రాముడి నీడన ఎదిగిన బీజేపీ!

Sun,November 10, 2019 01:44 AM

- రామజన్మభూమి ఉద్యమంతో ప్రబల రాజకీయ శక్తిగా ఎదుగుదల
- బీజేపీకి ఊపిరులూదిన అద్వానీ రథయాత్ర
- అన్ని ఎన్నికల్లో రామనామాన్నే జపించిన కమలనాథులు

న్యూఢిల్లీ, నవంబర్‌ 9: సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పు రామజన్మభూమి ఉద్యమాన్ని గుర్తుచేస్తున్నది. ఈ ఉద్యమానికి ప్రధాన సారథి బీజేపీ కురువృద్ధుడు అద్వానీ. ఆయన చేపట్టిన రథయాత్రతో రామజన్మభూమి ఉద్యమం ఊపందుకున్నది. బీజేపీ 1989లో అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై పాలంపూర్‌లో చేసిన తీర్మానం మేరకు అద్వానీ రథయాత్ర చేపట్టారు. ఈ రథయాత్రపై అనేక వివాదాలు చెలరేగినప్పటికీ బీజేపీకి విశేష ప్రాచుర్యం కల్పించింది. 1990 సెప్టెంబర్‌ 25న గుజరాత్‌లోని సోమనాథ్‌ దేవాలయం నుంచి రథయాత్రను ప్రారంభించిన అద్వానీ.. దేశంలోని పలు రాష్ర్టాలు, ప్రముఖ ప్రాంతాలు, చారిత్రాత్మక స్థలాలను కలుపుకుని పోతూ దాదాపు 10వేల కిలోమీటర్లు ప్రయాణించి అదే ఏడాది అక్టోబర్‌ 30న అయోధ్యలో యాత్రను ముగించారు. రామజన్మభూమి ఉద్యమం పతాకస్థాయికి చేరుకోవడంతో 1992 డిసెంబర్‌ 6వ తేదీన కరసేవకులు అయోధ్యలోని బాబ్రీ మసీదును నేలమట్టం చేశారు.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మత ఘర్షణలు చెలరేగి దాదాపు రెండు వేల మంది చనిపోయారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం వీహెచ్‌పీని బహిష్కరించగా.. అద్వానీ సహా పలువురు బీజేపీ నేతలను అరెస్ట్‌ చేసింది. ఈ ఘటన బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ దాని ఎదుగుదలను మాత్రం అడ్డుకోలేకపోయింది. రామమందిరం, రాముడు నినాదాలుగా ముందుకు సాగిన బీజేపీ.. ఇద్దరు పార్లమెంట్‌ సభ్యులుగా ఉన్న సంఖ్యాబలాన్ని ఐదేండ్లు తిరిగే సరికల్లా 85 స్థానాలను తన ఖాతాలో వేసుకొనే స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత వాజపేయి నేతృత్వంలో రెండుసార్లు, మోదీ నాయకత్వంలో మరో రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

110
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles