సత్తా చాటుతారా..


Tue,September 17, 2019 04:25 AM

బరిలో సింధు, సైనా, సాయి ప్రణీత్.. నేటి నుంచి చైనా ఓపెన్
sindhu
చాంగ్జౌ(చైనా) : ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాక సన్మానాలు, ప్రశంసల వెల్లువతో తీరిక లేకుండా ఉన్న తెలుగు షట్లర్ పీవీ సింధు.. మరో టోర్నీకి సిద్ధమైంది. మంగళవారం ప్రారంభం కానున్న చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నమెంట్‌లో అడుగుపెట్టనుంది. చాంపియన్‌షిప్ తుదిపోరులో యమగూచిని ఓడించి పసిడిని పట్టిన సింధు.. మరోసారి అదే అద్భుత ప్రదర్శనతో చైనా టైటిల్‌ను సైతం కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మాజీ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత లీ షిరూ(చైనా)తో సింధు బుధవారం తలపడనుంది. ప్రస్తుత ఫామ్ చూస్తే క్వార్టర్స్ వరకు సింధు అలవోకగా చేరుకునే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్టు జరిగితే క్వార్టర్స్‌లో ఐదో సీడ్ సింధు... మూడో సీడ్ చెన్ యూఫీ(చైనా)తో తలపడాల్సి ఉంటుంది.

Saina
మరోవైపు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కూడా ఈ టోర్నీలో సత్తా చాటి ఫామ్‌లోకి రావాలని పట్టుదలగా ఉంది. ఈ ఏడాది ఇండోనేషియా మాస్టర్స్ గెలిచిన సైనా.. ఆ తర్వాత గాయం కారణంగా చాలా టోర్నీలకు దూరమైంది. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మంచి ప్రదర్శనే చేసినా.. క్వార్టర్స్‌లో అంపైర్ల వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఓటమిని చవిచూసి ఇంటిబాట పట్టింది. తొలి రౌండ్‌లో బుసనన్ (థాయ్‌లాండ్)తో 8వ సీడ్ నెహ్వాల్ తలపడనుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం చరిత్ర సృష్టించిన సాయి ప్రణీత్ పై అందరి కండ్లు ఉన్నాయి. గాయం కారణంగా శ్రీకాంత్, డెంగీ వ్యాధితో ప్రణయ్ టోర్నీకి దూరమయ్యారు. మరోవైపు థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్‌తో మెరిసిన రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి ద్వయానికి తోడు సుమిత్ రెడ్డి, మను అత్రి, సిక్కీ రెడ్డి, అశ్విని పొనప్ప పోటీలో ఉన్నారు.

511

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles