సుప్రీంకోర్టు చరిత్రలో అరుదైన ఘట్టం

Sun,November 10, 2019 02:07 AM

- తొలిసారి శనివారం రోజు తీర్పు


న్యూఢిల్లీ, నవంబర్‌ 9: సుప్రీంకోర్టు చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారి శనివారం రోజు తీర్పు వెలువడింది. సాధారణంగా సుప్రీంకోర్టు పని దినాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉంటాయి. కొన్ని అరుదైన కేసుల్లో శని, ఆదివారాలతోపాటు సెలవు దినాల్లోనూ న్యాయమూర్తులు కేసుల విచారణ జరిపిన సందర్భాలున్నాయి. అయితే 69 ఏండ్ల సుప్రీంకోర్టు చరిత్రలో ఎప్పుడూ కూడా శనివారం రోజు ఎలాంటి తీర్పు వెలువడలేదని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్‌ గొగోయ్‌ వ్యక్తిగత ప్రధాన కార్యదర్శి హెచ్‌కే జునేజా తెలిపారు. ఏండ్ల నాటి అయోధ్యలోని వివాదాస్పద స్థలం కేసుపై సుప్రీంకోర్టు తొలిసారి శనివారం రోజు చారిత్రక తీర్పు ఇచ్చిందన్నారు. 1992 డిసెంబర్‌ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పటి సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. నాటి సీజేఐ ఎంఎన్‌ వెంకటాచలయ్య ఆ సాయంత్రం తన నివాసంలో ప్రత్యేకంగా విచారణ జరిపారని, 16వ శతాబ్దానికి చెందిన కట్టడాన్ని పరిరక్షించడంలో మాట తప్పిన నాటి యూపీ సీఎం కల్యాణ్‌ సింగ్‌పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారని జునేజా చెప్పారు.

శనివారమే ఎందుకు?

మరోవైపు సుప్రీంకోర్టు అయోధ్యపై శనివారం తీర్పు వెల్లడించడం వెనక పలు కారణాలు కూడా ఉన్నాయి. సీజేఐ రంజన్‌ గొగోయ్‌ నవంబర్‌ 17న పదవీ విరమణ చేయనున్నారు. ఆ రోజు ఆదివారం కావడంతో సుప్రీంకోర్టుకు సెలవు. సాధారణంగా సెలవు రోజుల్లో కీలక కేసులపై ఎలాంటి తీర్పులు ఇవ్వరు. సీజేఐ పదవీ విరమణకు ఒక రోజు ముందు కూడా ఎప్పుడూ తీర్పులు ఇవ్వలేదు. దీంతో అయోధ్యపై తుది తీర్పునకు నవంబర్‌ 16వ తేదీని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఇక నవంబర్‌ 15 సీజేఐగా గొగోయ్‌కు చివరి పని దినం. మరోవైపు కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రతివాదులకు సమీక్ష కోరే అవకాశం కూడా ఇవ్వాలి. సాధారణంగా దీనికి ఒక రోజు లేదు రెండు రోజులు పడుతుంది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 14 లేదా 15న అయోధ్యపై తీర్పు వెలువరించే అవకాశముందని అంతా భావించారు. అనూహ్యంగా శనివారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించాలన్న కీలక నిర్ణయాన్ని శుక్రవారం రాత్రి గొగోయ్‌ తీసుకున్నారు. సంఘ విద్రోహ శక్తులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్న ప్రధాన ఉద్దేశంతోనే ఎవరూ ఊహించని విధంగా శనివారమే తీర్పు ఇచ్చారని కొందరు విశ్లేషిస్తున్నారు.

197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles