మళ్లీ ఓడిన టైటాన్స్


Wed,September 11, 2019 03:49 AM

Titans
యు ముంబా చేతిలో పరాజయం

కోల్‌కతా: ఒక అడుగు ముందుకేస్తే.. రెండడుగులు వెనక్కి పడ్డట్లు ఉంది ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్ పరిస్థితి. తమిళ్ తలైవాస్‌పై గెలుపొందిందని సంబురపడేలోపే.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 27-41తో యు ముంబా చేతిలో పరాజయం పాలైంది. ముంబై జట్టు తరఫున అర్జున్ (10 పాయింట్లు), రోహిత్ బలియాన్ (7 పాయింట్లు) రాణించారు. తెలుగు జట్టు తరఫున స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ (4 పాయింట్లు) ఆకట్టుకోలేకపోయాడు. సిద్ధార్థ్ విఫలమైనా.. రైడింగ్‌లో ముంబై జట్టుకు పోటీనిచ్చిన తెలుగు టీమ్.. ట్యాక్లింగ్‌లో వెనుకబడింది. దీంతో పాటు మూడు సార్లు ఆలౌట్ కావడం కూడా ప్రతికూలంగా మారడంతో టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. ప్రస్తుతం లీగ్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ 4 విజయాలు 8 పరాజయాలు 2 టైలతో 30 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.

అహ్మదాబాద్‌లో పీకేఎల్ ఫైనల్

మూడు నెలలుగా అభిమానులను అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ ఫైనల్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. వచ్చే నెల 19న అహ్మదాబాద్‌లో ప్లే ఆఫ్ట్స్ నిర్వహించనున్నట్లు పీకేఎల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 14న ఎలిమినేటర్స్, 16న సెమీఫైనల్స్, 19న ఫైనల్స్ నిర్వహించనున్నట్లు అందులో పేర్కొంది.

490

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles