సెమీస్‌లో సింధు, సాయి


Sat,August 24, 2019 01:08 AM

-ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
-ఐదోసారి పతకం ఖాయం చేసుకున్న పీవీ
-పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ కొత్త చరిత్ర..

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు షట్లర్లు దుమ్మురేపుతున్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు.. పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ క్వార్టర్స్‌లో చక్కటి విజయాలతో సెమీఫైనల్లో అడుగుపెట్టారు. మెగాటోర్నీలో ఇంతకాలంగా ఊరిస్తూవస్తున్న పసిడి పతకాన్ని ఈసారి ఒడిసి పట్టాల్సిందే అన్నట్లు సింధు ముందుకు సాగుతుంటే.. మూడున్నర దశాబ్దాలుగా పురుషుల సింగిల్స్ పతకం నెగ్గని లోటును తీరుస్తూ.. ప్రణీత్ కనీసం కాంస్యం ఖాయం చేసుకున్నాడు.
PvSindhu

బాసెల్: అచ్చొచ్చిన అడ్డాలో పీవీ సింధు రాకెట్ వేగంతో దూసుకెళ్తుంటే.. అర్జున ఇచ్చిన ధైర్యంతో సాయి ప్రణీత్ ఎదురులేకుండా సాగుతున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు.. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ప్రణీత్ అదిరిపోయే ఆటతో ప్రత్యర్థులను చిత్తుచేసి సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. దీంతో ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గత రెండు పర్యాయాలు రజతాలతో సరిపెట్టుకున్న సింధు ఈసారి పతకం రంగు పసిడిలోకి మార్చాలనే పట్టుదలతో దుమ్మురేపుతుంటే.. 36 ఏండ్ల తర్వాత పురుషుల విభాగంలో సాయి ప్రణీత్ మెడల్ ఖరారు చేసి ఔరా అనిపించాడు. భారత్ నుంచి బరిలో దిగిన ప్లేయర్లంతా వెనుదిరిగిన తరుణంలో సింధు, ప్రణీత్ శుక్రవారం విజృంభించారు. తొలుత సింధు 12-21, 23-21, 21-19తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత తై జు యింగ్ (చైనీస్ తైపీ)ను చిత్తు చేస్తే.. ఆ వెంటనే ప్రపంచ 19వ ర్యాంకర్ సాయి ప్రణీత్ 24-22, 21-14తో ఆసియా క్రీడల పసిడి విజేత, ప్రపంచ 4వ ర్యాంకర్ జొనాథన్ క్రిస్టి (ఇండోనేషియా)ని వరుస గేమ్‌ల్లో ఓడించాడు. ఇప్పటికే ఈ టోర్నీలో రెండు రజతాలు, రెండు కాంస్యాలు చేజిక్కించుకున్న సింధు.. ఐదో మెడల్ తన పేరిట రాసుకుంది. ఇక అది ఏ పతకం అనేది రానున్న రెండు మ్యాచ్‌ల్లో ఆమె ప్రదర్శనపై ఆధారపడి ఉంది. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో చెన్ యు ఫీ(చైనా)తో సింధు, టాప్ సీడ్ కెంటా మెమోటా (జపాన్)తో సాయి ప్రణీత్ తలపడనున్నారు.

గురిచూసి కొట్టిన సింధు..

ప్రత్యర్థిపై మంచి రికార్డు లేకున్నా.. తొలి గేమ్‌లో చిత్తుగా ఓడినా.. అవేవి పట్టించుకోని సింధు తుదికంటా పోరాడి ఒత్తిడిని చిత్తుచేసి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గంటా 11 నిమిషాల పాటు సాగిన పోరు తొలి గేమ్‌లో తెలుగమ్మాయి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆరంభంలో 3-9తో వెనుకబడ్డ సింధు ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. కొంత పోరాటం తర్వాత 9-18కి చేరినా.. అప్పటికే ఆలస్యమైపోయింది. సుదీర్ఘ ర్యాలీలు ఆడేందుకు సింధు ప్రయత్నిస్తే.. ఎక్కడికక్కడే స్మాష్‌లతో తై జు దూసుకెళ్లింది. ఇక ఒత్తిడంతా సింధుపైనే అనుకుంటున్న తరుణంలో అంచనాలను తలకిందులు చేస్తూ.. రెండో గేమ్ ఆరంభంలో చక్కటి ఆటతీరు కనబర్చి 2-0తో ముందంజ వేసింది. కాసేపటికే ప్రత్యర్థి వరుసగా మూడు పాయింట్లు సాధించడంతో స్కోరు 3-3తో సమమైంది. ఈ దశలో రెచ్చిపోయిన తై జు వరుస పాయింట్లు సాధించగా.. సింధు కూడా దీటుగా బదులిచ్చింది. దీంతో స్కోరు 15-15తో సమమైంది. మూడు పాయింట్లు సాధించిన పీవీ 18-16తో గేమ్ సొంతం చేసుకోవడం ఖాయమే అనిపించినా.. పట్టు వదలని తైపీ ప్లేయర్ రెండు గేమ్ పాయింట్లు కాచుకొని 20-20తో స్కోరు సమం చేసింది. సూపర్ సర్వీస్‌తో గేమ్ పాయింట్‌పై నిలిచిన సింధు.. బలమైన క్రాస్ కోర్ట్ షార్ట్‌తో గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో తై జు ఆరంభంలోనే 4-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 8-4తో మరింత ముందుకెళ్లే తరుణంలో సింధు విజృంభించింది. ఒక్కో పాయింట్ సాధిస్తూ.. ఆధిక్యాన్ని తగ్గించింది. ఈ దశలో ప్రత్యర్థి చేసిన తప్పిదాలు కూడా సింధుకు కలిసొచ్చాయి. మ్యాచ్ అనంతరం సింధు మాట్లాడుతూ.. ఈ విజయం తో సంతృప్తి చెందడం లేదు. ముందు ముందు ఇంకా కఠినమైన మ్యాచ్‌లు ఎదురుకానున్నాయి. సెమీస్‌లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తా అని పేర్కొన్నది.

జోరు కనబర్చిన ప్రణీత్..

ఈ మెగాటోర్నీలో అంచనాలకు మించి రాణిస్తున్న సాయి ప్రణీత్ మరోసారి అదిరిపోయే ప్రదర్శన కనబర్చాడు. ఈ ఏడాది ఆరంభంలో స్విస్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచిన సాయి ప్రణీత్.. క్వార్టర్‌ఫైనల్లో తనకంటే మెరుగైన ప్లేయర్‌ను వరుస గేమ్‌ల్లో ఓడించి సత్తాచాటాడు. తొలి గేమ్‌లో 8-4తో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణీత్.. ఆ తర్వాత కాస్త వెనుకబడ్డాడు. ప్రత్యర్థి పుంజుకోవడంతో స్కోరు 10-10 వద్ద సమమైంది. ఒక దశలో 20-19తో నిలిచిన ప్రణీత్ ఓ చక్కటి షాట్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకోవాలని భావించినా.. క్రిస్టి అంతే అద్భుతంగా దాన్ని రిటర్న్ చేశాడు. అయితే ప్రణీత్ కొట్టిన బలమైన షాట్‌ను రిటర్న్ చేసే క్రమంలో క్రిస్టి నెట్ వద్ద తడబడ్డాడు. ఆ సమయంలో క్రాస్‌కోర్ట్ షాట్ ద్వారా వరుసగా రెండు పాయింట్లు సాధించిన ప్రణీత్ గేమ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని ప్రణీత్ 7-1, 11-3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ప్రత్యర్థి కాస్త తేరుకొని.. దగ్గరకు వచ్చినా.. ఎలాంటి తడబాటుకు లోను కాకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. గత 36 ఏండ్లలో ఒక భారత ఆటగాడు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి.

చాలా ఆనందంగా ఉంది. ఈ విజయాన్ని మాటల్లో వర్ణించలేను. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గోపీచంద్ సర్ అటాక్ చేయకు.. రిథమ్ మార్చు అని సూచించారు. అది చక్కటి ఫలితాన్నిచ్చింది.
- సాయి ప్రణీత్

అంపైర్ల వల్లే..

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో అంపైరింగ్ ప్రమాణాలు సరిగ్గా లేవని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆరోపించింది. అంపైర్ల తప్పిదాల వల్లే తాను క్వార్టర్స్ చేరలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ టోర్నీ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో గురువారం సైనా 21-15, 25-27, 12-21తో మియా బ్లిచ్‌ఫెల్డ్ (డెన్మార్క్) చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. రెండో గేమ్‌లో అంపైరింగ్ తప్పిదాల వల్ల 2 మ్యాచ్ పాయింట్లు చేజారడాన్ని నమ్మలేకపోతున్నా. అంతేకాదు ఆట మధ్య లో లైన్ అంపైర్లను వారి పని చేసుకోనివ్వండి అని అంపైర్ నాతో అనడం కూడా సరైంది కాదు. మ్యాచ్ పాయింట్లు ఎలా విస్మరించాడో నాకైతే అర్థం కావడంలేదు. చాలా బాధగా ఉందిఅని సైనా ట్విట్టర్‌లో పేర్కొంది. చెత్త అంపైరింగ్ వల్లే 2 మ్యాచ్ పాయింట్లు కోల్పోవాల్సి వచ్చింది. అంతే కాదు మ్యాచ్‌లో అనేక తప్పుడు నిర్ణయాలు వెలువడ్డాయి. ఆ కోర్టులో రివ్యూ అడిగే చాన్స్ లేకపోవడం మరింత బాధ కలిగించింది అని సైనా భర్త కశ్యప్ ప్రశ్నించాడు.

-ప్రకాశ్ పదుకొనే (1983) తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీస్ చేరిన రెండో ప్లేయర్‌గా సాయి ప్రణీత్ రికార్డుల్లోకెక్కాడు.
-ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింధుకు పతకం ఖాయమవడం ఇది ఐదోసారి. ఇప్పటి వరకు రెండు రజతాలు, రెండు కాంస్యాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.

599

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles