ఆటగాళ్లు ఆకట్టుకున్నారు


Thu,September 12, 2019 05:02 AM

భారత ఫుట్‌బాల్ కోచ్ స్టిమాక్
Stimac
దోహా: ఆసియా చాంపియన్ ఖతార్‌పై తమ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నానని టీమ్‌ఇండియా ఫుట్‌బాల్ కోచ్ ఇగొర్ స్టిమాక్ అన్నాడు. ఫిఫా ప్రపంచకప్ రెండో రౌండ్ క్వాలిఫయర్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తమ కన్నా మెరుగైన ర్యాంకులో ఉన్న ఖతార్(62)ను అద్భుతంగా నిలువరించిన భారత్(103) 0-0తో మ్యాచ్‌ను డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. పటిష్ఠమైన జట్టుపై ఆడి ఓ పాయింట్ సాధించడం సంతోషంగానే ఉందని కోచ్ స్టిమాక్ చెప్పాడు. అయితే, కొన్ని విభాగాల్లో ప్లేయర్లు మరింత మెరుగు కావాల్సి ఉందని చెప్పాడు. ఖతార్‌పై ఆడి ఓ పాయింట్ సాధించడం సంతోషంగా ఉంది. ఇంకా కొన్ని విభాగాల్లో మెరుగుకావాల్సి ఉంది. మా ఆటగాళ్లతో పాటు ఖతార్ జట్టుకు అభినందనలు. రెండు జట్ల గోల్ కోర్టుల ముందు మ్యాచ్ ఆసాంతం ఆసక్తి నెలకొంది.

మా ప్లేయర్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా. సాధించింది ఒక్క పాయింటేనని గుర్తుంచుకొని, ఇదే ప్రదర్శనను కొనసాగించాలని చెబుతున్నా అని స్టిమాక్ అన్నాడు. అంతకుముందు మ్యాచ్‌లో ఒమన్‌తో 1-2తో భారత్ ఓడాక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై వ్యక్తమైన అనుమానాలపైనా సమాధానమిచ్చాడు. ప్రతీ కామెంట్‌కు సమాధానం ఇవ్వలేను. చాలా మందికి ఫుట్‌బాల్ గురించి పూర్తిగా తెలియదు. మా జట్టు పూర్తిఫిట్‌గా ఉంది. అది ఈ మ్యాచ్‌తో నిరూపితమైంది అని స్టిమాక్ బదులిచ్చాడు. క్వాలిఫయర్స్‌లో భాగంగా వచ్చే నెల 15న కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు 80వేల మంది ప్రేక్షకులు హాజరై తమ జట్టుకు మద్దతివ్వాలని కోరుకుంటున్నట్టు టీమ్‌ఇండియా కోచ్ స్టిమాక్ చెప్పాడు.

223

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles