తొలి కిక్‌ కేరళదే


Mon,October 21, 2019 04:04 AM

ISL

-అట్టహాసంగా ఐఎస్‌ఎల్‌ ప్రారంభం
-హాజరైన క్రీడా, సినీ తారలు

కొచ్చి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఆరో సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం ఇక్కడి జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌ 2-1తో కోల్‌కతా జట్టు ఏటీకేను ఓడించి, పాయింట్ల ఖాతా తెరిచింది. ఐర్లాండ్‌కు చెందిన ఏటీకే ఆటగాడు కార్ల్‌ మెక్‌హ్యూజ్‌ మ్యాచ్‌ ఆరో నిమిషంలో వచ్చిన ఫ్రీ కిక్‌ను గోల్‌గా మలిచి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. అయితే నైజీరియన్‌ స్ట్రైకర్‌, కేరళ ఆటగాడు బార్తలోమే ఓగ్బెచే 30వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను వాడుకొని స్కోరు సమం చేశాడు. మరోసారి 45వ నిమిషంలో అద్భుమైన షాట్‌తో గోల్‌ సాధించి కేరళను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా తలపడినా గోల్‌ నమోదు కాకపోవడంతో అతిథ్య కేరళ విజయం సాధించింది. అంతకు ముందు ఐఎస్‌ఎల్‌ ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ ఐఎస్‌ఎల్‌ను ప్రారంభించగా... క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, బీసీసీఐకి కాబోయే అధ్యక్షుడు, ఏటీకే జట్టు సహ యజమాని సౌరవ్‌ గంగూలీ, మెగాస్టార్‌ చిరంజీవి, బాలీవుడ్‌ హీరోలు అభిషేక్‌ బచ్చన్‌, జాన్‌ అబ్రహాం తదితరులు హాజరయ్యారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఇండియన్‌ డ్యాన్స్‌ గ్రూప్‌తో కలిసి బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌, హీరోయిన్‌ దిశా పటానీ చేసిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సోమవారం బెంగళూరు ఎఫ్‌సీ, నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ మధ్య మ్యాచ్‌ జరుగనుంది.

454

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles