మూడుముక్కలాట!

Sun,November 10, 2019 01:15 AM

- అలహాబాద్‌ హైకోర్టు ‘సయోధ్య’ మార్గం
- వివాదాస్పద స్థలాన్ని సమానంగా పంచుతూ నాడు తీర్పు

న్యూఢిల్లీ: దశాబ్దాలుగా రగులుతున్న అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడింది. ఏండ్ల తరబడి ఈ వివాదం న్యాయస్థానాల్లో నలుగుతూ వచ్చింది. దీని చుట్టూ ఎన్నో కేసులు.. మరెన్నో రాజకీయాలు. ఈ వివాదంపై 2010 సెప్టెంబర్‌ 30న అలహాబాద్‌ హైకోర్టు వెలువరించిన తీర్పు ఎంతో ముఖ్యమైనది. జస్టిస్‌ ఎస్‌యూ ఖాన్‌, జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌, జస్టిస్‌ ధరమ్‌వీర్‌ శర్మ 2:1 మెజార్టీతో తీర్పును వెలువరించారు. వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థలాన్ని మూడు సమభాగాలుగా విభజించి.. మూడు ప్రధాన పక్షాలైన సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లాకు సమానంగా పంచాలని కోర్టు నాడు తీర్పునిచ్చింది. వివాదాస్పద స్థలంపై యాజమాన్య హక్కులు ఎవరికీ చెందవని, అందుకు నిర్టిష్ట సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఆ స్థలంపై ముగ్గురికీ ఉమ్మడి హక్కు కల్పిస్తున్నట్లు పేర్కొంది. మసీదు ప్రధాన గుమ్మటం కింద తాత్కాలికంగా రాముడు విగ్రహం ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని రాముడి జన్మస్థలంగానే పరిగణిస్తూ.. దానిని రామ్‌లల్లాకు కోర్టు కేటాయించింది. రామ్‌ ఛబుత్రా, భాండార్‌, సీతా రసోయిని నిర్మోహి అఖాడాకు, మిగిలిన ప్రాంతాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఇవ్వాలని ఆదేశించింది. తీర్పులో భిన్న అభిప్రాయాలు వ్యక్తంచేసినప్పటికీ, తుది తీర్పును మాత్రం ముగ్గురు న్యాయమూర్తులు ఆమోదించారు. జస్టిస్‌ ఖాన్‌.. మిగిలిన ఇద్దరు న్యాయమూర్తులతో విభేదించారు. ‘మసీదు నిర్మించేందుకు అక్కడ ఎలాంటి ఆలయాన్నీ కూల్చలేదు. చాలా కాలంగా పడి ఉన్న ఆలయ శిథిలాల మీద మసీదు నిర్మించారు’ అని జస్టిస్‌ ఖాన్‌ అభిప్రాయపడ్డారు. హిందూ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదును నిర్మించారని జస్టిస్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. జస్టిస్‌ శర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అలహాబాద్‌ కోర్టు తీర్పుపై మూడు పక్షాలూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

చట్టబద్ధంగా చెల్లుబాటు కాబోదు! అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని మూడు పక్షాలకూ సమానంగా పంచుతూ నాడు అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు ‘చట్టబద్ధంగా చెల్లుబాటు కాబోదు’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. స్థల విభజన ఏ ఒక్క పక్షానికీ ప్రయోజనం చేకూర్చదని, శాశ్వత శాంతి స్థాపననూ నెలకొల్పలేదని తెలిపింది. 2010 సెప్టెంబర్‌ 30నాటి తీర్పులో అలహాబాద్‌ హైకోర్టు ‘తనది కాని మార్గాన్ని ఎంచుకున్నదని’, తనముందు ఉన్న వ్యాజ్యాల్లోని అభ్యర్థనల పరిధిని దాటి ఉపశమనాలు కల్పించిందని పేర్కొంది. వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజించాలన్న కోర్టు నిర్ణయ ప్రక్రియలోనూ మరో తీవ్రమైన తప్పిదమున్నదని తెలిపింది. వ్యాజ్యం-3 (నిర్మోహి అఖాడా దాఖలు చేసినది) , వ్యాజ్యం-4కు (సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డ్‌ దాఖలు చేసినది) కాలం చెల్లినట్లు నిర్ధారణకు వచ్చినప్పటికీ, వ్యాజ్యం-5లో (రామ్‌ లల్లా విరాజ్మాన్‌ దాఖలు చేసినది) వ్యాజ్యం-3, వ్యాజ్యం-4లోని కక్షిదారులకు హైకోర్టు ఉపశమనం కల్పించిందని, ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధమని సుప్రీంకోర్టు తెలిపింది. సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్లకు కాలంచెల్లినా, హైకోర్టు ఆ హిందూ, ముస్లిం పక్షాలకు వివాదాస్పద స్థలంపై ఉమ్మడి హక్కు కల్పించినట్లు పేర్కొంది. అయోధ్యలోని రాముడి జన్మస్థలంలో రాముడికి తాము ముందు నుంచీ పూజలు చేస్తున్నామని, వివాదాస్పద స్థలాన్ని మొత్తం తమకే కేటాయించాలన్న నిర్మోహి అఖాడా వాదనను కోర్టు కొట్టివేసింది. పూజారులైనంత మాత్రాన స్థలంపై హక్కు లభించదని స్పష్టంచేసింది.

101
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles