ఆసీస్ సైన్యం అతడే


Wed,September 11, 2019 04:07 AM

ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్‌గా అందరితో మన్ననలు పొందిన రికీ పాంటింగ్ వల్ల కాలేదు.. బ్యాటింగ్‌లో మేటి, రికార్డుల్లో ఘనాపాఠి అయిన మైకెల్ క్లార్క్‌కూ సాధ్యపడలేదు.. అంతకుముందు తనకు తానే అపర మేధావిగా భావించే గ్రేగ్ చాపెల్ తరం కాలేదు.. అలాంటిది అసలు ఆస్ట్రేలియా జట్టులో ఇతడికెలా చోటు దక్కిందనే అనుమానాల మధ్య పగ్గాలు చేతబట్టిన ఒక అనామక ఆటగాడి ముందు అరుదైన ఘనత నిలిచింది. ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను నిలబెట్టుకోవడం అంటే మామూలు మాటలు కాదు. రెండు జట్లు ప్రపంచకప్ కంటే ఎక్కువగా భావించే ఈ సిరీస్‌ను ఒడిసి పట్టేందుకు కంగారూల ముందు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత చక్కటి అవకాశం. అప్పుడెప్పుడో 2001లో దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వా తర్వాత మరే ఆస్ట్రేలియా కెప్టెన్.. ఇంగ్లండ్‌లో యాషెస్ సిరీస్ నెగ్గలేకపోయాడు. పాంటింగ్, క్లార్క్ ఒకటికి రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. మరి అలాంటి అరుదైన అవకాశం టిమ్ పైన్‌కు దక్కింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న చివరి టెస్టు నెగ్గినా.. డ్రాచేసుకున్నా.. ఓడినా.. సిరీస్ ఆసీస్ చేజారదు. అంటే 18 ఏండ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై ఆసీస్ యాషెస్ సిరీస్ నిలబెట్టుకోనుందన్నమాట! మరి ఇంతటి ఘనకార్యం పైన్ ఒక్కడి వల్లే సాధ్యమైందా అంటే.. ముమ్మాటికి కాదు. దీని వెనుక ఒక యోధుడి అసమాన ప్రతిభ, పోరాటం దాగుంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అనే నానుడిని ఆచరణలో చూపెడుతూ.. ఫీనిక్స్ పక్షి ఉదంతాన్ని మరిపించే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఆ ఒక్కడే ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్. అతడే ఆసీస్ సైన్యం! బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో యావత్ క్రీడాలోకం దృష్టిలో చీటర్‌గా ముద్రపడ్డ స్మిత్.. ఇప్పుడు కంగారుల కామధేనువయ్యాడు. ఏడాదిపాటు ఆటకు దూరంగా ఉండి అనేక అవమానాల మధ్య యాషెస్ సిరీస్ తొలి టెస్టులో బరిలో దిగిన స్మిత్.. ఇంగ్లండ్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ఇలాంటి స్థితిలో మరో ఆటగాడైతే సంయమనం కోల్పోయేవాడే. కానీ స్మిత్ అలా చేయలేదు. విమర్శకుల ప్రశంసలందుకోవాలంటే వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలని బలంగా నమ్మాడు. యాషెస్‌లో అదే చేసి చూపెట్టాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ ఔటై పెవిలియన్ చేరుతున్న సమయంలో ఇంగ్లండ్ అభిమానులు లేచి నిలబడి అతడిని అభినందించారంటే ఇంతకన్నా ఇంకేం కావాలి..!
Steve-Smith
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : గతేడాది మార్చి 24 ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య కేప్‌టౌన్ వేదికగా మూడో టెస్టు. మూడో రోజు రెండో సెషన్‌లో ఆసీస్ ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్ పసుపు రంగులో ఉన్న స్యాండ్ పేపర్ (ఉప్పు కాగితం)తో బంతి ఆకారాన్ని మార్చేందుకు యత్నిస్తూ.. కెమెరా కంటికి చిక్కాడు. ఇక అంతే యావత్ క్రికెట్ జగత్తు ఒక్కసారిగా అటువైపు దృష్టి సారించింది. మ్యాచ్ అనంతరం తన తప్పు తెలుసుకున్న అప్పటి కెప్టెన్ స్మిత్ మీడియా ముందుకొచ్చాడు. పొరపాటు జరిగింది క్షమించమని ప్రాధేయపడ్డాడు. తండ్రితో కలిసి కంటతడి పెట్టుకున్నాడు. అది లంచ్‌బ్రేక్‌లో లీడర్‌షిప్ గ్రూప్ తీసుకున్న నిర్ణయం అని ప్రకటించాడు. నిబంధనలకు విరుద్ధం కావడంతో రిఫరీ చర్యలు తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో సఫారీలు విజయం సాధించారు. అప్పటివరకు క్రికెట్‌ను శాసిస్తున్న ఆస్ట్రేలియాకు ట్యాంపరింగ్ ఉదంతం శరాఘాతంలా పరిణమించింది. ఆసీస్ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ కూడా ఘటనను తీవ్రంగా పరిగణించాల్సిందే అన్నాడు. ఇంకేముంది క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆగమేఘాలపై బ్యాన్ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన గురించి తెలిసి కూడా నోరు మెదపని కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించింది. ప్రత్యక్షంగా బంతి ఆకారం మార్చేందుకు యత్నించిన బాన్‌క్రాఫ్ట్‌ను 9 నెలలు ఆటకు దూరం చేసింది.

మరో గత్యంతరం లేక..

అప్పటికే సిరీస్ మధ్యలో ఉన్న కంగారూలది ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. ఇక జట్టులో నిలకడగా ఉంటాడనుకునే మరో ఆటగాడి కోసం వెతుకులాట ప్రారంభించింది. షాన్ మార్ష్, మిచెల్ మార్ష్ జట్టులో ఉన్నారు. కానీ వారు మిగిలిన మ్యాచ్‌ల్లో తుది జట్టులో ఉంటారనే నమ్మకంలేదు. సీనియర్ పేసర్ స్టార్క్‌కు కెప్టెన్సీ అప్పగిద్దామా అంటే.. అది ఆసీస్ సంప్రదాయానికి విరుద్ధం. పేసర్లపై అదనపు భారం వేయడం సరైంది కాదని బలంగా నమ్మే కంగారూలకు ఎటు చూసిన టిమ్ పైన్ తప్ప మరో పేరు కనబడలేదు. అసలైతే 11 మంది అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసి అందులో ది బెస్ట్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం సీఏ ఆనవాయితీ. కానీ, అందుకు భిన్నంగా ఉన్నవారిలో కచ్చితంగా జట్టులో ఉంటాడని నమ్మిన పైన్‌కు కెప్టెన్సీ కట్టబెట్టింది. వికెట్ కీపర్ కావడంతో తుదిజట్టులో ఉంటాడనే నమ్మకం. అందుకు తోడు విపత్కర పరిస్థితుల్లో దూకుడుగా ముందుకెళ్లే వ్యక్తి కన్నా మృదుస్వభావి అయితే మంచిదని భావించిన బోర్డు అతడికే పట్టంకట్టింది.

మూడు టెస్టుల్లోనే మళ్లీ మొదటికి

144, 142, 92, 211, 82.. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో అతడి స్కోర్లు. 16 నెలల విరామం తర్వాత సంప్రదాయ క్రికెట్‌లో అడుగుపెట్టిన స్మిత్ పరుగుల కోసం ఆకలిగొన్న పులిలా విజృంభించాడు. ఎంతలా అంటే ఆడిన మూడు టెస్టుల్లోనే 134.20 సగటుతో 671 పరుగులు చేసి.. టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన నుంచి లాక్కున్న టెస్టు నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ హోదాను తిరిగి దక్కించుకున్నాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 17/2తో కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన స్మిత్ సహచరుల నుంచి సహకారం అందకున్నా.. జట్టు స్కోరులో 50 శాతానికిపైగా పరుగులు ఒక్కడే చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 27/2తో క్రీజులోకొచ్చిన స్మిత్ జట్టు స్కోరు 331గా ఉన్నప్పుడు పెవిలియన్ చేరాడు. ఫలితంగా ఆసీస్ 251 పరుగులతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. స్మిత్ ఒక్కడిని అడ్డుకుంటే చాలు విజయం లాంఛనమే అని భావించిన ఇంగ్లిష్ జట్టు రెండో టెస్టులో బాడీలైన్ బౌలింగ్‌కు దిగి ఫలితం సాధించింది. కంగారూల తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ 80 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆర్చర్ వేసిన భీకరమైన బౌన్సర్ స్మిత్ మెడ వెనుక భాగంలో బలంగా తాకింది.

క్రీజులోనే కుప్పకూలిన స్మిత్ బ్యాటింగ్ కొనసాగించలేక రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ బాటపట్టాడు. అయితే గొప్ప స్ఫూర్తి ప్రదర్శించిన స్మిత్.. సిడిల్ ఔట్ కాగానే తిరిగి క్రీజులోకి వచ్చి అందర్ని ఆశ్చర్యపరిచాడు. నొప్పితోనే బ్యాటింగ్ కొనసాగించిన స్మిత్ మరో మూడు ఫోర్లు కొట్టి సెంచరీకి 8 పరుగుల దూరంలో ఔటయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగని స్మిత్.. ఇదే క్రమంలో మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ గెలిచిన ఏకైక టెస్టు అదే కావడం గమనార్హం. ఇక నాలుగో టెస్టులో బలంగా తిరిగొచ్చిన స్మిత్ వచ్చిరావడంతోనే విరుచుకుపడ్డాడు. గత మ్యాచ్‌లో బరిలో దిగని కోపమో.. లేక తీరని పరుగుల దాహమో కానీ ఏకంగా డబుల్ సెంచరీతో విజృంభించాడు. జట్టు 28/2తో కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులో అడుగుపెట్టిన స్మిత్ 438 వద్ద ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ చెలరేగిన అతడు 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను 82 పరుగుల ఇన్నింగ్స్‌తో గాడిన పెట్టి మరో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ట్యాంపరింగ్ ఉదంతం అనంతరం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిరిగి సత్తాచాటిన డేవిడ్ వార్నర్ వరుసగా విఫలమవుతున్నా.. ఆ ప్రభావం ఆస్ట్రేలియా జట్టుపై పడలేదంటే అందుకు ప్రధాన కారణం స్మిత్ అసమాన ప్రదర్శనే అనడంలో సందేహం లేదు.

Tim-Paine

యాషెస్ రూపంలో ప్రతిఫలం..

అప్పుడెప్పుడో 2010లో స్టీవ్‌స్మిత్‌తో కలిసి పాకిస్థాన్‌పై లార్డ్స్‌లో టెస్టు అరంగేంట్ర చేసిన పైన్ అసలు జట్టులో స్థిరమైన ఆటగాడే కాదు. ఒకే మ్యాచ్‌తో కెరీర్ ఆరంభించిన స్మిత్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఆసీస్ ప్రధాన బ్యాట్స్‌మన్ స్థాయికి చేరగా.. పైన్ మాత్రం జట్టులో చోటు నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడ్డాడు. అలాంటిది కష్టకాలంలో జట్టు సారథ్య బాధ్యతలు అందుకోవాల్సి రావడంతో యాక్సిడెంటల్ కెప్టెన్‌గా తెరపైకి వచ్చాడు. కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ బాదినా.. అతడి సారథ్యంలో ఆడిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 492 పరుగుల భారీ తేడాతో అవమానకర ఓటమి మూటగట్టుకుంది. ఇంటా బయటా సర్వత్రా విమర్శల మధ్య జట్టును ముందుకు నడిపించిన పైన్ ఏడాది పాటు బండి లాగించాడు. కట్ చేస్తే..! ఏడాది నిషేధం ముగించుకున్న స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ తిరిగి టెస్టు జట్టుతో చేరడంతో కంగారులకు కొండంత అండ చేకూరింది. పైన్ పని సులువైంది. బ్యాటింగ్ భారాన్ని స్మిత్ భుజస్కందాలపై వేసుకొని మోస్తుండటంతో పాటు పేసర్లు అదరగొడుతుండటంతో ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే ఏడాది పాటు విజయాలకు ముఖం వాచిపోయేలా ఎదురుచూసిన ఆసీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పైన్‌కు యాషెస్ నిలుపుకున్న సారథిగా ప్రతిఫలం లభించనుండటం పెద్ద రిలీఫ్!

Steve-Smith2

నం. 1

యాషెస్ సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్న ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్..ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను ఏలుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో డబుల్ సెంచరీ(211)తో సహా రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన స్మిత్ 937 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. 2017లో తాను సాధించిన అత్యుత్తమ రేటింగ్‌ను అందుకోవడానికి స్మిత్ 10 పాయింట్ల దూరంలో ఉన్నాడు. టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(903)కి, స్మిత్‌కు మధ్య ప్రస్తుతం 34 పాయింట్ల తేడా ఉంది. చతేశ్వర్ పుజార(825), రహానే(725) వరుసగా నాలుగు, ఏడు ర్యాంక్‌ల్లో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ స్పీడ్‌స్టర్ ప్యాట్ కమ్మిన్స్ 914 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో ఏడు వికెట్లు తీయడం ద్వారా కమ్మిన్స్ అగ్రస్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. రెండో ర్యాంక్‌లో ఉన్న రబాడ(851)కు కమ్మిన్స్‌కు 63 పాయింట్ల అంతరముంది. టాప్-10లో భారత్ నుంచి బుమ్రా(835) ఒక్కడే ఉన్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జాసన్ హోల్డర్(472), షకీబల్‌హసన్(397), జడేజా(389) వరుసగా టాప్-3లో ఉన్నారు.

యాషెస్‌లో స్మిత్

Steve-Smith3

998

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles