శుభ్‌మన్‌కు స్వాగతం..


Mon,January 14, 2019 12:30 AM

-న్యూజిలాండ్ పర్యటనకు గిల్ ఎంపిక
-భవిష్యత్ తారగా మన్ననలు
ఆడు మగాడ్రా బుజ్జీ! ఈ తెలుగు సినిమా డైలాగ్‌కు పంజాబీ పుత్తర్ శుభ్‌మన్ గిల్ అతికినట్లు సరిపోతాడు. అవును పువ్వు పుట్టగానే పరిమళించిందన్నట్లు ఊహ తెలియని వయసులోనే క్రికెట్ బ్యాటు పట్టుకున్న గిల్ ఆటనే ప్రాణపదంగా భావించాడు. పరిస్థితులు అనుకూలించకపోయినా క్రికెట్‌పై కొడుకుకున్న మక్కువతో తండ్రి అన్నీతానై ముందుకు నడిపించాడు. తనకంటే పెద్దవారితో పోటీపడటం నేర్చుకున్న శుభ్‌మన్ ఆనతికాలంలోనే అద్భుత ప్రతిభ కల్గిన క్రికెటర్‌గా వెలుగులోకి వచ్చాడు. బరిలోకి దిగితే ప్రత్యర్థికి వణుకే అన్న రీతిలో పరుగుల వరద పారించాడు. రాహుల్ ద్రవిడ్ శిక్షణలో సానబట్టిన వజ్రంలా రాటుదేలిన గిల్.. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపాడు. సొగసైన షాట్లతో అలవోకగా పరుగులు కొల్లగొట్టే గిల్ జాతీయ జట్టులోకి దూసుకొచ్చాడు. దేశవాళీ టోర్నీల్లో ఈ పంజాబీ డాషింగ్ బ్యాట్స్‌మన్ ప్రతాపానికి ఫిదా అయిన సెలెక్టర్లు కివీస్‌తో సిరీస్‌కు అవకాశమిచ్చారు. భారత భవిష్యత్ తారగా మన్ననలు అందుకుంటున్న గిల్ అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి అడుగు ఘనంగా వేయాలని ఆశిద్దాం.

shubham-gil

క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించే భారత్‌లో ప్రతి వార్త అభిమానులకు ఆసక్తి కల్గించేదే. తమ అభిమాన ఆటకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎప్పుడు మొగ్గుచూపుతూనే ఉంటారు. తాజాగా న్యూజిలాండ్ పర్యటన కోసం పంజాబ్ డాషింగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ వార్త కూడా అందరి నోళ్లలో నానుతున్నది. కచ్చితంగా ఏదో ఒక రోజు జాతీయజట్టులోకి వస్తాడనుకున్న ఈ 19 ఏండ్ల పంజాబ్ పుత్తర్ ఇంత తొందరగా తలుపు తట్టడంపై అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. జట్టులోకి కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తున్న సెలెక్షన్ కమిటీ నిర్ణయం మరోమారు అందరినీ ఆశ్చర్యపరిచింది. దేశ క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సుదీర్ఘ కాలం పాటు జట్టుకు సేవలందించగల అద్భుత ప్రతిభ కల్గిన క్రికెటర్లకు సెలెక్టర్లు పట్టం కడుతున్నారు. శుభ్‌మన్‌గిల్ ఎంపిక కూడా అదే కోవలోకి వస్తుందని చెప్పొచ్చు. అవును అండర్-19 ప్రపంచకప్‌తో వెలుగులోకి వచ్చిన గిల్..అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

372 పరుగులతో వరల్డ్‌కప్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన గిల్..ఐపీఎల్‌లోనూ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున మెరుపులు మెరిపించాడు. మొత్తం 13 మ్యాచ్‌ల్లో 203 పరుగులు చేశాడు. అంతటితో ఆగకుండా తన సొంత రాష్ట్రం పంజాబ్ తరఫున రంజీ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌ల్లో 104 సగటుతో ఏకంగా 728 పరుగులు కొల్లగొట్టాడు. ఇందులో తమిళనాడుపై డబుల్ సెంచరీ(268)తో పాటు హైదరాబాద్‌పై(148) సూపర్ సెంచరీ ఉన్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్‌లో అర్ధసెంచరీ చొప్పున గిల్ పరుగుల మోత మోగించాడు. ఈ మధ్య జరిగిన న్యూజిలాండ్ పర్యటనలో భారత్ ఎ తరఫున అదరగొట్టాడు. ఇప్పుడు అదే కివీస్‌తో పర్యటనకు ఎంపికైన శుభ్‌మన్..తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. అద్భుతమైన క్రికెటింగ్ షాట్లతో ఆకట్టుకుంటున్న ఈ కుర్రాడి ఆటకు సీనియర్ క్రికెటర్లు యువరాజ్‌సింగ్, దినేశ్ కార్తీక్ ముగ్ధులవుతున్నారు.

శంకర్, శుభ్‌మన్‌కు పిలుపు

ఆసీస్, కివీస్ సిరీస్‌లకు ఎంపిక
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు వన్డేలు, న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌ల కోసం భారత జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. ఓ ప్రైవేట్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం సస్పెన్షన్ ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ స్థానాలను సెలెక్టర్లు భర్తీ చేశారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బదులుగా విజయ్ శంకర్‌కు అవకాశం కల్పించగా, ఈనెల 23న మొదలయ్యే కివీస్‌తో సిరీస్ కోసం పంజాబ్ యంగ్‌స్టర్ శుభ్‌మన్ గిల్‌కు తొలిసారి చాన్స్ ఇచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హార్దిక్, రాహుల్ ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి చేరుకున్నారు. వారి స్థానాల్లో శంకర్, శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేశాం.

అడిలైడ్‌లో జరిగే రెండో వన్డే కంటే ముందుగానే శంకర్ జట్టుతో కలుస్తాడు. కివీస్‌తో వన్డే, టీ20 సిరీస్ కోసం గిల్‌కు అవకాశం కల్పించాము అని ఆదివారం అర్ధరాత్రి బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే తొలుత రాహుల్‌కు బదులుగా కర్ణాటకకే చెందిన మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. అయితే అగర్వాల్ గాయంతో ఉండటంతో టీమ్ మేనేజ్‌మెంట్ కోరిక మేరకు శంకర్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేశారు. ఇక ఇటీవలి రంజీ ట్రోఫీతో పాటు న్యూజిలాండ్ పర్యటనలో భారత్ ఎ తరఫున మెరుగ్గా రాణించడం ద్వారా గిల్..సెలెక్టర్ల నమ్మకాన్ని చూరగొన్నాడు.

590

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles