సుప్రీంకోర్టుకు కర్ణాటకం

Thu,July 11, 2019 02:49 AM

-తమ రాజీనామాలను ఆమోదించేలా
-స్పీకర్‌ను ఆదేశించాలని కోరిన రెబల్ ఎమ్మెల్యేలు
-సంకీర్ణ సర్కార్‌కు మరో షాక్.. రాజీనామా చేసిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు
-ముంబైలో రెబల్స్‌ను బుజ్జగించేందుకు మంత్రి శివకుమార్ విఫలయత్నం
-సీఎం కుమారస్వామి రాజీనామా కోరుతూ అసెంబ్లీ ఎదుట బీజేపీ ఆందోళన
-వారి పిటిషన్‌పై నేడు నిర్ణయించనున్న అత్యున్నత న్యాయస్థానం
-రాజీనామా చేసిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు
-హోటల్‌లోని ఎమ్మెల్యేలను కలువకుండా అడ్డుకున్న పోలీసులు
-పరిస్థితి ఎమర్జెన్సీని మించిపోయిందన్న మాజీ ప్రధాని దేవెగౌడ

న్యూఢిల్లీ, జూలై 10: కర్ణాటక రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసిన పది మంది జేడీఎస్, కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు బుధవారం సుప్రీంకోర్టు మెట్లెక్కారు. అసెంబ్లీ స్పీకర్ తమ రాజీనామాలను ఉద్దేశపూర్వకంగా ఆమోదించడం లేదని ఆరోపించారు. వీరి పిటిషన్‌ను స్వీకరించిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం, దానిపై అత్యవసర విచారణ జరుపాల్సిన అవసరముందో లేదో గురువారం నిర్ణయిస్తామని తెలిపింది. రెబల్ ఎమ్మెల్యేల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ, ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ సభ్యత్వాలకు రాజీనామా చేసి తాజా ఎన్నికలను కోరుతున్నారని చెప్పారు. స్పీకర్ పక్షపాత ధోరణితో, దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారన్నారు. మైనారిటీలో పడ్డ ప్రభుత్వాన్ని స్పీకర్ కాపాడుతున్నారని రెబల్స్ ఆరోపించారు. వీరి వాదన విన్న ధర్మాసనం పరిశీలిస్తాం అని అభయమిచ్చింది. తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ను ఆదేశించాలని ఎమ్మెల్యేలు కోరారు. తమపై అనర్హత వేటు వేయకుండా కూడా స్పీకర్‌ను నిరోధించాలని విజ్ఞప్తి చేశారు.

ముంబైలో హైడ్రామా

కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం మేరకు అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ముంబైకి వచ్చిన ఆ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ తన ప్రయత్నాలలో విఫలమయ్యారు. పది మంది రెబల్ ఎమ్మెల్యేలు మకాం వేసిన హోటల్ ముందు శివకుమార్, ముంబై కాంగ్రెస్ నేతలు మిలింద్ దేవరా, సంజయ్ నిరుపమ్, జేడీఎస్ నేతలు జీటీ దేవెగౌడ, శివలింగ గౌడ, సీఎన్ బాలకృష్ణన్ తదితరులు దాదాపు ఐదు గంటల పాటు బైఠాయించారు. భారీగా వర్షం కురుస్తున్నా.. వారు కదలలేదు. రెబల్ ఎమ్మెల్యేలతో మాట్లాడే వరకు తాము ఇక్కడి నుంచి కదలబోమని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో విధించిన నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని పోలీసులు వారిని అరెస్టు చేసి, అక్కడి నుంచి తరలించారు. అంతకుముందు, శివకుమార్ ముంబై వస్తున్న విషయం తెలియగానే 8 మంది రెబల్ ఎమ్మెల్యేలు ముంబై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదుచేశారు. శివకుమార్ నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. తమ రాష్ట్ర నాయకులు తాము బస చేస్తున్న హోటల్‌పై దాడి చేసే అవకాశం ఉందని ఆరోపించారు. శివకుమార్‌ను, శివలింగ గౌడను కలుసుకోవడం తమకు ఇష్టం లేదని, అందువల్ల వారిని హోటల్ లోపలికి అనుమతించవద్దని కమిషనర్‌ను కోరారు. దీంతో పోలీసులు ఆ హోటల్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించారు. హోటల్‌లో శివకుమార్ చేసుకున్న గది బుకింగ్‌ను రద్దు చేశారు.

రెబల్ నేతలు, బీజేపీ కార్యకర్తలు శివకుమార్‌కు వ్యతిరేకంగా గో బ్యాక్ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం తనపైకి పోలీసులను పంపడం సిగ్గుచేటన్నారు. నా స్నేహితులను కలువకుండా నేను వెళ్లను.. వారు నన్ను పిలుస్తారు. వారి హృదయం కరుగుతుంది. ఇప్పటికే వారితో టచ్‌లో ఉన్నా. రాజకీయాల్లో మేము కలిసి పుట్టాం. కలిసే చచ్చిపోతాం అన్నారు. హోటల్ యాజమాన్యం తన గది బుకింగ్ రద్దు చేయడంపై స్పందిస్తూ నా వంటి కస్టమర్ వచ్చినందుకు వారు గర్వపడాలి. ముంబై అంటే నాకు ఇష్టం.

ఈ హోటల్ అన్నా కూడా ఇష్టమే. నాకు వేరే హోటల్‌లో వేరే గదులు దొరుకుతాయి అన్నారు. విమానాశ్రయం నుంచి రెబల్ ఎమ్మెల్యేలు బసచేసిన హోటల్‌కు నేరుగా చేరుకున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. వారు (రెబల్స్) మిమ్మల్ని చూసి భయపడుతున్నందున హోటల్ లోపలికి వెళ్లేందుకు అనుమతించలేం అని చెప్పారు. రెబల్ కాంగ్రెస్ నేత ఎస్టీ సోమశేఖర్ హోటల్ లోపల మీడియాతో మాట్లాడుతూ, శివకుమార్‌ను అవమానించాలన్న ఉద్దేశం తనకు, తన సహచరులకు లేద న్నారు. శివకుమార్‌పై మాకు విశ్వాసం ఉంది. కానీ మేం ఈ నిర్ణయం తీసుకోవడానికో కారణం ఉంది. స్నేహం, ప్రేమ, ఆప్యాయత ఓవైపు ఉన్నాయి. ఆయనను మేం ఎందుకు కలువలేకపోతున్నామో దయచేసి అర్థం చేసుకోవాలి అని వేడుకున్నారు. మరో అసమ్మతి నేత రమేశ్ జార్కిహోళి మాట్లాడుతూ, శివకుమార్‌ను కలువడం మాకిష్టం లేదు. బీజేపీ వా రూ ఎవరూ మమ్మల్ని కలవడం లేదు అన్నా రు. హోటల్‌లోని రెబల్ ఎమ్మెల్యేలను ముంబై పోలీసులు బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని పోలీస్ గెస్ట్‌హౌస్‌కు తరలించినట్టు తెలిసింది.

ఎమర్జెన్సీని మించిపోయింది: దేవెగౌడ

కర్ణాటకకు చెందిన ఓ మంత్రి (శివకుమార్)ను ముంబైలో ఓ హోటల్‌లోకి అనుమతించకపోవడంపై జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మండిపడ్డారు. ఈ పరిస్థితి ఎమర్జెన్సీ కన్నా అధ్వానంగా ఉంది అని అన్నారు. తన 60 ఏండ్ల ప్రజా జీవితంలో ఇటువంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజకీయ పార్టీలన్నీ తమ విభేదాలకతీతంగా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ, కాంగ్రెస్, జేడీఎస్ కార్యకర్తలు రాజ్‌భవన్‌కు ప్రదర్శన నిర్వహించడానికి ముందు వారినుద్దేశించి దేవెగౌడ మాట్లాడారు.

మరో ఇద్దరు ఔట్


MLA-K-Sudhakar
ఇప్పటికే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ పతనాన్ని ఖాయం చేస్తూ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. గృహ వసతి శాఖ మంత్రి ఎంటీబీ నాగరాజ్, ఎమ్మెల్యే కే సుధాకర్ విధాన సౌధలో స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను అందజేశారు. దీంతో రెబల్స్ సంఖ్య 16కు పెరిగింది. 224 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వానికి ప్రస్తుతం 116 మంది సభ్యుల మద్దతు ఉంది. ఒకవేళ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే ప్రభుత్వానికి మద్దతునిచ్చే వారి సంఖ్య 100కు చేరి సర్కార్ మైనారిటీలో పడిపోతుంది. ప్రతిపక్ష బీజేపీకి 107 మంది సభ్యులున్నారు. కాగా రాజీనామా చేసిన ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యులు బీజేపీకి మద్దతునిస్తున్నట్టు తెలిపారు.

922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles