాళ్ల తర్వాత మూడంకెల మార్క్ దాటాడు. పనిలో పనిగా వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలువడంతో పాటు.. విండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఆఖర్లో వరుణుడు భయపెట్టినా.. అదీ కాసేపే కావడంతో మ్యాచ్‌కు ఆటంకం వాటిల్లలేదు.
Virat-Kohli
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమి తర్వాత దాదాపు నెల రోజుల తర్వాత వన్డే బరిలో దిగిన టీమ్‌ఇండియా చక్కటి ఆటతీరు కనబర్చింది. ఆదివారం ఇక్కడి క్వీన్‌పార్క్ ఓవెల్ మైదానంలో బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 279 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (125 బంతుల్లో 120; 14 ఫోర్లు, 1 సిక్సర్) శతకంతో అదరగొట్టగా.. శ్రేయస్ అయ్యర్ (68 బంతుల్లో 71; 5 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీ చేశాడు. టాపార్డర్ విఫలమైన చోట వీరిద్దరు చక్కటి సమన్వయంతో ఆడటంతో విరాట్ సేన ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని ఉంచగలిగింది. అనంతరం వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విండీస్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270కి సవరించారు. టార్గెట్ ఛేజింగ్‌కు దిగిన విండీస్ కడపటి వార్తలందేసరికి 20 ఓవర్లలో 3 వికెట్లకు 97 పరుగులు చేసింది. గేల్ (11) పెద్దగా ఆకట్టుకోలేకపోగా.. లూయిస్ (47 నాటౌట్) రాణించాడు.

ఆరంభం ఆకట్టుకోకున్నా..

తనకు తానే ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుకుంటూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లీ నుంచి మరో చక్కటి ఇన్నింగ్స్ జాలువారింది. వన్డే ప్రపంచకప్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఈ మ్యాచ్‌లో శుభారంభం దక్కలేదు. గాయం అనంతరం తిరిగి జట్టులో చేరినా ఫామ్ అందుకోలేక తంటాలు పడుతున్న శిఖర్ ధవన్ (2) వైఫల్యం కొనసాగించాడు. తొలి ఓవర్ మూడో బంతికే ఔటయ్యాడు. కాట్రెల్ బంతికి వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. తొలుత అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా విండీస్ రివ్యూ కోరి ఫలితం రాబట్టింది.

వచ్చి రావడంతోనే రెండు ఫోర్లతో అలరించిన కెప్టెన్ కోహ్లీ అదే జోరు కొనసాగిస్తే.. మరోవైపు రోహిత్ శర్మ (18) ఇబ్బంది పడ్డాడు. ఖాతా తెరిచేందుకు 10 బంతులు తీసుకున్నాడు. విరాట్ మాత్రం బంతికో పరుగు చొప్పున చేసుకుంటూ వెళ్లడంతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించాక రోహిత్ వెనుదిరిగాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మంచి టచ్‌లో కనిపించిన రిషబ్ పంత్ (20) ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. బ్రాత్‌వైట్ వేసిన స్లో డెలవరీని ఆడ్డంగా ఆడేందుకు యత్నించి క్లీన్ బౌల్డయ్యాడు.

కరువు తీర్చిన కోహ్లీ..

టాపార్డర్ ఆరంభంలోనే చేతులెత్తేయడంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యతను కోహ్లీ భుజాన వేసుకున్నాడు. అతడికి శ్రేయస్ అయ్యర్ చక్కటి సహకారం అందించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ కుదురుకున్నాక జోరు పెంచింది. అప్పటికే అర్ధశతకం పూర్తి చేసుకున్న కోహ్లీ స్వేచ్ఛగా బ్యాట్ ఝలిపిస్తుంటే.. సారథి అండతో అయ్యర్ కూడా చెలరేగాడు. రోచ్ బౌలింగ్ రెండు ఫోర్లు కొట్టిన అయ్యర్.. హోల్డర్ బౌలింగ్‌లో మరో ఫోర్ బాదాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక పరుగుల జాబితాలో గంగూలీని వెనక్కి నెట్టిన కోహ్లీ.. హోల్డర్ బౌలింగ్‌లో సిక్సర్ బాది సెంచరీకి చేరువయ్యాడు. కోహ్లీ 111 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు.

west-indies
ఆ తర్వాత మరింత జోరు పెంచిర కోహ్లీ థామస్ బౌలింగ్ మూడు ఫోర్లు కొట్టి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇదే ఊపులో మరో భారీ షాట్ కొట్టబోయి రోచ్‌కు చిక్కాడు. దీంతో కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ దశలో మ్యాచ్‌కు వరణుడు అడ్డుపడ్డాడు. అరగంట అనంతరం తిరిగి ఆట ప్రారంభం కాగా.. పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభించింది. దీంతో వరుస ఓవర్లలో అయ్యర్, జాదవ్ (16), భువనేశ్వర్ (1) ఔటయ్యారు. శ్రేయస్‌ను హోల్డర్ బౌల్డ్ చేయగా.. జాదవ్ రనౌటయ్యాడు. రవీంద్ర జడేజా (16 నాటౌట్) క్రీజులో ఉన్నా భారీ షాట్లు ఆడలేకపోవడంతో భారత్ అనుకున్నదానికంటే తక్కువ పరుగులకే పరిమితమైంది.

మరో రెండు రికార్డులు దాసోహం

రికార్డుల రారాజు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో మరో రెండు రికార్డులు బద్దలు కొట్టాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలో విరాట్ కోహ్లీ (11,406) రెండో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న సౌరవ్ గంగూలీ (11, 363)ని వెనక్కి నెట్టి కోహ్లీ ద్వితీయ స్థానానికి చేరాడు. దాదా 311 మ్యాచ్‌ల్లో సాధించిన పరుగులను కోహ్లీ 238వ వన్డేలోనే అధిగమించడం విశేషం. ఈ జాబితాలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (18, 426) టాప్‌లో ఉన్నాడు. దీంతో పాటు వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు (2031) చేసిన బ్యాట్స్‌మన్‌గా 26 ఏండ్ల క్రితం పాకిస్థాన్ క్రికెటర్ జావేద్ మియాందాద్ (1930)నెలకొల్పిన రికార్డును కూడా భారత కెప్టెన్ చరిత్రలో కలిపేశాడు. ఈ మ్యాచ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఈ ఘనత సాధించాడు. మియాందాద్ విండీస్‌పై 64 మ్యాచ్‌లాడి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిస్తే.. కోహ్లీ కేవలం 34 మ్యాచ్‌ల్లోనే దాన్ని అధిగమించాడు. ఆసీస్ దిగ్గజం మార్క్‌వా 47 మ్యాచ్‌ల్లో 1708 రన్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు.

42

వన్డేల్లో విరాట్ కోహ్లీ శతకాల సంఖ్య. ఈ ఫార్మాట్‌లో అగ్రస్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ (49)కు కోహ్లీ కేవలం 7 సెంచరీల దూరంలో ఉన్నాడు.

8

విండీస్‌పై కోహ్లీ సెంచరీల సంఖ్య. ఒకే ప్రత్యర్థిపై సచిన్ (9, ఆస్ట్రేలియాపై) తర్వాత ఎక్కువ శతకాలు చేసిన రెండవ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

8

ఓవరాల్‌గా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలో కోహ్లీ స్థానం. తాజా మ్యాచ్‌లో గంగూలీని వెనక్కి నెట్టిన కోహ్లీ 8వ స్థానానికి చేరాడు.

1

వన్డేల్లో వెస్టిండీస్ తరఫున అత్యదిక పరుగులు (10,353) చేసిన బ్యాట్స్‌మన్‌గా గేల్ రికార్డు సృష్టించాడు. విండీస్ దిగ్గజం లారా (10,348)ను వెనక్కి నెట్టాడు.

స్కోరు బోర్డు

భారత్: ధావన్ (ఎల్బీ) కాట్రెల్ 2, రోహిత్ (సి) పూరన్ (బి) చేజ్ 18, కోహ్లీ (సి) రోచ్ (బి) బ్రాత్‌వైట్ 120, పంత్ (బి) బ్రాత్‌వైట్ 20, అయ్యర్ (బి) హోల్డర్, జాదవ్ (రనౌట్) 16, జడేజా (నాటౌట్) 16, భువనేశ్వర్ (సి) రోచ్ (బి) బ్రాత్‌వైట్ 1, షమీ (నాటౌట్) 3, ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: 50 ఓవర్లలో 279/7. వికెట్ల పతనం: 1-2, 2-76, 3-101, 4-226, 5-250, 6-258, 7-262, బౌలింగ్: కాట్రెల్ 10-0-49-1, రోచ్ 7-0-54-0, హోల్డర్ 9-0-53-1, థామస్ 4-0-32-0, చెజ్ 10-1-37-1, బ్రాత్‌వైట్ 10-0-53-3.

వెస్టిండీస్: గేల్ (ఎల్బీ) భువనేశ్వర్ 11, లూయిస్ (నాటౌట్) 28, హోప్ (నాటౌట్)1 ఎక్స్‌ట్రాలు: 00, మొత్తం: 10 ఓవర్లలో 46/1. వికెట్ల పతనం: 1-45, బౌలింగ్: భువనేశ్వర్ 5-0-26-1, షమీ 3-0-9-0, ఖలీల్ 2-0-11-0

score

1226

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles