హైదరాబాద్‌షా సౌరభ్‌ వర్మ


Mon,August 12, 2019 02:53 AM

-ఫైనల్లో సింగపూర్‌ ప్లేయర్‌పై విజయం
-మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి జోడీకి నిరాశ

అంచనాలకు అనుగుణంగా ముందుకు దూసుకెళ్లిన సౌరభ్‌ వర్మ హైదరాబాద్‌ ఓపెన్‌ టైటిల్‌ చేజిక్కించుకున్నాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో సింగపూర్‌
ప్లేయర్‌పై ఆధిపత్యం ప్రదర్శించి విజేతగా నిలిచాడు. మహిళల డబుల్స్‌లో తెలంగాణ అమ్మాయి సిక్కిరెడ్డి, అశ్వినీ పొన్నప్ప జంటకి నిరాశే మిగిలింది. తుదిపోరులో కొరియా జోడీ చేతిలో పరాజయం పాలైంది.


Sourabh Verma
హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ ఆట ప్రతినిధి: వరుస విజయాలతో దూసుకెళ్లిన సౌరభ్‌ వర్మ హైదరాబాద్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. టోర్నీ మొత్తం సత్తాచాటిన సౌరభ్‌ ఆదివారం స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఫైనల్లో 21-13, 14-21, 21-16తో సింగపూర్‌కు చెందిన లోహ్‌ కెన్‌ యెవ్‌ను మట్టికరిపించాడు. 52నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌ తొలి గేమ్‌ ప్రారంభమైన కాసేపటికే 6-2తో నిలిచిన సౌరభ్‌ ఏ దశలోనూ తగ్గకుండా గేమ్‌ను 21-13తో సునాయాసంగా గెలుచుకున్నాడు. రెండో గేమ్‌ ఆరంభంలో 5-0తో ఆధిక్యంలో నిలిచినా.. కీన్‌ యెవ్‌ విజృంభించడంతో 10-10తో స్కోరు సమమైంది. ఆ తర్వాత కాసేపు ఇద్దరి మధ్య హోరాహోరీ సాగగా.. చివరకు కెన్‌ వరుసగా ఐదు పాయింట్లు సాధించి రెండో గేమ్‌ సొంతం చేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఒక దశలో 11-10తో ముందంజలో నిలిచిన సౌరభ్‌ అక్కడి నుంచి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొని హైదరాబాద్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలుచుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదానాత్సోవంలో తెలంగాణ క్రీడా శాఖమంత్రి వీ శ్రీనివాస్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాట్స్‌ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.

V.-Srinivas-Goud

సిక్కిరెడ్డి జోడీకి నిరాశ

మహిళల డబుల్స్‌లో సెమీఫైనల్‌ వరకు అదరగొట్టిన తెలంగాణ షట్లర్‌ ఎన్‌.సిక్కి రెడ్డి-అశ్వినీ పొన్నప్ప జోడీ తుదిపోరులో తడబడింది. టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన ఈ ద్వయం ఫైనల్లో 17-21, 17-21తో కొరియా జోడీ బీక్‌ హా నా-జంగ్‌ క్యుంగ్‌ ఇన్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌సీడ్‌ యో జియా మిన్‌(సింగపూర్‌) 12-21, 21-17, 21-19 తేడాతో అన్‌ సే యంగ్‌(కొరియా)పై విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో షోహిబుల్‌ ఫిక్రీ-బగాస్‌ (ఇండోనేషియా) జోడీ విజేతగా నిలిచింది.
Ashwini-Ponnappa
‘ఈ టోర్నీలో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. గత రౌండ్లలోనూ కీలక మ్యాచ్‌ల్లో గెలిచా. ఫైనల్లోనూ బాగా ఆడా. తొలి గేమ్‌ గెలిచి రెండో దాంట్లో ఆధిక్యంలో ఉన్న సమయంలో కాస్త ఏకాగ్రత కోల్పోయా. ఆ తరుణంలో ప్రత్యర్థి కూడా విభిన్నంగా ఆడాడు. మూడో గేమ్‌లో నేను వ్యూహాన్ని మార్చా. అది ఫలించింది.
- -సౌరభ్‌ వర్మ

478

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles