నాదల్ నాలుగోసారి


Tue,September 10, 2019 03:12 AM

-యూఎస్ ఓపెన్ టైటిల్ కైవసం
హోరాహోరీ ఫైనల్లో మెద్వదెవ్‌పై అద్భుత విజయం
19 గ్రాండ్‌స్లామ్‌లతో ఫెదరర్ తర్వాత రఫెల్

దూకుడుకు మారుపేరైన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మరోసారి గర్జించాడు. మట్టికోర్టులోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఆధిపత్యం చెలాయించి... పరిస్థితులెలా ఉన్నా విజృంభిస్తానని చాటిచెప్పాడు. క్షణక్షణం ఉత్కంఠ మధ్య సాగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో మెద్వదెవ్‌ను ఓడించి 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఒడిసిపట్టుకున్నాడు. ఓ దశలో వరుసగా రెండు సెట్లు గెలిచి విజయం ముగింట నిలిచి.. ఆ తర్వాత తీవ్ర ప్రతిఘటన ఎదురైనా ైస్థెర్యాన్ని కోల్పోలేదు. కఠిన పరిస్థితులు, ఒత్తిడిలో మరింత రాణిస్తానని నిరూపిస్తూ నాలుగోసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. ఎంతోకాలంగా కలలు కంటున్న రోజర్ ఫెదరర్ ఆల్‌టైమ్ గ్రాండ్‌స్లామ్ రికార్డు(20)కు మరో అడుగుదూరంలో నిలిచాడు.

ఆహా.. పోరాటమంటే ఇది.. పట్టువదలని తత్వం, ఆత్మైస్థెర్యమంటే ఇది.. ఫైనల్లో రష్యా యువ ఆటగాడు మెద్వదెవ్ ఆటను చూసి అందరూ అనుకున్న మాటలివి. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన అతడు చివరి వరకు నాదల్‌పై పోరాడిన తీరుకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఎదురుగా ఉంది 18 గ్లాండ్‌స్లామ్‌ల వీరుడు, రెండో సీడ్ ఆటగాడు.. అప్పటికే మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు చేజారిపోయాయి.. అయినా 22 ఏండ్ల మెద్వదెవ్ ధైర్యం కోల్పోలేదు. పోరాడితే పోయేదేముంది ఓటమి తప్ప.. అన్నట్టు చెలరేగిపోయి తదుపరి రెండు సెట్లు గెలిచి 33 ఏండ్ల స్పెయిన్ బుల్‌ను వణికించాడు. నేను జీవితంలో మర్చిపోలేని విజయమిది అని నాదల్ అన్నాడంటే మెద్వదెవ్ ఎంత అద్వితీయంగా పోరాడాడో అర్థమైపోతున్నది.

Rafael-Nadal1
న్యూయార్క్ : టెన్నిస్ సూపర్‌స్టార్, రెండో సీడ్ రఫెల్ నాదల్ మరోసారి సత్తాచాటాడు. అంచనా వేసినట్టు అలవోకగా కాకపోయినా అత్యంత ఉత్కంఠ నడుమ సాగిన తుదిపోరులో విజయం సాధించి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను నాలుగోసారి ముద్దాడాడు. ఒత్తిడిని అధిగమించడంలో తనకుతానే సాటి అని నిరూపించుకున్నాడు.

సోమవారం జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాదల్ 7-5, 6-3, 5-7, 4-6, 6-4 తేడాతో ఐదో సీడ్ మెద్వదెవ్(రష్యా)పై విజయం సాధించి టైటిల్‌ను ఒడిసిపట్టాడు. స్విస్ దిగ్గజం ఫెదరర్(20) ఆల్‌టైం గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డుకు స్పెయిన్ బుల్(19) మరింత చేరువయ్యాడు. క్షణక్షణం ఉత్కం ఠ, గేమ్..గేమ్‌కు మారి న ఆధిపత్యం నడుమ 4గంటల 49 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన తుదిపోరులో ప్లేయర్లిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. నాదల్ ఐదు ఏస్‌లు, 62 విన్నర్లు సంధించగా.. మెద్వదెవ్ ఏకంగా 14ఏస్‌లు, 75 విన్నర్లుతో అదరగొట్టాడు. అయితే, నాదల్ దూకుడును తట్టుకోలేక 75సార్లు తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. కీలక సమయాల్లో ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసిన రఫా.. చివరకు విజయ దరహాసం చేశాడు.

rafel

నాదల్ జోరు

ఫైనల్‌కు చేరే ముందు వరకు ఒక్కసెట్ మాత్రమే కోల్పోయి జోరుమీద ఉండడంతో తుదిపోరులోనూ నాదల్ విజయం సునాయాసం అనుకున్నారంతా. కానీ ఆ అంచనా తప్పని మెద్వదెవ్ తొలి సెట్‌లోనే నిరూపించాడు. సర్వీస్‌తో మ్యాచ్‌ను ఆరంభించిన నాదల్ తొలి గేమ్‌ను అలవోకగానే గెలిచాడు. ఆ తర్వాత ఇరువురు ఆటగాళ్లు సర్వీస్‌లను కాపాడుకుంటూ ముందుకు సాగడంతో 5-5కు సెట్ చేరి ఉత్కంఠ మొదలైంది. ఆ తర్వాత తన సర్వీస్‌ను అలవోకగా గెలిచిన స్పెయిన్‌స్టార్.. తదుపరి మెద్వదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను 7-5తో కైవసం చేసుకున్నాడు. రెండో సెట్‌లో నాదల్‌కు తిరుగులేకుండా పోయింది. శుభారంభం ఇచ్చిన విశ్వాసంతో రెచ్చిపోయిన రఫా 6-3తో సెట్‌ను గెలిచి, విజయానికి చేరువయ్యాడు.

nadal1

మెద్వదెవ్ అద్భుత పోరాటం

నాదల్ జోరు చూస్తుంటే వరుస సెట్లలోనే ట్రోఫీని ముద్దాడేలా కనిపించాడు. అప్పటికే అలిసిపోయిన మెద్వదెవ్ పుంజుకుంటాడని ఎవరూ అంచనా వేయలేదు. ఆ తరుణంలో రష్యా యువ స్టార్ అసమాన పోరాటాన్ని కనబరిచాడు. ఓటమి భయాన్ని మనసులోకి రానివ్వకుండా పోరాడాడు. తొలి సెట్‌లాగే జరిగిన మూడో సెట్‌లో ఇరువురు ఆటగాళ్లు సర్వీస్‌లను కాపాడుకోవడంతో స్కోరు 5-5కు చేరింది. ఆ సమయంలో ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా చక్కటి ఫుట్‌వర్క్ ప్రదర్శించిన మెద్వదెవ్ ఓ బ్రేక్ పాయింట్ సహా వరుసగా రెండు గేమ్‌లను కైవసం చేసుకొని టైటిల్ పోటీలోకి వచ్చాడు. అదే జోరును నాలుగో సెట్‌లోనూ కొనసాగించి.. చక్కటి ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఆకట్టుకున్నాడు. 4-4తో గేమ్‌లు సమానమైన సమయంలో తన సర్వీస్‌లో నాదల్‌కు నిల్‌ను మిగిల్చిన మెద్వదెవ్.. ఆ తర్వాత సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ సమయంలో దాదాపు 22వేల మంది వీక్షకులున్న మైదానంలో తీవ్ర ఉత్కంఠతో కాసేపు నిశబ్దం ఆవరించింది.
Rafael-Nadal
ఇదో అద్భుతమైన మ్యాచ్. ఈ సీజన్ అంతా చాలా బాగా ఆడా. ప్రతీ సందర్భాన్ని గుర్తుపెట్టుకుంటా. నాకు 70 ఏండ్లు వచ్చినా ఈ మ్యాచ్ కచ్చితంగా గుర్తుంటుంది. ఫైనల్లో రఫాతో పోరాడేందుకు సర్వశక్తులూ వడ్డా. పూర్తి కృషి చేశా. నా ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా. నాదల్ బాగా ఆడాడు. అభినందనలు. నేను ఓటమిని అంగీకరిస్తున్నా. ఏ మాత్రం విచారించడం లేదు.
- మెద్వదెవ్

-నాదల్-మెద్వదెవ్(4గంటల 49 నిమిషాలు) మధ్య జరిగిన తుదిపోరు యూఎస్ ఓపెన్ చరిత్రలో రెండో సుధీర్ఘ ఫైనల్ మ్యాచ్‌గా రికార్డులకెక్కింది.
-ఇప్పటి వరకు నాదల్ సాధించిన గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు(ఫ్రెంచ్ ఓపెన్-12, యూఎస్ ఓపెన్-4, వింబుల్డన్ -2, ఆస్ట్రేలియా ఓపెన్-1)


నా టెన్నిస్ కెరీర్‌లో అత్యంత భావోద్వేగానికి గురైన రోజుల్లో ఇదొకటి. ఈ విజయం నాకెంతో విలువైంది. మెద్వదెవ్ పోరాడిన తీరు అద్వితీయం. అద్భుతంగా ఆడి ఓ దశలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చాడు. ఇలాంటి మ్యాచ్‌లో ఏ దశలోనూ ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడం చాలా ముఖ్యం. మ్యాచ్ నా నియంత్రణలోకి వచ్చాక నా ఆత్మైస్థెర్యం ఉన్నతస్థితికి చేరింది.
- నాదల్

రఫా మరోసారి..

ఉవ్వెత్తున ఎగిసిపడడం.. ఒత్తిడిని జయించడం తనకు వెన్నెతో పెట్టిన విద్య అన్నట్టు నాదల్ చివరి సెట్‌లో చక్కటి నిలకడ ప్రదర్శించాడు. ఐదో సెట్ రెండో గేమ్‌లో మెద్వదెవ్‌కు వచ్చిన బ్రేక్ పాయింట్ అవకాశాల్ని మూడు సమర్థంగా తిప్పికొట్టాడు. చివరికి సర్వీస్‌ను కాపాడుకున్నాడు. 2-2తో సమానంగా ఉన్న సమయంలో తదుపరి గేమ్‌లో బ్యాక్‌వ్యాలీతో మెద్వదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి ముందంజలో నిలిచాడు. అయితే నాదల్ 5-2తో విజయానికి చేరువైన సమయంలో మరోసారి రష్యా ప్లేయర్ ప్రతిఘటించాడు. వరుసగా రెండు గేమ్‌లు గెలిచి పోటీలోకి వచ్చి ఉత్కంఠ పెంచాడు. ఆ సమయంలో తన సర్వీస్ కోసం సంయమనం పాటించిన నాదల్... ఫోర్ హ్యాండ్ డ్రాప్ వ్యాలీ షాట్‌తో 6-4తో సెట్‌ను ముగించి.. విజయాన్ని అందుకున్నాడు. విజయ గర్జన చేస్తూ గెలుపు సంబురాలు చేసుకున్నాడు. భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నాడు.

203

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles