ఆర్చర్ X స్మిత్


Wed,August 14, 2019 01:55 AM

smith

- అందరి దృష్టి ఈ ఇద్దరిపైనే..
- నేటి నుంచి యాషెస్ రెండో టెస్ట్
- మధ్యాహ్నం 3.30 నుంచి సోనీ సిక్స్‌లో


లండన్: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఓటమి పాలైన ఇంగ్లండ్ తిరిగి పుంజుకునేందుకు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నది. ఇందులో భాగంగా ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను అడ్డుకునేందుకు బార్బడోస్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను రంగంలోకి దించనుంది. తొలి టెస్టులో వెటరన్ పేసర్ అండర్సన్ గాయం కారణంగా నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడం ఇంగ్లండ్‌కు ప్రతికూలంగా మారింది. జిమ్మీ గైర్హాజరీలో స్మిత్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌కు కూడా అండర్సన్ అందుబాటులో లేకపోవడంతో.. అతడి స్థానంలో ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో ఆకట్టుకున్న యువ పేసర్ ఆర్చర్ అరంగేట్రం చేయడం ఖాయమైంది. మెగాటోర్నీ ఫైనల్లో సూపర్ ఓవర్ వేసిన లార్డ్స్ పిచ్‌పైనే అతడు తొలి టెస్టు బరిలో దిగనున్నాడు. ససెక్స్ తరఫున ప్రాక్టీస్ మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టడంతో పాటు ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీతో మెరిసిన ఆర్చర్ అదే జోరు ఇక్కడా కొనసాగించాలని భావిస్తున్నాడు. ఎర్రబంతితో చాలా క్రికెట్ ఆడాను. అదే నా తొలి ప్రాధాన్యత. ససెక్స్ తరఫున ఒక్కో మ్యాచ్‌లో 50కి పైగా ఓవర్లు వేశాను అని ఆర్చర్ చెప్పాడు. దీంతో పాటు తొలి టెస్టులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన స్పిన్నర్ మొయిన్ అలీ స్థానంలో ఐర్లాండ్‌తో ఏకైక టెస్టులో రాణించిన లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్‌కు తుది జట్టులో చోటు కల్పించనున్నారు. బ్యాట్స్ మెన్ తిరిగి గాడిన పడితే ఇంగ్లండ్‌కు ఎదురుండదు. తొలి మ్యాచ్‌లో ఓపెనర్ బర్న్స్ ఆకట్టుకున్నా.. జాసెన్ రాయ్ తో పాటు మిడిలార్డర్‌లో బట్లర్, బెయిర్‌స్టో, డెన్లీ, మొయిన్ అలీ విఫలమయ్యారు. రూట్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. వీరంతా సమిష్టిగా రాణిస్తే.. ఇంగ్లండ్ సిరీస్ సమం చేసే చాన్స్ ఉంది.

వార్నర్ కూడా మెరిస్తే..

మరోవైపు 2001 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై యాషెస్ నెగ్గలేకపోయిన ఆసీస్.. ఈసారి ఎలాగైనా విజయంతోనే తిరిగి వెళ్లాలని కృతనిశ్చయంతో ఉంది. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఏడాదిపాటు ఆటకు దూరమైన స్మిత్ ఆడిన తొలి టెస్టులో అదరగొట్టాడు. పరుగుల కోసం ఆకలిగొన్న సింహంలా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారీ సెంచరీలతో విజృంభించాడు. ఫలితంగా కంగారూలు 251 పరుగుల తేడాతో ఇంగ్లిష్ జట్టుపై విజయం సాధించారు. అయితే స్మిత్ మినహా టాపార్డర్ పెద్దగా రాణించకపోవడం ఆసీస్‌ను కలవరపెడుతున్నది. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్‌లో నిలకడగా రాణించిన వార్నర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అతడితో పాటు బాన్‌క్రాఫ్ట్, ఖవాజ, ట్రావిస్ హెడ్ స్థాయికి తగ్గట్లు ఆడితే రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియాకు తిరుగుండదు. ఆరుగురు పేసర్లు అందుబాటులో ఉండటం అదృష్టమని ఆసీస్ కోచ్ లాంగర్ అభిప్రాయపడుతున్నాడు. మరి తొలి టెస్టులో దెబ్బతిని ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌ను కంగారూలు ఎలా అడ్డుకుంటారో చూడాలి.

509

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles