కఠిన చట్టాలకు సిద్ధం

Tue,December 3, 2019 03:43 AM

-దోషులకు సత్వరం కఠినశిక్ష పడేలా నిబంధనలు సవరిస్తాం
-లోక్‌సభలోప్రకటించిన రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
-ముక్తకంఠంతో నినదించిన పార్లమెంట్
-శంషాబాద్ దారుణాన్ని ఏకగ్రీవంగా ఖండించిన లోక్‌సభ, రాజ్యసభ
-నిర్ణీత సమయంలోగా శిక్ష అమలయ్యేలా చట్టాలను మార్చాలని సూచన
-మహిళలపై నేరాలు ఓ సామాజిక వ్యాధిగా పరిణమించాయి: వెంకయ్యనాయుడు
-కఠిన చట్టం రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నాం: రాజ్‌నాథ్ సింగ్
-నిందితులను నడిబజార్లో కొట్టి చంపాలి: జయాబచ్చన్

దిశ దారుణ ఘటనను ఏకగ్రీవంగా ఖండించిన పార్లమెంట్

మహిళలపై లైంగికదాడులను నిరోధించడంతోపాటు దోషులకు వేగంగా శిక్షపడేలా కఠినచట్టాలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన దిశ ఉదంతం తనను కలిచివేసిందన్నారు. లైంగికదాడి వంటి అమానవీయ కేసుల్లో దోషులను క్షమాభిక్షకు అనుమతించే విషయంపై పునరాలోచించాలని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు సూచించారు. మహిళలపై నేరాల నిరోధానికి కఠిన చట్టాలు తేవడంతోపాటు ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పులు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. దిశ దారుణ ఉదంతంపై సోమవారం పార్లమెంట్‌లో చర్చ జరిగింది. పశువైద్యురాలిపై జరిగిన పాశవిక లైంగికదాడి, హత్యను లోక్‌సభ, రాజ్యసభ అత్యంత ఆవేదనతో, ముక్తకంఠంతో ఖండించాయి. నిందితులకు ఉరిశిక్ష విధించాలని పార్టీలకతీతంగా సభ్యులందరూ డిమాండ్ చేశారు. దోషులకు 30 రోజుల్లోగా శిక్షపడేలా చట్టాన్ని తీసుకురావాలని రాజ్యసభలో టీఆర్‌ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలో జరిగిన దిశ దారుణ ఉదంతంపై సోమవారం పార్లమెంట్ అట్టుడికింది. పశువైద్యురాలిపై లైంగిక దాడి, హత్యను పార్టీలకతీతంగా ఎంపీలందరూ ముక్తకంఠంతో ఖండించారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని, శిక్షను సత్వరం అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల మహిళలపై లైంగిక నేరాలు పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. దోషులను నడి బజార్లో నిలబెట్టి కొట్టి చంపాలని ఎంపీ జయాబచ్చన్ ఆగ్రహం వ్యక్తంచేయగా.. దోషులకు క్షమాభిక్షకు అనుమతించే విషయంపై పునరాలోచించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సూచించారు. నిందితులకు వేగంగా శిక్షపడేలా చట్టాలను కఠినతరం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు.

నిర్ణీత సమయంలోగా ఉరిశిక్ష అమలు చేయాలి

సోమవారం రాజ్యసభ సమావేశమవగానే ఎంపీలందరూ ముక్తకంఠంతో దిశ ఘటనను ఖండించారు. హైదరాబాద్ ఘటనపై చర్చించాలంటూ సభ్యులు వాయిదా తీర్మానం కోరగా, చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. దిశతోపాటు దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలకు సంబంధించి సభ్యులు తమ అభిప్రాయాలను క్లుప్తంగా చెప్పాలని సూచించారు. నిందితులకు వేగంగా శిక్షపడేలా మరిన్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని, నిర్ణీత సమయంలోగా ఉరిశిక్ష అమలుచేయాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ కుల, మత, ప్రాంతీయతలను దృష్టిలో పెట్టుకోకుండా దోషులను వేగంగా, కఠినంగా శిక్షించాలని సూచించారు. డీఎంకే ఎంపీ పీ విల్సన్ మాట్లాడుతూ లైంగికదాడి కేసుల్లో దోషులను ఆపరేషన్ లేదా రసాయనిక చర్య ద్వారా నపుంసకులుగా మార్చేలా చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. దోషులకు నిర్ణీత సమయంలోగా శిక్షపడాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌సింగ్ సూచించారు. నిందితులకు మతం రంగు పులుమొద్దని కాంగ్రెస్ ఎంపీ అలీఖాన్ కోరారు. దిశ ఘటనలో నిందితులు భిన్న మతాలకు చెందినవారని గుర్తుచేశారు. నిందితులను బహిరంగంగా ఉరితీయాలని టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు.

చట్టాలను పటిష్ఠం చేస్తాం

లోక్‌సభలో జీరో అవర్‌లో దిశ ఘటనపై చర్చ జరిగింది. ఈ ఘటనను సభ ముక్తకంఠంతో ఖండిస్తున్నదని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. యువ వైద్యురాలి దారుణ హత్య ఎంతో బాధ కలిగించిందన్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ దిశ ఘటనపై స్పందించేందుకు తనకు మాటలు రావడం లేదన్నారు. నిర్భయ చట్టం తెచ్చిన తర్వాత కూడా ఇలాంటి దారుణాలు జరుగడం బాధాకరమన్నారు. ఇలాంటి నేరాల్లో దోషులను మరింత కఠినంగా శిక్షించేలా చట్టాలను పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఘటనల్లో నిందితులకు వేగంగా, కఠినంగా శిక్షపడేలా ఐపీసీ, సీఆర్‌పీసీ నిబంధనలను సవరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదన్నారు. ఈ మేరకు రాష్ర్టాలకు, పోలీస్ ఉన్నతాధికారులకు లేఖలు రాశామన్నారు. వివిధ రాజకీయ పార్టీల సలహాలు సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇదో అమానవీయ ఘటన అని పేర్కొన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో వేగంగా విచారణ జరిపి, దోషులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నేరాల్లో దోషులకు అక్కడికక్కడే శిక్ష పడాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. డీఎంకే ఎంపీ టీఆర్ బాలు.. కోయంబత్తూర్‌లో ఇంటర్ విద్యార్థినిపై జరిగిన లైంగికదాడిని ప్రస్తావించారు. ఇలాంటి కేసుల్లో దోషులకు నిర్ణీత సమయంలో శిక్ష పడేలా చట్టం తీసుకురావాలన్నారు.

క్షమాభిక్షపై పునరాలోచించాలి: వెంకయ్య

లైంగికదాడుల నిరోధానికి కఠిన చట్టాలు తేవడంతోపాటు ప్రజల ఆలోచన విధానంలోనూ మార్పులు రావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటనల్లో కోర్టులు నిందితులకు కఠిన శిక్షలు విధిస్తున్నాయి. అయితే వెంటనే ఆ శిక్షను తగ్గించాలంటూ క్షమాభిక్ష పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు శిక్ష విధిస్తున్నా.. పైకోర్టుల్లో అప్పీళ్లకు వెళ్తున్నారు. ఇలా ఏండ్లపాటు విచారణ సాగుతూనే ఉన్నది. కాబట్టి న్యాయ పక్రియలో మార్పులపై ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అని పేర్కొన్నారు. న్యాయ, పోలీస్ వ్యవస్థల్లో ఎక్కడో లోపం ఉన్నదని, ఫలితంగా మహిళలపై నేరాలు ఓ సామాజిక వ్యాధిగా పరిణమించాయని వ్యాఖ్యానించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వ్యక్తుల ఫొటోలను బహిరంగంగా ప్రదర్శించాలని, దీంతో వారు సమాజంలో భయంభయంగా తిరుగాల్సి వస్తుందని, ఇది ఇతరులకు గుణపాఠంగా ఉంటుందని పేర్కొన్నారు.
AIDYO-Delhi1

వాళ్లను కొట్టి చంపాలి

దిశ ఘటనపై సమాజ్‌వాదీ ఎంపీ జయాబచ్చన్ ఉద్వేగంగా మాట్లాడారు. లైంగికదాడుల దోషులను ప్రజల మధ్యకు తీసుకొచ్చి కొట్టిచంపాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. నిర్భయ, కతువా, ఇప్పుడు దిశ.. ఇలాంటి బాధితుల్లో ఎంతమందికి న్యాయం జరిగిందో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి. లైంగికదాడి కేసుల్లో నిందితులను సమాజం ఛీకొట్టేలా.. వారి పేర్లను బహిర్గతం చేయాలి. రేపిస్టులను ప్రజలమధ్యకు ఈడ్చుకొచ్చి నడిరోడ్డుపై కొట్టిచంపాలి అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
AIDYO-Delhi3

దేశవ్యాప్తంగా నిరసనలు

జస్టిస్ ఫర్ దిశ నిరసనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పలువురు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పశ్చిమబెంగాల్‌లో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. హండ్రెడ్స్ ఆఫ్ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో కోల్‌కతాలో భారీ ర్యాలీ జరిగింది. మహిళలకు రక్షణ కల్పించాలంటూ వారు నినాదాలు చేశారు. జాదవ్‌పూర్ వర్సిటీ విద్యార్థులు దిశకు నివాళిగా మానవహారం ఏర్పాటు చేశారు. కోల్‌కతాలోని కాళీఘాట్, బెహలా తదితర ప్రాంతాలకు చెందిన దుర్గ పూజా కమిటీలు తమ ఫేస్‌బుక్ పేజీల్లో హెల్ప్‌లైన్ నంబర్లను పోస్ట్ చేశాయి. మహిళలు అత్యవసర సందర్భాల్లో సహాయం కోసం తమను సంప్రదించాలని కోరాయి. బీహార్, చండీగఢ్, కర్ణాటక తదితర రాష్ర్టాల్లోనూ నిరనసలు చేపట్టారు.

నేటి నుంచి నిరాహారదీక్ష :ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ప్రకటన
దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాలకు నిరసనగా మంగళవారం నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ప్రకటించారు. నిందితులకు ఆరునెలల్లో మరణశిక్ష అమలు చేసేలా చట్టంలో మార్పులు చేసేవరకు దీక్ష విరమించబోనన్నారు. లైంగిక నేరాల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థతోపాటు పోలీస్ స్టేషన్లలో, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో వసతులు పెంచాలని డిమాండ్ చేశారు.

మోదీ, స్మృతి మౌనమేల?: కాంగ్రెస్

న్యూఢిల్లీ: దిశ ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖమంత్రి స్మృతి ఇరానీ ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ విమర్శించింది. వారిద్దరూ వెంటనే స్పందించి, మహిళలపై నేరాల నిరోధానికి అత్యవసర కార్యాచరణ రూపొందించాలని ఆ పార్టీ ఎంపీ అమీ యాజ్ఞిక్ డిమాండ్ చేశారు. మరో ఎంపీ జ్యోతిమణి మాట్లాడుతూ దేశంలో రోజూ 984 లైంగిక దాడి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. నిర్భయ చట్టం తర్వాత కూడా ఇలా ఎందుకు జరుగుతున్నదో తీవ్రంగా ఆలోచించాలన్నారు.
AIDYO-Delhi2

దిశపై పాశవికంగా లైంగికదాడి జరిగింది. నిర్భయకు న్యాయం కోసం ఏడేండ్లుగా పోరాడుతున్నాం. మా బిడ్డలాగా కాకుండా దిశకు సత్వరం న్యాయం జరుగాలి. ఇలాంటి ఘటనలు ఎందుకు పునరావృతమవుతున్నాయో ప్రభుత్వాలు ఆలోచించాలి.
- ఆశాదేవి, నిర్భయ తల్లి

లైంగికదాడి కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసిన వెంటనే ప్రజల మధ్యలో వదిలేసేలా చట్టం తేవాలి. అప్పుడు ప్రజలే సరైన శిక్ష విధిస్తారు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుచేయకుండా ఏడేండ్లుగా జైల్ల్లో కూర్చోబెట్టారు. వారిని అప్పుడే శిక్షించి ఉంటే నేరగాళ్లకు భయం పట్టుకునేది.
- నిర్భయ తాత

979
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles