నీరుగారిన ఉత్సాహం!


Wed,July 10, 2019 03:25 AM

-విజయం వాయిదా!
-భారత్‌, కివీస్‌ సెమీస్‌కు వరుణుడు అడ్డు
-కివీస్‌ 46.1 ఓవర్లలో 211/5..
-బుధవారం రిజర్వ్‌ డేలో మ్యాచ్‌ కొనసాగింపు
-వరల్డ్‌కప్‌ సెమీస్‌ మ్యాచ్‌ వర్షంతో నేటికి వాయిదా
- భారత బౌలర్ల సమిష్టి ప్రదర్శన
-న్యూజిలాండ్‌ 211/5

అనుకున్నట్లే భారత బౌలర్లు విజృంభించారు. కఠిన ప్రత్యర్థి కివీస్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేశారు. బుమ్రా యార్కర్లతో రెచ్చిపోతే.. భువనేశ్వర్‌ లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడి ఫలితం సాధించాడు. మధ్య ఓవర్లలో జడేజా మరీ పిసినారిగా వ్యవహరిస్తే.. పాండ్యా బౌన్సర్లతో అదరగొట్టాడు. కుల్దీప్‌ ప్లేస్‌లో చాన్స్‌ దక్కించుకున్న చాహల్‌ కాస్త ఎక్కువ పరుగులిచ్చినా.. కివీస్‌ బ్యాటింగ్‌కు వెన్నెముకైన కేన్‌ విలియమ్సన్‌ను ఔట్‌ చేశాడు. అంతా కోరుకున్నట్లే జరుగుతున్నది. మరో నాలుగు ఓవర్లు ముగిస్తే.. మన లక్ష్యం ఎంతో డిక్లేర్‌ అయ్యేదే.. అలాంటి దశలో నేనున్నానంటూ వచ్చిన వరుణుడు.. ఇక అక్కడే తిష్ట వేశాడు. మన బౌలర్ల మెరుపులు చూసేందుకు చుట్టపు చూపుగా వచ్చినట్లు కనిపించినా.. ఆ తర్వాత ఐదు గంటల ఆటను మింగేశాడు. దీంతో మైదానం నీటితో నిండిపోయింది. పలుమార్లు పరిశీలనలు, వాయిదాలు, చర్చలు ఇలా ఎన్ని జరిగినా చివరకు ఆట బుధవారానికి వాయిదా పడింది.
Kohli
వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత్‌, న్యూజిలాండ్‌ను వరుణుడు నీడలా వెంటాడుతూనే ఉన్నాడు. లీగ్‌ దశ తరహాలోనే కీలక సెమీఫైనల్లోనూ వర్షం అంతరాయం కల్గించింది. ఫలితంగా ఎన్నో ఆశలు, అంచనాల మధ్య మొదలైన సెమీస్‌ మ్యాచ్‌ కాస్తా నీరు గారిపోయింది. ఎడతెరిపిలేని వర్షంతో మైదానం చిత్తడిగా మారిపోయింది. పలుమార్లు పరిశీలించిన అంపైర్లు ఆటకు అనువుగా లేదని తేల్చడంతో మ్యాచ్‌ను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అప్పటివరకు ఓపికతో ఎదురుచూసిన వేలమంది అభిమానులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఐసీసీ నిబంధనల ప్రకారం వర్షంతో మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి ఉన్న ఇన్నింగ్స్‌ను మరుసటిరోజు తిరిగి కొనసాగించనున్నారు.
అయితే బుధవారం కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఒక వేళ మ్యాచ్‌ పూర్తిగా రద్దయితే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌ నేరుగా ఫైనల్లోకి దూసుకెళుతుంది. లేకపోతే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం ఓవర్లు కుదించి మ్యాచ్‌ను కొనసాగించే ప్రయత్నం చేయవచ్చు. మంగళవారం టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌.. కెప్టెన్‌ విలియమ్సన్‌ (67), రాస్‌ టేలర్‌ (67 నాటౌట్‌) అర్ధసెంచరీలతో 46.1 ఓవర్లలో 211/5 స్కోరు చేసింది. పిచ్‌ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ బుమ్రా, భువనేశ్వర్‌ నిప్పులు చెరిగే బంతులతో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. స్వింగ్‌తో అదరగొడుతూ పరుగులను నియంత్రించారు. విలియమ్సన్‌, టేలర్‌ మినహా ఎవరూ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయకపోవడం మన బౌలింగ్‌ సత్తాను చాటింది. సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమ్‌ఇండియా బౌలర్లు ఒక్కో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

Manchester
మాంచెస్టర్‌:ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టాలని తహతహలాడుతున్న టీమ్‌ఇండియా జోరుకు వరుణుడు బ్రేక్‌ వేశాడు. విశ్వసమరం తొలి సెమీఫైనల్లో భారత్‌ మంచి స్థితిలో ఉన్న సమయంలో మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో.. ఆట అర్ధాంతరంగా నిలిచింది. సెమీఫైనల్‌కు రిజర్వ్‌ డే ఉందని సంబరపడేలోపే.. బుధవారం ఇంకా భారీ వర్షం పడే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం వర్షం కారణంగా పూర్తి ఓవర్లు సాగని మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ 46.1ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్లిష్టమైన పిచ్‌పై కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (95 బంతుల్లో 67; 6 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. రాస్‌ టేలర్‌ (85 బంతుల్లో 67 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), లాథమ్‌ (3 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా (8 ఓవర్లలో 1/25), భువనేశ్వర్‌ (8.1 ఓవర్లలో 1/30) రాణించారు. కీలక మ్యాచ్‌లో ఇరుజట్లు ఒక్కో మార్పుతో బరిలో దిగాయి. చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆడిన కుల్దీప్‌ను పక్కనపెట్టి టీమ్‌ఇండియా చహల్‌కు అవకాశమివ్వగా, న్యూజిలాండ్‌.. సౌథీ ప్లేస్‌లో ఫెర్గూసన్‌ను తీసుకుంది. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జూన్‌ 13న జరగాల్సిన లీగ్‌ మ్యాచ్‌ భారీ వర్షం కారణంగా రైద్దెన విషయం తెలిసిందే.

team
ఒకవేళ వర్షం కారణంగా ఆట సాగకపోతే.. లీగ్‌దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన భారత్‌ (15 ).. న్యూజిలాండ్‌(11 )ను తోసిరాజని తుదిపోరుకు అర్హత సాధిస్తుంది.

కట్టిపడేసిన పేసర్లు

టాస్‌ ఓడిపోవడంతో ఒకింత కలవరపాటుకు గురైన టీమ్‌ఇండియాకు బౌలర్లు అదిరిపోయే ఆరంభం అందించారు. పకడ్బందీ బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేశారు. జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ చెరో ఎండ్‌ నుంచి చెలరేగుతుంటే.. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు తీసేందుకు నానాతంటాలు పడ్డారు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బందిగా కనిపించిన ఓపెనర్‌ మార్టీన్‌ గప్టిల్‌ (1) స్లిప్‌లో కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. గప్టిల్‌కు పదే పదే ఆఫ్‌స్టంప్‌పై బంతులు వేసిన మన పేసర్లు.. తనంతట తానే వికెట్‌ సమర్పించుకునేలా ఉసిగొల్పారు. వీరిద్దరు ఎక్కడా తగ్గకపోవడంతో న్యూజిలాండ్‌ ఎనిమిదో ఓవర్‌లోగానీ తొలి బౌండ్రీ కొట్టలేకపోయింది. మొత్తానికి పవర్‌ ప్లే ముగిసేసరికి కివీస్‌ వికెట్‌ నష్టానికి 27 పరుగులు చేసింది. మరో ఓపెనర్‌ నికోల్స్‌ (51 బంతుల్లో 28)కు కెప్టెన్‌ విలియమ్సన్‌ తోడైనా.. పరుగులు వేగం మాత్రం పెరగలేదు. పొదుపుగా బౌలింగ్‌ చేసిన రవీంద్ర జడేజా (1/34).. రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించాక నికోల్స్‌ను ఔట్‌ చేశాడు.

విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌ క్రీజులో ఉన్నా.. ఓ దశలో 13 ఓవర్ల పాటు న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండ్రీ కూడా రాలేదు. 29వ ఓవర్‌లో కానీ ఆ జట్టు స్కోరు 100 దాటలేదు. 79 బంతుల్లో అర్ధ శతకం పూర్తిచేసుకున్న విలియమ్సన్‌ స్కోరు పెంచే క్రమంలో ఔట్‌ కావడంతో మూడో వికెట్‌కు నమోదైన 65 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చి రావడంతోనే క్యాచ్‌ మిస్‌ కావడంతో బతికిపోయిన నీషమ్‌ (12) పెద్దగా ఆకట్టుకోలేకపోగా.. గ్రాండ్‌ హోమ్‌ (16) కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. మరో ఎండ్‌లో టేలర్‌ కొన్ని చక్కటి షాట్లతో అలరించడంతో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో 40 ఓవర్ల తర్వాత తొలిసారి రన్‌రేట్‌ 4 దాటింది. అప్పటి వరకు నత్తనడకన బ్యాటింగ్‌ చేసిన టేలర్‌ కాస్త జోరు పెంచడంతో ఆట నిలిచిపోవడానికి ముందు 6.1 ఓవర్లలో కివీస్‌ 56 పరుగులు చేసింది. మరో నాలుగు ఓవర్లలో మ్యాచ్‌ ముగుస్తుందనగా వర్షం జోరందుకోవడంతో ఆటకు బ్రేక్‌ పడింది. భారత బౌలర్లలో భువీ, బుమ్రా, పాండ్యా, జడేజా, చహల్‌ తలా ఓ వికెట్‌ తీశారు.

మన మంచికే..

వర్షం కురిసిన పిచ్‌పై తక్కువ టార్గెటైనా ఛేజ్‌ చేయడం చాలా కష్టం అనే విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. చిత్తడిగా ఉన్న ఔట్‌ఫీల్డ్‌పై ఛేదన అంత సులువు కాదు. తగ్గించిన టార్గెట్‌ను ఛేదించేందుకు మంగళవారమే భారత్‌ బరిలో దిగుతుందని అంతా ఊహించారు. కానీ 20 ఓవర్లలో 148 పరుగులు చేయాల్సి వచ్చినా మాంచెస్టర్‌లో అది అంత సులభతరం అయ్యేది కాదు. చల్లటి వాతావరణంలో బౌల్ట్‌, ఫెర్గూసన్‌, హెన్రీ, గ్రాండ్‌హోమ్‌ను ఎదుర్కోవడం భారత బ్యాట్స్‌మెన్‌కు తలకు మించిన భారం అయ్యేదే. వర్షం కారణంగా మ్యాచ్‌ బుధవారానికి వాయిదా పడటం ఒకందుకు మనకు మంచే చేసింది. నేడు తాజాగా తిరిగి గ్రౌండ్‌లో అడుగుపెట్టనున్న టీమ్‌ఇండియా మంగళవారం మ్యాచ్‌ ఆగిన దగ్గరి నుంచి తిరిగి ప్రారంభిస్తుంది. మాంచెస్టర్‌లో బుధవారం కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కివీస్‌ తిరిగి బ్యాటింగ్‌ కొనసాగిస్తుందా.. లేక సవరించిన లక్ష్యంతో భారత్‌ బ్యాటింగ్‌కు దిగుతుందా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ న్యూజిలాండ్‌ మరోసారి బ్యాటింగ్‌కు రాకపోతే.. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం భారత లక్ష్యాన్ని 46 ఓవర్లలో 237గా నిర్దేశిస్తారు.

బౌలర్లు భేష్‌

గప్టిల్‌, నికోల్స్‌, విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌ వంటి బ్యాట్స్‌మెన్‌తో కూడిన లైనప్‌ ఉన్న న్యూజిలాండ్‌ 29 ఓవర్లకు గానీ 100 పరుగులు చేయలేకపోయిందంటే.. అందులో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం కన్నా భారత బౌలర్ల గొప్పతనమే ఎక్కువ కనిపిస్తున్నది. ప్రపంచకప్‌లోనే బెస్ట్‌ బౌలింగ్‌గా గుర్తింపు సాధించిన టీమ్‌ఇండియాపై పరుగులు చేసేందుకు న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఆపసోపాలు పడ్డారు. ఆరంభంలో బుమ్రా, భువీ ఇచ్చిన ఆరంభాన్ని మధ్య ఓవర్లలో జడేజా (1/34), పాండ్యా (1/55) కొనసాగించారు. ముఖ్యంగా జడేజా వికెట్‌ టు వికెట్‌ బంతులతో ఆకట్టుకున్నాడు. 10 ఓవర్లలో అతడు 38 డాట్స్‌ బాల్స్‌ వేయడం విశేషం. మరో ఎండ్‌ నుంచి హార్దిక్‌ పాండ్యా స్లో బౌన్సర్లతో అదరగొట్టాడు. చహల్‌ (1/63) కాస్త ఎక్కువ పరుగులు ఇచ్చినా కీలకమైన విలియమ్సన్‌ వికెట్‌ పడగొట్టడం విశేషం. ఈ టోర్నీలో ఆడిన 4 మ్యాచ్‌ల్లోనే 14 వికెట్ల తీసి అబ్బురపరిచిన షమీ ఈ మ్యాచ్‌లోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

తొలి బంతికే షాక్‌


Bhuvneshwar-Kumar
టాస్‌ ఓడిపోవడం నుంచి కోలుకోక ముందే భారత్‌కు మరో షాక్‌ తగిలింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ తొలి బంతికే గప్టిల్‌ ఎల్బీ కోసం భువనేశ్వర్‌ గట్టిగా అప్పీల్‌ చేశాడు. వికెట్‌ కీపర్‌ ధోనీ సహా సర్కిల్‌లోని మిగిలినవాళ్లంతా ఒక్కసారిగా అరిచినా అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే బంతికి కచ్చితంగా వికెట్లను తాకుతుందని భావించిన భువీ రివ్యూ కోరమని కోహ్లీకి సూచించాడు. కాస్త తటపటాయించిన కెప్టెన్‌ రివ్యూకు వెళ్లాడు. కానీ బంతి లెగ్‌స్టంప్‌ దాటి వెళ్తున్నట్లు రివ్యూలో తేలడంతో.. టీమ్‌ఇండియా మొదటి బంతికే ఉన్న ఒక్క రివ్యూను కోల్పోవాల్సి వచ్చింది. మిగిలిన మ్యాచ్‌ మొత్తం రివ్యూ కోరకుండానే కొనసాగించింది.

అలుపెరగకుండా..


MS-Dhoni
వికెట్‌ కీపర్‌గా ఏకబిగిన 350 వన్డేలు ఆడిన తొలి క్రికెటర్‌గా మహేంద్రసింగ్‌ ధోనీ రికార్డుల్లోకెక్కాడు. ఇందులో ధోనీ 3 మ్యాచ్‌ల్లో ఆసియా ఎలెవన్‌కు ప్రాతినిధ్యం వహించగా.. మిగిలిన 347 టీమ్‌ఇండియా తరఫున ఆడాడు. శ్రీలంక మాజీ కీపర్‌ సంగక్కర 404 వన్డేలు ఆడినా అందులో 44 మ్యాచ్‌ల్లో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా బరిలో దిగాడు. ధోనీ మాత్రం కెరీర్‌ మొత్తం కీపర్‌గానే కనిపించాడు. ఈ క్రమంలో భారత్‌ తరఫున సచిన్‌ టెండూల్కర్‌ (463) తర్వాత ఎక్కువ వన్డేలు ఆడిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా 350 వన్డేలకు పైగా ఆడిన ఆటగాళ్లలో మహీ 10వ స్థానంలో ఉన్నాడు. సచిన్‌ అగ్రస్థానంలో ఉండగా.. జయవర్ధనే (448),జయసూర్య (445), సంగక్కర (404), అఫ్రిది (398), ఇంజమామ్‌ (378), పాంటింగ్‌ (375), అక్రమ్‌ (356), మురళీధరన్‌ (350) ముందున్నారు.

ఒక్కటొచ్చే చోట మూడిచ్చారు..

ఈ మ్యాచ్‌లో భారత్‌ ఫీల్డింగ్‌ స్థాయికి తగ్గట్లు లేదనే చెప్పాలి. కివీస్‌ ఇన్నింగ్స్‌ 38వ ఓవర్‌ సందర్భంగా నీషమ్‌ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అందుకోలేకపోయాడు. మిడ్‌వికెట్‌ ప్రాంతంలో రోహిత్‌ మిడ్‌వికెట్‌ ప్రాతంలో ఫీల్డింగ్‌ చేస్తుండగా.. అతడి ఎడమ వైపు నుంచి వెళ్లిన బంతిని హిట్‌మ్యాన్‌ ఒడిసిపట్టలేకపోయాడు. ఆ తర్వాత 8 పరుగులు మాత్రమే జోడించిన నీషమ్‌ ఔట్‌ కావడంతో భారీ నష్టం జరగలేదు. అంతే కాదు ఈ మ్యాచ్‌లో ఓవర్‌త్రోల రూపంలోనూ మనవాళ్లు ప్రత్యర్థికి అదనపు పరుగులు ఇచ్చుకున్నారు. బ్యాకప్‌ ఉన్నాడా లేడా అని చూసుకోకుండా చహల్‌ త్రో వేస్తే.. దాన్ని అడ్డుకున్న రాహుల్‌ కూడా అదే తప్పు పునరావృతం చేశాడు. దీంతో ఒక్క పరుగు రావాల్సిన చోట మూడు రన్స్‌ వచ్చాయి. తర్వాత కూడా బంతిని ఆపడం, త్రో చేయడంలో చహల్‌ తడబాటు కనబర్చాడు.

‘నో ఫ్లై జోన్‌'గా మాంచెస్టర్‌

ప్రపంచకప్‌లో ఆటేతర అంశాలను చర్చకు రానివ్వకూడదని కంకణం కట్టుకున్న ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)దానికి తగ్గట్లు గట్టి చర్యలు తీసుకుంటున్నది. లీడ్స్‌ వేదికగా జరిగిన భారత్‌, శ్రీలంక మ్యాచ్‌లో గుర్తు తెలియని విమానం ‘జస్టిస్‌ ఫర్‌ కశ్మీర్‌' పేరిట బ్యానర్లు ప్రదర్శిస్తూ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. సెమీఫైనల్లో ఇలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాకూడదని ముందు జాగ్రత్తగా ఈ మ్యాచ్‌ జరుగుతున్న ప్రదేశాన్ని మంగళవారం ‘నో ఫ్లై జోన్‌'గా ప్రకటించినట్లు ఈసీబీ స్పష్టం చేసింది. ఆటగాళ్ల రక్షణ విషయంలో ఉదాసీనతకు తావివ్వకూడదనే విమానాలపై ఆంక్షలు విధించినట్లు పేర్కొంది. ‘గత అనుభవాల దృష్ట్యా ఆటగాళ్ల భద్రత అంశాన్ని నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాం. దానిపై చర్యలు తీసుకున్న ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఓల్డ్‌ట్రఫోర్డ్‌ విమానాశ్రయాన్ని 24 గంటల పాటు ‘నో ఫ్లయింగ్‌ జోన్‌'గా ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రీకి టోర్నీ నిర్వాహకులు సమాచారం అందించారు’అని ఓ అధికారి తెలిపారు. అంతకుముందు పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మ్యాచ్‌ సందర్భంగానూ ఇలాగే ‘జస్టిస్‌ ఫర్‌ బలూచిస్థాన్‌'అనే బ్యానర్లతో విమానం చక్కర్లు కొట్టగా.. ఈ అంశంపై ఆ రెండు దేశాల అభిమానుల మధ్య తీవ్ర వాగ్వాదంతో పాటు ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.
target

ఒక్క సారే..

ఇప్పటి వరకు మూడు సార్లు ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన భారత్‌ ఒక్క సారి మాత్రమే సెమీఫైనల్లో (1983) ఛేజింగ్‌ చేసింది. అది కూడా ఇదే ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలోనే. ఇంగ్లండ్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించి తుదిపోరుకు చేరింది. ఆ తర్వాత రెండు సార్లు ఫైనల్‌ (2003, 2011)కు అర్హత సాధించినా.. ఆ రెండు సార్లు కూడా మొదట బ్యాటింగే చేసింది.

స్కోరు బోర్డు


న్యూజిలాండ్‌: గప్టిల్‌ (సి) కోహ్లీ (బి) బుమ్రా 1, నికోల్స్‌ (బి) జడేజా 28, విలియమ్సన్‌ (సి) జడేజా (బి) చహల్‌ 67, టేలర్‌(నాటౌట్‌) 67, నీషమ్‌ (సి) కార్తీక్‌ (బి) పాండ్యా 12, గ్రాండ్‌హోమ్‌ (సి) ధోనీ (బి) భువనేశ్వర్‌ 16, లాథమ్‌ (నాటౌట్‌) 3, ఎక్స్‌ట్రాలు: 17, మొత్తం: 46.1 ఓవర్లలో 211/5.
వికెట్ల పతనం: 1-1, 2-69, 3-134, 4-162, 5-200, బౌలింగ్‌: భువనేశ్వర్‌ 8.1-1-30-1, బుమ్రా 8-1-25-1, పాండ్యా 10-0-55-1, జడేజా 10-0-34-1, చహల్‌ 10-0-63-1.
runs

4524

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles