సుప్తచేతనావస్థలో మహా అసెంబ్లీ!

Sun,November 10, 2019 01:24 AM

-గవర్నర్ సమావేశపరిచేంతవరకు అంతే..
-13వ అసెంబ్లీ గడువు శనివారం అర్ధరాత్రితో ముగింపు

ముంబై, నవంబర్ 9: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్న నేపథ్యంలో, కొత్తగా ఎన్నికైన 14వ అసెంబ్లీ సుప్తచేతనావస్థకు (సస్పెండెడ్ యానిమేషన్) చేరింది. అసెంబ్లీని గవర్నర్ సమావేశపరిచేంతవరకు అది అలానే కొనసాగనున్నదని అసెంబ్లీ వ్యవహారాల నిపుణుడు ఒకరు శనివారం తెలిపారు. 13వ అసెంబ్లీ పదవీకాలం శనివారం అర్ధరాత్రితో ముగియనున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడలేదు. ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేండ్లు పంచుకోవాల్సిందేనంటూ శివసేన పట్టుబడుతుండగా, అందుకు బీజేపీ అంగీకరించడం లేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆయన రాజీనామాను ఆమోదించారు.

తదుపరి ప్రభుత్వం ఏర్పడేంతవరకు ఫడ్నవీస్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. గవర్నర్ సమావేశపరిచేంతవరకు 14వ అసెంబ్లీ సుప్త చేతనావస్థలోనే ఉండనుందని మహారాష్ట్ర అసెంబ్లీ మాజీ ప్రధాన కార్యదర్శి అనంత్ కల్సే శనివారం తెలిపారు. సుప్తచేతనావస్థకు సంబంధించి నిర్దిష్ట గడువు అంటూ ఏమీ లేదని చెప్పారు. అసెంబ్లీ తొలి సమావేశానికి గవర్నర్ ఆదేశించేంతవరకు అది అలానే కొనసాగుతుందని చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ వ్యవధిలో జీతభత్యాలు, ఇతర సదుపాయాలు అందుతాయని అనంత్ తెలిపారు. మరోవైపు అయోధ్య తీర్పు నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాధానాన్ని దాటవేశారు. అది (ప్రభుత్వ ఏర్పాటు) జరుగుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు సంతోషకరమైన దినం అని పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు.

148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles