టాప్ సునాయాసంగా..


Tue,January 15, 2019 04:36 AM

-రెండో రౌండ్‌లో నాదల్, ఫెదరర్
-షరపోవా, కెర్బర్ ముందంజ
-ఆస్ట్రేలియన్ ఓపెన్
ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజు దాదాపు సీడెడ్ ఆటగాళ్లంతా సునాయాస విజయాలతో రెండో రౌండ్ చేరగా.. మహిళల విభాగంలో సోమవారం షరపోవా, కెర్బర్, వోజ్నియాకి అదగొట్టారు. ఆఖరి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్న బ్రిటన్‌స్టార్ ఆండీముర్రే తొలిరౌండ్‌లోనే వెనుదిరిగాడు. దీంతో ట్రోఫీ సాధించాలన్న చిరకాల కోరిక తీరకుండానే ముర్రే మెల్‌బోర్న్‌కు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. ఏడో టైటిల్ విజయంపై ఫెదరర్, జొకోవిచ్ దృష్టి పెట్టగా.. ఈసారి గ్రాండ్‌స్లామ్ విజేతగా సెరెనా విలియమ్స్ నిలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ సాధించిన ఆల్‌టైమ్ టెన్నిస్ గ్రేట్ మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేయనుంది.. దీంతో అందరి దృష్టి ఆస్ట్రేలియన్ ఓపెన్‌పై పడింది..
Rafael-Nadal
మెల్‌బోర్న్: సంచలనాలు ఏవీ నమోదు కాకుండా ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలిరోజు ప్రశాంతంగా సాగింది. పురుషుల సింగిల్స్‌తోపాటు మహిళల సింగిల్స్‌లోనూ సీడెడ్ ఆటగాళ్లు తొలిరౌండ్ అడ్డంకిని సునాయాసంగా అధిగమించారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, స్విస్‌స్టార్ రోజర్ ఫెదరర్‌తో పాటు మాజీ చాంపియన్ , స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ వరుససెట్లలో విజయంతో రెండోరౌండ్‌కు దూసుకెళ్లారు. కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నా కెవిన్ అండర్సన్ నాలుగుసెట్ల పోరాటంలో గట్టెక్కి తొలిరౌండ్ దాటాడు. అటు మహిళల సింగిల్స్‌లో వెటరన్ రష్యా చిన్నది మరియా షరపోవా, జర్మనీ టెన్నిస్ ప్లేయర్ ఏంజిలికా కెర్బర్, డెన్మార్క్ స్టార్ కరోలినా వోజ్నియాకి, అమెరికా టెన్నిస్ నయాతార స్లొయేన్ స్టీఫెన్స్ సాఫీగా రెండోరౌండ్ చేరుకున్నారు.

Roger-Federer

ఎదురులేని ఫెదరర్, నాదల్

వయసు పెరిగినా వన్నె తరగని ఆటతీరుతో ఫెదరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలిరౌండ్‌లో అదరగొట్టాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగుపెట్టిన స్విస్ యోధుడు తొలిరౌండ్‌లో 6-3,6-4,6-4స్కోరుతో ఉబ్జెకిస్థాన్‌కు చెందిన డెన్నిస్ ఇస్టోమిన్‌ను వరుససెట్లలో చిత్తుగా ఓడించాడు. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ ఎంచుకున్న కొన్ని టోర్నీల్లోనే పాల్గొంటున్న ఫెదరర్ ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తిరుగులేని ఆటతీరుతో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. అన్నీ సవ్యంగా సాగితే ఫెదరర్..సెమీస్‌లో నాదల్‌తో తలపడాల్సి రావొచ్చు.. మరోవైపు గాయంతో టెన్నిస్‌కు దూరమైన రఫెల్ నాదల్ (2వసీడ్)ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలిరౌండ్‌లో తనదైన మార్క్ చూపించాడు. వైల్డ్‌కార్డ్ ద్వారా మెయిన్‌డ్రాలో ప్రవేశించిన జేమ్స్ డక్‌వోర్త్‌పై 6-4,6-3,7-5 స్కోరుతో విజయం సాధించి తదుపరి రౌండ్ చేరుకున్నాడు.

Maria-Sharapova
గాయంతో కోలుకుని బరిలోకి దిగి ప్రత్యర్థి దూకుడును అడ్డుకోవడం అంత సులువుకాదు. నాకు మాత్రం మైదానంలో అంతా బాగుందనిపించింది అని విజయానంతరం నాదల్ అన్నాడు. గతేడాది వింబుల్డన్ రన్నరప్ 5వసీడ్ యువ కెవిన్ అండర్సన్ 6-3,5-7,6-2,6-1 స్కోరుతో గట్టి పోటీ ఎదురైనా అడ్రియన్ మన్నారినోను ఓడించి తదుపరి రౌండ్ చేరుకున్నాడు. ఇతర తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో మారిన్ సిలిచ్ 6-2,6-4,7-6(7-3) స్కోరుతో టామిక్‌పై, థామస్ బెర్డిచ్ 6-3,6-0,7-5 స్కోరుతో ఎడ్వర్డ్‌పై , రష్యా ఆటగాడు దిమిత్రోవ్ 4-6,6-3,6-1,6-4 స్కోరుతో తిప్సెర్విక్‌పై, ఫ్రాన్స్ ప్లేయర్ గేల్ మోన్‌ఫిల్స్ 6-0,6-4,6-0 స్కోరుతో జుముర్‌పై, స్పెయిన్ వెటరన్ ఆటగాడు ఫెర్నాండో వెర్దాస్కో 7-6(7-5), 6-3,6-3 స్కోరుతో కెక్ మానోవిచ్‌పై విజయం సాధించి రెండో రౌండ్ చేరుకున్నాడు.

kerber

షరపోవా, కెర్బర్ శుభారంభం

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రష్యా అందం మరియా షరపోవా, జర్మనీ స్టార్ ఏంజిలికా కెర్బర్ తొలిరౌండ్‌లో విజయాలతో ముందంజ వేశారు. నిషేధిత మెల్డోనియం డ్రగ్ వాడి నిషేధం వేటుతో మునుపటిలో టెన్నిస్‌లో మెరువలేకపోతున్న రష్యాస్టార్ సోమవారం జరిగిన తొలిరౌండ్‌లో మాత్రం అలనాటి షరపోవాను తలపించింది. 6-0,6-0 తేడాతో బ్రిటన్ అమ్మాయి హారియట్ డార్ట్‌ను చిత్తుగా ఓడించి రెండోరౌండ్ చేరింది. ఇప్పటికీ కాలిగాయం నొప్పిని భరిస్తూనే ఆడుతున్నా. తొలిరౌండ్ మ్యాచ్‌లోనూ కాలు, నా భుజం నన్ను పరీక్షకు గురిచేశాయి అని మ్యాచ్ ముగిసిన అనంతరం షరపోవా వ్యాఖ్యానించింది. స్లొవేనియా పోలోనాతో జరిగిన తొలిరౌండ్ మ్యాచ్‌లో 6-2,6-2 స్కోరుతో కెర్బర్ విజయంతో ముందంజ వేసింది. 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లొయేన్ స్టీఫెన్స్ 6-4,6-2 స్కోరుతో టౌన్‌సెండ్‌పై, చెక్ భామ కరోలినా వోజ్నియాకి 6-3,6-4 స్కోరుతో వాన్‌వుయ్ త్వాంక్‌ను ఓడించి రెండోరౌండ్ చేరుకున్నారు.

Andy-Murray

ముర్రే ఔట్

వచ్చే వింబుల్డన్ ఆడి టెన్నిస్‌కు గుడ్‌బై చెబుతానని ప్రకటించిన బ్రిటన్ స్టార్ ఆండీముర్రే ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలిరౌండ్‌లోనే పరాజయం పాలయ్యాడు. తుంటిగాయం నొప్పితో కెరీర్ కొనసాగించలేనని చెప్పిన ముర్రే ఇదే ఆఖరు ఆస్ట్రేలియన్ ఓపెన్ అని చెప్పిన విషయం తెలిసిందే. స్పెయిన్‌కు చెందిన రాబెర్టో బటిస్టాతో 5 సెట్లపాటు హోరాహోరీగా సాగిన తొలిరౌండ్ పోరులో 6-4, 6-4, 6-7 (5/7), 6-7 (4/7), 6-2 స్కోరుతో ముర్రే పరాజయం పాలయ్యాడు. తొలి రెండుసెట్లు ఓడినా..వరుసగా సెట్లను ట్రైబ్రేకర్‌లో చేజిక్కించుకుని మ్యాచ్‌ను ఐదో సెట్‌కు మళ్లించాడు. ఒకవైపు తుంటిగాయంతో బాధపడుతూనే చివరి సెట్ ఆడాడు. అప్పటికే పూర్తిగా అలిసిన ముర్రే చివరిసెట్‌లో బటిస్టా ధాటికి నిలవలేకపోయాడు.ఏండ్లుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతూ ఎంతో ఆనందించాను. మ్యాచ్‌లో గెలిచేందుకు ఎంతో శ్రమించినా అది సరిపోలేదు అని ముర్రే భావోద్వేగంతో అన్నాడు. వింబుల్డన్ ఆడేందుకు నేను ప్రయత్నిస్తున్నా. అందుకు ఒకటే మార్గం. తుంటి గాయానికి ఆపరేషన్ చేయించడం. ఇది చాలా పెద్ద ఆపరేషన్. విజయవంతం అవుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం గాయంతో సరిగా నడువడం కూడా కష్టంగా ఉంది. వచ్చే వారంలో ఆపరేషన్‌పై నిర్ణయం తీసుకుంటా అని ముర్రే అన్నాడు.

440

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles