భారత్ 297 ఆలౌట్


Sat,August 24, 2019 12:57 AM

-రాణించిన రవీంద్ర జడేజా
-వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 75/3
-రాత్రి 7 నుంచి సోనీ టెన్-1, టెన్-3లో

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మిడిలార్డర్ వైఫల్యంతో ఇబ్బందులు పడుతున్న టీమ్‌ఇండియాకు విండీస్‌తో టెస్టులో అదే ఆదుకుంది. పరీక్ష పెడుతున్న పిచ్‌పై అగ్రశ్రేణి ఆటగాళ్లు నిలువలేకపోయిన చోట.. కింది వరుస బ్యాట్స్‌మెన్ పోరాడటంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో పోరాడే స్కోరు చేసింది. అజింక్యా రహానే చక్కటి ఇన్నింగ్స్‌కు చివర్లో రవీంద్ర జడేజా మెరుపులు తోడవడంతో మూడొందల మార్కుకు చేరువైంది. యువ రిషబ్ పంత్ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన చోట ఇషాంత్ శర్మ 20 ఓవర్ల పాటు నిలువడం విశేషం. అనంతరం బౌలింగ్ లోనూ మనవాళ్లు సత్తా చాటడంతో.. టీ విరామ సమయానికి కరీబియన్లు 3 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేశారు. ఆరంభంలో ధాటిగా ఆడేందుకు యత్నించిన విండీస్ బ్యాట్స్‌మెన్‌కు మనవాళ్లు కళ్లెం వేశారు. షమీ, ఇషాంత్, జడేజా తలా ఓ వికెట్ పడగొట్టి ప్రత్యర్థిని ఎక్కువ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. ఇలాగే సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటితే కరీబియన్లపై మనదే పైచేయి అవుతుంది.
Jadeja

అంటిగ్వా: భారత వైస్ కెప్టెన్ అజింక్యా రహానే (163 బంతుల్లో 81; 10 ఫోర్లు) పోరాటానికి ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (112 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్సర్) తెగువ తోడవడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ మంచి స్కోరు చేసింది. టాపార్డర్ విఫలమైన చోట లోయరార్డర్ దన్నుగా వీరిద్దరూ చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత్ కోలుకుంది. ఫలితంగా టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 96.4 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. విహారి (32) ఫర్వాలేదనిపించగా.. పంత్ (24) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దాదాపు 20 ఓవర్లు క్రీజులో నిలిచిన ఇషాంత్ శర్మ (62 బంతుల్లో 19) జడ్డూకు చక్కటి సహకారం అందించడం విశేషం. విండీస్ బౌలర్లలో రోచ్(4/66), గాబ్రియల్ (3/71), చేజ్(2/58) వికెట్లు పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వెస్టిండీస్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. దూకుడు కనబర్చిన ఓపెనర్ క్యాంప్‌బెల్ (23)ను షమీ(1/10) పెవిలియన్ బాట పట్టించగా.. క్రైగ్ బ్రాత్‌వైట్ (14)ను ఇషాంత్ (1/30) రిటర్న్ క్యా చ్‌తో ఔట్ చేశాడు. అరంగేట్ర ఆటగాడు బ్రూక్స్ (11) జడేజా(1/5)కు చిక్కా డు. టీ విరామానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లలో 3 వికెట్లకు 82 పరుగులు చేసింది. బ్రావో (18), చేజ్ (10) క్రీజులో ఉన్నారు.

జడ్డూ జోడీ కమాల్..

ఓవర్‌నైట్ స్కోరు 203/6తో రెండో రోజైన శుక్రవారం ఆట కొనసాగించిన టీమ్‌ఇండియా మరో 94 పరుగులు చేసి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ (24) క్రితం రోజు స్కోరుకు నాలుగు పరుగులే జోడించి ఔటయ్యాడు. ఈ దశలో జడేజాకు ఇషాంత్ చక్కటి సహకారం అందించాడు. చక్కటి డిఫెన్స్‌తో జడ్డూపై ఒత్తిడి తగ్గించాడు. దీంతో స్వేచ్ఛగా షాట్లు ఆడిన జడేజా చకచకా పరుగులు జోడీస్తూ పోయాడు. విండీస్ పేసర్లను విసిగించిన ఈ జోడీ ఎనిమిదో వికెట్‌కు 60 పరుగులు జోడించింది. అనంతరం ఇషాంత్, షమీ (0) వెంటవెంటనే ఔటవడంతో జడేజా భారీ షాట్లకు దిగాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 11వ అర్ధశతకం పూర్తి చేసుకోవడంతో పాటు జట్టు స్కోరును మూడొందలకు చేరువ చేసి చివరి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు.

స్కోరు బోర్డు


భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (సి) హోప్ (బి) చేజ్ 44, మయాంక్ (సి) హోప్ (బి) రోచ్ 5, పుజారా (సి) హోప్ (బి) రోచ్ 2, కోహ్లీ (సి) బ్రూక్స్ (బి) గాబ్రియల్ 9, రహానే (బి) గాబ్రియల్ 81, విహారి (సి) హోప్ (బి) రోచ్ 32, పంత్ (సి) హోల్డర్ (బి) రోచ్ 24, జడేజా (సి) హోప్ (బి) హోల్డర్ 58, ఇషాంత్ (బి) గాబ్రియల్ 19, షమీ (సి అండ్ బి) చేజ్ 0, బుమ్రా (నాటౌట్) 4, ఎక్స్‌ట్రాలు: 19, మొత్తం: 96.4 ఓవర్లలో 297 ఆలౌట్. వికెట్ల పతనం: 1-5, 2-7, 3-25, 4-93, 5-175, 6-189, 7-207, 8-267, 9-268, 10-297, బౌలింగ్: రోచ్ 25-6-66-4, గాబ్రియల్ 22-5-71-3, హోల్డర్ 20.4-11-36-1, మిగావ్ కమిన్స్ 13-1-49-0, చేజ్ 16-3-58-2.

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: క్రైగ్ బ్రాత్‌వైట్ (సి అండ్ బి) ఇషాంత్ 14, క్యాంప్‌బెల్ (బి) షమీ 23, బ్రూక్స్ (సి) రహానే (బి) జడేజా 11, బ్రావో (నాటౌట్) 18, చేజ్ (నాటౌట్) 10, ఎక్స్‌ట్రాలు: 6,
మొత్తం: 28 ఓవర్లలో 82/3. వికెట్ల పతనం: 1-36, 2-48, 3-50, బౌలింగ్: ఇషాంత్ 8-2-32-1, బుమ్రా 8-2-11-0, షమీ 7-3-17-1, జడేజా 5-2-17-1.

565

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles