‘ఆరే’లో చెట్లు నరకొద్దు

Tue,October 8, 2019 02:30 AM

- యథాతథ స్థితిని కొనసాగించండి
- మహారాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
- అవసరమైన చెట్లను ఇప్పటికే నరికేశామన్న ప్రభుత్వం
- 21న తదుపరి విచారణ

న్యూఢిల్లీ/ ముంబై: మెట్రో కార్‌ షెడ్‌ నిర్మాణం కోసం ముంబైలోని ఆరే కాలనీలో చెట్ల నరికివేత విషయంలో పర్యావరణ ప్రేమికులకు అత్యున్నత న్యాయస్థానం ఊరటనిచ్చింది. ఇకపై ఆ ప్రాంతంలో చెట్లు నరకడానికి వీల్లేదంటూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సోమవారం ఆదేశించింది. తదుపరి విచారణ చేపట్టబోయే అక్టోబర్‌ 21వ తేదీ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. అయితే మెట్రో కార్‌ షెడ్‌ నిర్మాణానికి అవసరమైన చెట్లను ఇప్పటికే నరికివేసినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. ఆరే కాలనీలో చెట్ల నరికివేతపై స్టే ఇవ్వాలని కోరుతూ న్యాయ విద్యార్థి రిశవ్‌ రంజన్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌కి లేఖ రాశారు. దీన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. విచారణకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటుచేసింది. సోమవారం ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఆ ధర్మాసనం పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 4న ఆరే కాలనీని అటవీ ప్రాంతంగా గుర్తించడానికి నిరాకరించిన బాంబే హైకోర్టు.. మెట్రో కార్‌ షెడ్‌ నిర్మాణం కోసం గ్రీన్‌ జోన్‌లోని 2,600 చెట్లను నరికివేసేందుకు ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనుమతి ఇవ్వడాన్ని రద్దు చేసేందుకు కూడా నిరాకరించింది. దీంతో శుక్రవారం రాత్రి ముంబై మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది చెట్ల నరికివేతకు సిద్ధం కావడంతో దుమారం రేగింది. చెట్లను నరకొద్దంటూ పర్యావరణ కార్యకర్తలు, స్థానిక కాలనీవాసులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో 29 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో సోమవారం వారు విడుదలయ్యారు.
Supreme-Court1

ఆరే అటవీ ప్రాంతమా? కాదా?

మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పురపాలక సంస్థ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్త్తూ.. కార్‌ షెడ్‌ నిర్మాణానికి అవసరమైన 2,141 చెట్లను ఇప్పటికే నరికేశామని, ఇకపై నరకబోమని తెలిపారు. ‘దీనిపై మేం నిర్ణయం తీసుకుంటాం. ఇకపై చెట్లను నరకొద్దు. తదుపరి విచారణ చేపట్టే 21వ తేదీ వరకు యథాతథ స్థితిని కొనసాగించండి’ అని ధర్మాసనం ఆదేశించింది. ఆరే కాలనీ అటవీ ప్రాంతమా కాదా అన్నదానిపై తాము విచారణ జరుపుతామని, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ల వివరాలను తమ ముందు ఉంచాలని అధికారులను ఆదేశించింది.

విపక్షాలు, పర్యావరణవేత్తల హర్షం

సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్సీపీ నేత సుప్రియా సూలే స్వాగతించారు. అయితే కార్‌షెడ్‌కు అవసరమైన చెట్లను ఇప్పటికే నరికివేయడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు పర్యావరణ వేత్తలకు నైతిక విజయమని శివసేన వ్యాఖ్యానించింది. సుప్రీం తీర్పుపై స్పందించేందుకు కేంద్ర పర్యావరణ శాఖ మత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ నిరాకరించారు. కోర్టు పరిధిలోని అంశంపై తాను స్పందించదలచుకోలేదని చెప్పారు. అయితే దేశంలో గత నాలుగేండ్లలో 15000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం పెరిగిందని పేర్కొన్నారు.

2,141 చెట్లను తొలిగించాం

మెట్రో కార్‌ షెడ్‌ నిర్మాణం కోసం ఆరే కాలనీలో ఇప్పటికే 2,141 చెట్లను నరికివేశామని ముంబై మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువరించేవరకు అక్కడ ఇకపై చెట్లను తొలిగించబోమని పేర్కొంది. చెట్లను తొలిగించిన ప్రాంతంలో నిర్మాణ పనులను మొదలుపెడుతామని వివరించింది.

211
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles