జల వివాదాలకు ఒకే ట్రిబ్యునల్


Thu,July 11, 2019 02:40 AM

Union Cabinet approves Transgender Rights Bill

-రెండేండ్లలో వివాదాలను పరిష్కరించేలా గడువు
-చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడితే మరణశిక్ష
-పోక్సో చట్టం మరింత పటిష్ఠం.. అనియంత్రిత డిపాజిట్ స్కీములపై నిషేధం
-ట్రాన్స్‌జెండర్ బిల్లుకు ఆమోదముద్ర.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు

న్యూఢిల్లీ, జూలై 10: అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల సత్వర పరిష్కారానికి ప్రస్తుత 9 ట్రిబ్యునళ్లను విలీనం చేసి ఒకే శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. కొత్త ట్రిబ్యునల్‌తోపాటు, అవసరమైన సమయాల్లో వివాదాలపై విచారణకు బెంచ్‌లను ఏర్పాటుచేసేలా అంతర్రాష్ట్ర నదీజలాల చట్టం-1956లో సవరణలు చేయాలని ప్రతిపాదించింది. ట్రిబ్యునల్ మాదిరి కాక, ఈ బెంచ్‌లు వివాదాలు పరిష్కారమైన తర్వాత రద్దు కానున్నాయి. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నదీ జలాల విషయమై 9 ట్రిబ్యునళ్లు ఉన్నాయని, వివాదాల పరిష్కారానికి వీటికి 17-27 ఏండ్లు పడుతున్నదన్నారు. రెండేండ్లలో తుది తీర్పు వెలువరించేలా కొత్త ట్రిబ్యునల్‌కు గడువు విధిస్తామన్నారు. ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించగానే ఆటోమేటిక్‌గా దాన్ని నోటిఫై చేసేలా ప్రతిపాదనలు పొందుపరిచినట్లు సమాచారం.

ఒకే గొడుగు కిందకు 13 కార్మిక చట్టాలు

13 కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి, ఒకే కోడ్‌గా మార్చడానికి రూపొందించిన బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. వాణిజ్యం, వ్యాపారం, తయారీ, ఐటీ తదితర రంగాల్లో పది లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులున్న అన్ని సంస్థలకూ ఈ కోడ్ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. వృత్తిపర భద్రత, ఆరోగ్యం, వర్కింగ్ కండీషన్స్ బిల్లు-2019 ద్వారా కార్మికులకు కవరేజీ పలు రకాలుగా మెరుగవుతుందని ప్రభుత్వం తెలిపింది.అనియంత్రిత డిపాజిట్ పథకాలపై నిషేధ బిల్లును క్యాబినెట్ ఆమోదించింది.

ఇతర క్యాబినెట్ నిర్ణయాలు

- ట్రాన్స్‌జెండర్స్ పరిరక్షణ బిల్లు-2019ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ సమావే శాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఇంకా ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) సర్వీసులకు గ్రూప్ ఏ హోదా కల్పించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన ఫేజ్-3ని ప్రారంభించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

పిల్లలపై లైంగిక నేరాలకు మరణశిక్ష

చిన్నారులపై తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు పోక్సో (పొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టాన్ని పటిష్ఠం చేస్తూ పలు సవరణలను ఆమోదించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ కట్టడికి జరిమానాలు, జైలు శిక్షలు విధించేలా పోక్సో చట్టం-2012 లోని పలు సెక్షన్లకు సవరణలు చేశామన్నది. చిన్నారులపై తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడితే మరణశిక్ష సహా కఠిన శిక్షలు విధించేలా 4,5,6 సెక్షన్లలో సవరణలు చేశామన్నది. ప్రకృతి విపత్తుల వేళ హార్మోన్లు/ రసాయనాలతో చిన్నారులకు త్వరగా సెక్సువల్ మెచ్యూరిటీ వచ్చేలా చేసే నేరాల నియంత్రణకు సెక్షన్ 9... చైల్డ్ పోర్నోగ్రఫీ సామగ్రి ధ్వంసం/డిలీట్ చేయకుండా, రిపోర్ట్ చేయకుండా ఉంటే జరిమానాలు/ జైలు శిక్షలకు 14,15 సెక్షన్లను సవరించామన్నది.

686
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles