నిరవధిక నిషేధం


Sat,January 12, 2019 02:39 AM

-రాహుల్, పాండ్యాలపై సస్పెన్షన్
-విచారణ ముగిసేవరకు జట్టు నుంచి ఉద్వాసన
-సీవోఏ కమిటీ చైర్మన్ వినోద్ రాయ్

pandya-rahul
న్యూఢిల్లీ: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీమ్ ఇండియా యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, లోకేశ్ రాహుల్‌పై వేటు పడింది. బీసీసీఐ నిర్వహించే విచారణ ముగిసే వరకు శనివారం నుంచి ప్రారంభం కానున్న ఆసీస్ పర్యటన, న్యూజిలాండ్ టూర్‌తో పాటు అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌నుంచి నిరవధిక సస్పెన్షన్ విధించినట్లు బీసీసీఐ పాలకుల కమిటీ (సీవోఏ)చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు.కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సందర్భంగా ఇద్దరు క్రికెటర్లూ లైంగికపరమైన వ్యాఖ్యలతో మహిళలను కించపరిచేలా మాట్లాడడం.. సామాజికమాధ్యమాల్లో ఇద్దరు క్రికెటర్లపై విమర్శల వర్షం కురవడంతో సీవోఏ కమిటీ కఠిన నిర్ణయం వెలువరించింది. ఆసీస్ పర్యటనలో ఉన్న ఇద్దరు క్రికెటర్లను తక్షణమే స్వదేశం రావాలని ఆదేశాలు ఇచ్చింది.

ఇప్పటికే ఈ విషయంలో హార్దిక్ పాండ్యా బహిరంగ క్షమాపణలు చెప్పినా శాంతించని కమిటీ శుక్రవారం ఇద్దరిపై నిషేధం వేటు వేసింది. తాజాగా షోకాజ్ నోటీస్ జారీ చేసిన వీరిద్దరిపై విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని వినోద్ రాయ్ స్పష్టం చేశారు. రాహుల్, పాండ్యాలపై విచారణ కోసం తాత్కాలిక అంబుడ్స్‌మన్ లేదా బీసీసీఐ అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలా అన్నది ఇంకా నిర్ణయించలేదని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఇప్పటికే వీరిద్దరిపై రెండు వన్డేల నిషేధం వేటు వేయాలని సీవోఏ కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో సీవోఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం బీసీసీఐ లీగల్ సెల్ సలహా కోసం సంప్రదించింది. ఈ నేపథ్యంలో రాహుల్, పాండ్యా చేసిన వ్యాఖ్యలు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించలేదని బీసీసీఐ లీగల్ సెల్ స్పష్టం చేసింది. ఆటగాళ్లు లేదా సహాయక సిబ్బంది, బీసీసీఐకి వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేసింది

నోరు జారారిలా..

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతూ వెలుగులోకి వచ్చిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆనతి కాలంలోనే టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. ఆసియా కప్ టోర్నీ సందర్భంగా వెన్నెముక గాయంతో విశ్రాంతి తీసుకున్నాడు. చికిత్స అనంతరం కోలుకున్న పాండ్యా ఆసీస్‌తో జరిగే చివరి రెండు టెస్ట్‌లకు జట్టుకు ఎంపికయ్యాడు. కాగా, విశ్రాంతి సమయంలో లోకేశ్ రాహుల్‌తో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాండ్యా తనకు చాలామంది అమ్మాయిలతో ఆ రకమైన సంబంధాలున్నాయని, వారితో గడిపి వచ్చిన విషయాన్ని మా అమ్మానాన్నలతో పంచుకుంటానని పాండ్యా వెకిలిగా మాట్లాడాడు. మా ఇంట్లో వారితో (అమ్మానాన్నలు సహా) అన్ని విషయాలు పంచుకుంటాను. సెక్స్‌కు సంబంధించిన అనుభవాలనూ చెబుతుంటాను. ఏ విషయాన్నీ దాచుకోను. నేను మొదటిసారి సెక్స్ చేసిన విషయాన్నీ మా కుటుంబసభ్యులతో పంచుకున్నాను.

ఇంకా చెప్పాలంటే అమ్మాయిలను అదే దృష్టితో చూస్తుంటాను. ముఖ్యంగా మహిళల వెనుకభాగం నన్ను ఎక్కువగా ఆకర్షిస్తుంది. వెనుకగా కనిపించే వారి అందాలను గమనించేందుకే వారి వెనుక నడుస్తాను అని అసభ్యకరంగా పాండ్యా పేర్కొన్నాడు. పురుషహంకారం బయటపడేలా మహిళలను సంబోధించే విషయంలో ఇది, అది, దానిని అంటూ రెచ్చిపోయి వెకిలి వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇదే షోలో రాహుల్ మాట్లాడుతూ 18 ఏండ్ల వయసునుంచే అమ్మాయిలతో ఎంజాయ్ చేశాను. ఆ సమయంలో నా జేబులో మా అమ్మకు కండోమ్ దొరికింది. దీంతో ఈ విషయాన్ని మా అమ్మ ..మా నాన్న దృష్టికి తీసుకెళ్లింది. మొదట మా నాన్న నన్ను తిట్టాడు. తర్వాత ఫర్లేదు..రక్షణ కవచం వాడావు అంటూ మెచ్చుకున్నారు అని రాహుల్ అదో పెద్ద ఘన కార్యంగా చెప్పుకొచ్చాడు.

వీరిద్దరూ ఆసీస్ పర్యటనలో ఉండగా ఈ షో ప్రసారమైంది. అసభ్యంగా వీరు చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు కురిశాయి. మహిళా సంఘాలతో సహా క్రికెట్ అభిమానులంతా దుమ్మెత్తి పోయడంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. దీంతో తను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ హార్దిక్ పాండ్యా ట్విట్టర్ వేదికగా మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పినా బీసీసీఐ శాంతించలేదు. ఒకవైపు వీరిద్దరి వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే 24 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీస్ జారీ చేసిన బీసీసీఐ ..మళ్లీ తాజాగా ఇరువురికీ షోకాజ్ నోటీస్ జారీ చేయాలని నిర్ణయించింది.

82 ఏండ్లలో రెండోసారి!

విదేశీ పర్యటనలో ఉన్న ఆటగాళ్లను బీసీసీఐ వెనక్కి రప్పించడం 82 ఏండ్లలో ఇది రెండోసారి మాత్రమే కావడం విశేషం. 1936లో అప్పటి భారత జట్టు మహారాజా విజయనగరం(విజ్జీ) సారథ్యంలో ఇంగ్లండ్‌లో పర్యటించిన సమయంలో తొలిసారిగా ఓ ఆటగాడిని బీసీసీఐ వెనక్కి రప్పించింది. అప్పట్లో ఆట లేకున్నా రాజు కావడంతో విజ్జీ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆ జట్టులో దిగ్గజ క్రికెటర్ లాలా అమర్‌నాథ్ సభ్యుడు. వెన్నునొప్పితో బాధపడుతున్నా విజ్జీ ..అమర్‌నాథ్‌కు విశ్రాంతి నివ్వకుండా ఆడించాడు. చివరకు లార్డ్స్ మ్యాచ్ సందర్భంగా తన బదులు వేరొకరిని బ్యాటింగ్‌కు పంపాలని అమర్‌నాథ్ కోరినా విజ్జీ ఒప్పుకోలేదు. దీంతో అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కిట్‌ను విసిరేసి పంజాబీలో అరిచాడు.

మిగిలిన ఆటగాళ్ల సాయంతో చర్యలు తీసుకునేలా చేసిన విజ్జీ వెంటనే అమర్‌నాథ్‌ను స్వదేశం పంపించాడు.
Himanshu
అన్యాయమే అయినా విజ్జీ రాజరికం ముందు అమర్‌నాథ్ గెలవలేకపోయాడు. అనంతరం మళ్లీ తాజాగా రెండోసారి విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్, పాండ్యాలను బీసీసీఐ వెనక్కి పిలిచింది. ఇంకో విశేషమేమిటంటే 1996లో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా అప్పటి కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌తో విభేదించిన నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ స్వదేశం బయలుదేరి వచ్చాడు. తన స్థానంలో కొత్త ఓపెనర్ సౌరభ్ గంగూలీకి చోటివ్వడంతో కోపంతో సిద్ధూ తనకుతానుగా వెనక్కి వచ్చాడు.

సరదాగానే మాట్లాడాడు: హిమాన్షు పాండ్యా

భారత యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను అతని తండ్రి హిమాన్షు పాండ్యా వెనకేసుకొచ్చారు. డేటింగ్, అమ్మాయిల గురించి టాక్‌షో అడగడంతో పాండ్యా సరదాగానే బదులిచ్చాడని చెప్పుకొచ్చారు. అభిమానులను అలరించాలన్న ఉద్దేశంతోనే అలా మాట్లాడాడని చెప్పారు.. . పూర్తి వినోదత్మకమైన షోలో హార్దిక్ పాండ్యా పాల్గొన్నాడు. ప్రేక్షకుల ఆనందం కోసం అతను సరదాగా మాట్లాడాడు. ఈ మాటలను తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వినోదాత్మక షోలో మాట్లాడిన మాటలకు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. అతను చాలా అమాయకుడు. సరదా మనిషి అని పాండ్యాకు బాసటగా హిమాన్షు పాండ్యా స్పందించారు.

882

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles