కుర్రాళ్లూ.. కుమ్మేయండి


Tue,September 17, 2019 04:38 AM

ఎప్పుడొచ్చామన్నది కాదు.. సత్తాచాటామా లేదా అన్నదే ముఖ్యం.వచ్చింది రెండు మూడు అవకాశాలైనా.. అందులోనే జెండా పాతేయాలి. టీమ్‌ఇండియాలోకి వస్తున్న కొత్త కుర్రాళ్లకు కోహ్లీ మార్క్ దిశానిర్దేశమిది. భారత్ లాంటి జట్టులో ఎక్కువ చాన్స్‌లు దక్కుతాయని ఆశించొద్దు.. వచ్చిన అవకాశాలనే మెట్లుగా మలుచుకొని ఎదగాలి.. అనేది అతడి అంతరంగం. పొట్టి ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా పలువురు కొత్త కుర్రాళ్లను పరిశీలిస్తున్న టీమ్ మేనేజ్‌మెంట్ వారికి ఎక్కువ చాన్స్‌లు ఇచ్చే మూడ్‌లో లేదు. వచ్చిన కొద్దిపాటి అవకాశాలనే సద్వినియోగపర్చుకొని తమదైన ముద్ర వేస్తేనే జట్టులో చోటు నిలుస్తుందని విరాట్ నోటి ద్వారా నర్మగర్భంగా చెప్పించింది. మరి ఇలాంటి స్థితిలో ప్రస్తుత యువ ఆటగాళ్ల తీరుతెన్నులపై ఓ లుక్కేస్తే..
Khaleel
Khaleel21
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం: జాతీయ జట్టు తరఫున ఎక్కువ అవకాశాలు వస్తాయని ఆశించడం సరైంది కాదు. నేను టీమ్‌లోకి వచ్చిప్పుడు మూడు నుంచి ఐదు చాన్స్‌లు వస్తాయనుకున్నా. వచ్చిన వాటినే వినియోగించుకొని తమను తాము నిరూపించుకోవాలి. అప్పుడే ఆటగాళ్ల సత్తా బయటపడుతుంది దక్షిణాఫ్రికాతో తొలి టీ20 సందర్భంగా టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్న మాటలివి. పైపైన చూడటానికి కొత్త కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసం నింపేలా కనిపిస్తున్నా.. వీటి వెనుక నిగూఢార్థాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఉన్న స్థితిలో ఒకటీ రెండు అవకాశాలు రావడమే కష్టం.. అలాంటిది వరుసగా చాన్స్‌లు లభించడం అంటే పగటి కలే. అందుకే బరిలో దిగే చాన్స్ వచ్చినప్పుడే సత్తాచాటాలని చెప్పడంతో పాటు.. ఇక నుంచి ఎవరికీ ఎక్కువ అవకాశాలు దక్కవని ఒకింత సూటిగా చెప్పేసినట్లే. వన్డే ప్రపంచకప్ పోయినా.. పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలువాలని భావిస్తున్న కోహ్లీసేన అందుకోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నది. ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్ కోసం టీమ్‌ఇండియా అస్త్రశస్ర్తాలు రెడీ చేసుకుంటున్నది. ఇందులో భాగంగా టాప్ త్రీ మినహా అన్ని స్థానాలకు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది.

పుష్కర కాలమైంది

ఏమాటకామాట చెప్పుకోవాలంటే.. పొట్టి ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా పెద్ద ప్రమాదకరమైన జట్టేమి కాదు. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మాదిరి భారీ హిట్టర్లు మన జట్టులో లేరనే చెప్పాలి. టీ20 ఫార్మాట్‌లో జరిగిన తొలి ప్రపంచకప్ (2007) మినహాయిస్తే.. మనవాళ్లు మరోసారి టైటిల్ గెలువలేకపోయారు. మిగిలిన జట్లన్నీ టీ20ల్లో కుర్రాళ్లకు పెద్దపీట వేస్తూ.. బాదుడే పరమావధిగా ముందుకు సాగుతుంటే.. టీమ్‌ఇండియా మాత్రం వన్డే తరహా ప్లాన్‌తోనే ముందుకు సాగుతున్నది. ఇన్నాళ్లకు ఈ అంశంపై దృష్టి సారించిన జట్టు యాజమాన్యం భారీ స్కోర్లు నమోదు చేయాలంటే.. లోయర్ ఆర్డర్‌కు కూడా బ్యాటింగ్ చేసే సత్తా ఉండాలని గుర్తించింది. అందులో భాగంగానే బౌలర్లలో కూడా బ్యాట్ ఝలిపించగలిగే వారివైపే మొగ్గుచూపుతున్నది.

పంత్‌కు పోటీగా సంజూ శాంసన్

పొట్టి ఫార్మాట్‌కు అతికినట్లు సరిపోయే ఆటతీరు గల పంత్‌కు లెక్కకు మిక్కిలి అవకాశాలు దక్కాయనే చెప్పాలి. సాహా గాయం కారణంగా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న పంత్ అదే జోరులో ధోనీ గైర్హాజరీలో పొట్టి ఫార్మాట్‌లోకి దూసుకొచ్చాడు. పదే పదే చెత్త షాట్ సెలక్షన్‌తో వికెట్ పారేసుకుంటున్న పంత్‌పై ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి నెలకొది. షాట్ల ఎంపికలో జాగ్రత్త తీసుకోకపోతే పంత్‌కు ఇబ్బందులు తప్పవని కోచ్ రవిశాస్త్రి పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌తో పాటు సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ వికెట్ కీపర్ స్లాట్ కోసం కాచుకొని కూర్చున్నారు. మరోవైపు నాలుగేండ్ల క్రితమే టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసిన మనీశ్ పాండే ఇప్పటి వరకు జట్టులో సుస్థిర స్థానం ఏర్పరుచుకోలేకపోయాడు. ఫిట్‌నెస్, టెక్నిక్ పరంగా అత్యుత్తమ ఆటగాడే అయినా.. అవసరమైన సమయంలో విఫలమై చేజేతులా అవకాశాలను వదులుకుంటున్నాడు. కోహ్లీ మాటలను బట్టి చూస్తే.. సఫారీలతో రెండో టీ20లో పాండే ప్లేస్‌లో అయ్యర్ తుదిజట్టులో ఉండే అవకాశాలు ఎక్కువున్నాయి. ఇటీవల కరీబియన్ టూర్‌లో మిడిలార్డర్‌లో అయ్యర్ విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.

ఆశావహులు ఎక్కువే..

ఒకటీ అర అవకాశాలు దక్కించుకున్న వారితో పాటు.. టీమ్‌ఇండియా గడప తొక్కాలనుకుంటున్న ఆటగాళ్ల జాబితా చాంతాడంత ఉంది. అండర్-19 ప్రపంచకప్‌తో వెలుగులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ న్యూజిలాండ్ పర్యటన లో రెండు వన్డేలాడినా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దేశవాళీల్లో సత్తాచాటిన గిల్ తాజాగా సఫారీ సిరీస్ కోసం టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. మిస్టరీ స్పిన్నర్ మయాంక్ మార్కండే కరీబియన్ టూర్‌లో ఒక టీ20 ఆడాడు. మీడి యం పేసర్ సందీప్ శర్మ 2 టీ20లు ఆడితే.. మరో పేసర్ సిద్ధార్థ్ కౌల్ 3 వన్డేలు, 3 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రసూల్ ఒక టీ20 మ్యాచ్ బరిలో దిగితే.. పంత్ స్థానంపై కన్నేసిన శాంసన్ కూడా పొట్టి ఫార్మాట్‌లో ఓ మ్యాచ్ ఆడాడు. ఇంకా గౌతమ్, సూర్యకుమార్ , నితీశ్ రాణా ఇలా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్న వారి లిస్ట్ చాలా పెద్దగా ఉంది.

సుందర్

sunder
sunder21

రాహుల్ చాహర్

Rahul
Rahul21

కుల్చాజోడీ ఎక్కడా..?

సరిగ్గా లెక్కేస్తే.. టీ20 ప్రపంచకప్‌నకు ఏడాది సమయమే ఉంది. మరి ఉన్న ఈ కొద్ది టైంలో తమ అగ్రశ్రేణి స్పిన్నర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సింది పోయి.. టీమ్ మేనేజ్‌మెంట్ మరిన్ని ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తున్నది. దక్షిణాఫ్రికా సిరీస్‌కు జట్టును ప్రకటించిన సమయంలో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. వరల్డ్‌కప్ కోసం కుల్దీప్, చహల్ మా ప్రథమ ఎంపిక. కానీ ఇంకా మెరుగైన ఆప్షన్‌లతో పాటు విభిన్న కాంబినేషన్‌ల కోసం ప్రయత్నిస్తున్నాంఅని అన్నాడు. మిగిలిన జట్లతో పోల్చుకుంటే.. భారత లోయర్‌ఆర్డర్ బ్యాటింగ్ సామర్థ్యం చాలా తక్కువఅని తాజాగా విరాట్ కూడా అన్నాడు. అంటే చివర్లో బ్యాటింగ్‌కు వచ్చే బ్యాట్స్‌మన్ కూడా భారీ షాట్లు ఆడగలిగే విధంగా ఉండాలనేది కెప్టెన్ ఆలోచన. అందుకు తగ్గట్లే.. అవసరమైతే బ్యాట్‌తోనూ విలువైన పరుగులు రాబట్టగలిగే వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్‌కు చాన్స్ ఇచ్చినట్లు భావించొచ్చు.

deepak
deepak21

భువీ, బుమ్రా ప్లేస్‌లో ఖలీల్, దీపక్..!

గతేడాది టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసిన లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ ఇప్పటి వరకు 11 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. ప్రస్తుతం జట్టులో ఎడమ చేతివాటం పేసర్ లేకపోవడంతో అతడికి విరివిగా అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పటి వరకు వన్డేల్లో 15, టీ20ల్లో 11 వికెట్లు పడగొట్టిన ఖలీల్ ఇంకా చాలా మెరుగవ్వాల్సి ఉంది. దీపక్ చాహర్.. టీమ్‌ఇండియా తరఫున ఒక వన్డే, 2 టీ20లు ఆడాడు. ఇటీవల వెస్టిండీస్‌పై 3 ఓవర్లు వేసి 4 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. అయితే సీనియర్ పేసర్ ప్రవీణ్ కుమార్‌ను పోలి ఉండే మీడియం పేస్‌తో దీపక్ రాణించగలిగితే.. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ లోతు పెరుగుతుంది. కొత్త కుర్రాడు నవదీప్ సైనీ ఆడింది 3 టీ20లే అయినా.. అతడిపై విపరీతమైన హైప్ ఏర్పడింది. నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయడం అతడి ప్రత్యేకత. ఐపీఎల్లో అదరగొట్టిన రాహుల్ చాహర్.. ఇప్పటి వరకు ఒకే టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చిన కృనాల్ పాండ్యా 14 టీ20ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేయగల వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఇద్దరూ పదేసి టీ20లు ఆడారు.

1511

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles