సెరెనా 12వ సారి సెమీస్‌లో


Wed,July 10, 2019 02:58 AM

-హలెప్‌ ముందడుగు, కొంటా ఔట్‌.. నేడు పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌
Serena-Williams
లండన్‌: మాజీ చాంపియన్‌ సెరెనా విలియమ్స్‌ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తున్నది. మొదటి రౌండ్‌ నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఈ అమెరికా క్రీడాకారిణి మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లోనూ అదరగొట్టింది. ప్రిక్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ బార్టీని ఓడించిన తన దేశానికే చెందిన అన్‌సీడెడ్‌ ప్లేయర్‌ అలీసన్‌ రిస్కేని 6-4, 4-6, 6-3 తేడాతో చిత్తు చేసి ఓవరాల్‌గా 12వ సారి సెరెనా సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. 2గంటల పాటు సాగిన మ్యాచ్‌లో విలియమ్స్‌ తన సర్వీస్‌ పవర్‌ను చూపుతూ ఏకంగా 19 ఏస్‌లు కొట్టడం సహా 49 విన్నర్లను సాధించి సత్తా చాటింది. తొలి సెట్‌ను 6-4తో సులువుగానే గెలిచినా.. రెండో సెట్‌లో వెనుకబడింది. ప్రత్యర్థి రిస్కే రెచ్చిపోయి అడడంతో ఆత్మరక్షణ ధోరణి అవలంభించి 4-6తో కోల్పోయింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో పుంజుకొని 6-3తో కైవసం చేసుకొని సెరెనా విజయం సాధించింది.

ఏడో సీడ్‌ హలెప్‌(రొమేనియా) కూడా ఎదురులేని ఆటతో క్వార్టర్‌ఫైనల్‌లో షువాయ్‌ జంగ్‌ (చైనా)ను ఓడించింది. 7-6(7/4), 6-1తో గంటా27 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ప్రారంభం నుంచి ఇరువురు హోరాహోరీగా తలపడడంతో తొలి సెట్‌ టైబ్రేకర్‌ దాకా వెళ్లింది. అప్పటి నుంచి తనదైన దూకుడుతో అదరగొట్టి టైబ్రేకర్‌తో పాటు రెండో సెట్‌ను 6-1తో హలెప్‌ సునాయాసంగా కైవసం చేసుకొని జంగ్‌ను మట్టికరిపించి, ముందడుగేసింది. 19వ సీడ్‌ జొహన్నా కొంటా (బ్రిటన్‌)కు క్వార్టర్స్‌లో షాక్‌ తగిలింది. అన్‌ సీడెడ్‌ క్రీడాకారిణి బార్బోరా స్ట్రైకోవా(చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో ఆమె 6-7(5/7), 1-6 తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. గంటా 37 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో కొంటా ఏకంగా 34 తప్పిదాలు చేసి భారీ మూల్యం చెల్లించుకుంది. మరోమ్యాచ్‌లో అన్‌ సీడెడ్‌ క్రీడాకారిణి, ప్రిక్వార్టర్స్‌లోనే ప్లిస్కోవాను ఇంటికి పంపిన కరోలినా మచువా(చెక్‌రిపబ్లిక్‌)పై 8వ సీడ్‌ ఎలీనా స్వితోలినా(ఉక్రెయిన్‌) విజయం సాధించింది. 7-5, 6-4తో వరుస సెట్లలో మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌కు చేరింది. మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌ గురువారం జరగనున్నాయి. స్వితోలినాతో హలెప్‌, ్రైస్టెకోవాతో సెరెనా విలియమ్సన్‌ తలపడనున్నారు.
Simona-Halep

సెరెనాకు జరిమానా

మాజీ చాంపియన్‌ సెరెనా విలియమ్స్‌కు వింబుల్డన్‌ నిర్వాహకులు జరిమానా విధించారు. రాకెట్‌తో ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ టెన్నిస్‌ కోర్టును డ్యామేజ్‌ చేసిందనే కారణంతో 10వేల డాలర్ల ఫైన్‌ వేశారు. టోర్నీ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్‌ సెషన్లలో ఈ ఘటన జరిగిందని తెలిపారు.

నేడు పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌..

వింబుల్డన్‌లో పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు బుధవారం జరగనున్నాయి. టాప్‌ సీడ్‌ జకోవిచ్‌.. గొఫిన్‌(బెల్జియం)తో తలపడనుండగా.. ఎనిమిదో సీడ్‌ నిషికోరీతో స్విస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ పోటీపడనున్నాడు. అలాగే స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నాదల్‌... సామ్‌ క్వెర్రీ(అమెరికా)తో, గుడియో పెల్లా(అర్జెంటీనా)తో బాటిస్టా అగట్‌(స్పెయిన్‌) తలపడనున్నారు.

392

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles