కర్తార్‌పూర్ జాతికి అంకితం

Sun,November 10, 2019 03:03 AM

-డేరాబాబా నానక్‌లో కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
-తొలి విడుతలో 500 మందికిపైగా కర్తార్‌పూర్‌కు పయనం
-భారత్ మనోభావాలు గౌరవించినందుకు ఇమ్రాన్‌కు ప్రధాని ధన్యవాదాలు
-భారత్, పాక్ మధ్య సంబంధాలు మెరుగుపడుతాయి: మాజీ ప్రధాని మన్మోహన్

డేరాబాబా నానక్ (గురుదాస్‌పూర్), నవంబర్ 9: సిక్కులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న చారిత్రక కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. అకల్ తక్త్ జతేంధర్ జ్ఞానీ హర్‌ప్రీత్‌సింగ్ నేతృత్వంలోని సుమారు 500 మందికి పైగా కూడిన తొలి యాత్రికుల బృందాన్ని ప్రధాని మోదీ జెండా ఊపి కర్తార్‌పూర్‌కు సాగనంపారు. ఈ యాత్రికుల బృందంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కూడా ఉన్నారు. పంజాబ్‌లోని డేరాబాబా నానక్ గురుద్వారాతో పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను ఈ కారిడార్ అనుసంధానిస్తుంది. నూతనంగా నిర్మించిన 4.5 కి.మీ. ఈ కారిడార్ ద్వారా కర్తార్‌పూర్‌కు వెళ్లేందుకు వీలు కల్పించే ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను (ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్) కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.
Manmohan-Singh1
ఈ నెల 12న సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ 550వ జయంతి నేపథ్యంలో ఈ కారిడార్ ప్రారంభం కావడం విశేషం. తొలి బ్యాచ్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్, సుఖ్‌బీర్‌సింగ్ బాదల్, నవజ్యోత్‌సింగ్ సిద్ధూతోపాటు శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) సభ్యులు, పంజాబ్‌కు చెందిన మొత్తం 117 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. కారిడార్‌ను జాతికి అంకితం చేసేముందు ప్రధాని మోదీ.. పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ భడ్నోర్, సీఎం అమరీందర్‌సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ జాఖర్‌తో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కాషాయ రంగు తలపాగా ధరించిన మోదీ.. గురునానక్ దేవ్ జీవితం, బోధనలకు సంబంధించిన వీడియోను వీక్షించారు. కర్తార్‌పూర్ కారిడార్ నమూనాను కూడా పరిశీలించారు. కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్, ఆయన భార్య గురుశరన్ కౌర్‌లు ప్రధాని మోదీతో కాసేపు ముచ్చటించారు.

భారత్, పాక్ మధ్య సంబంధాలు మెరుగుపడుతాయి: మన్మోహన్

Manmohan-Singh2
కర్తార్‌పూర్, నవంబర్ 9: కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించడం వల్ల భారత్, పాక్ మధ్య సంబంధాలు మెరుగుపడుతాయని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కర్తార్‌పూర్‌కు చేరుకున్న ఆయన మాట్లాడుతూ కారిడార్‌ను ప్రారంభించడం గొప్ప పరిణామం. ఇది భారత్, పాక్ మధ్య సంబంధాలను మెరుగుపర్చడానికి దోహదపడుతుంది అని తెలిపారు.

కౌమీ సేవ అవార్డు.. గురునానక్‌కు అంకితం

కర్తార్‌పూర్ గురుద్వారా కారిడార్ విషయంలో భారత్ మనోభావాలను అర్థం చేసుకున్నందుకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కర్తార్‌పూర్ కారిడార్ విషయంలో ఆయన భారత్ మనోభావాలను అర్థం చేసుకుని, గౌరవించి, సుహృద్భావంతో పనిచేశారు అని ప్రధాని పేర్కొన్నారు. కారిడార్ ప్రారంభోత్సవం అనంతరం డేరాబాబా నానక్ గురుద్వారాకు 8 కి.మీ దూరంలోని బీఎస్‌ఎఫ్ క్యాంప్‌లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు. పాకిస్థాన్‌వైపు కూడా త్వరితగతిన కారిడార్‌ను పూర్తిచేసేందుకు శ్రమించిన పాక్ వర్కర్లకూ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. కారిడార్‌ను జాతికి అంకితం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎస్‌జీపీసీ తనకు బహూకరించిన కౌమీ సేవ అవార్డును గురునానక్ దేవ్‌కు అంకితమిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. గురునానక్ దేవ్ 550వ జయంతికి ముందు కర్తార్‌పూర్ కారిడార్‌ను, ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను ప్రారంభించడం తనకు రెట్టింపు ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. నిర్మాణంలో భాగస్వాములైన పంజాబ్ ప్రభుత్వం, ఎస్‌జీపీసీ, ఇతర కార్మికులకు ధన్యవాదాలు తెలియజేశారు. గురునానక్ దేవ్ కేవలం సిక్కులకు మాత్రమే కాకుండా మానవాళి మొత్తానికి స్ఫూర్తిదాయకమని మోదీ కొనియాడారు.
Manmohan-Singh3

2283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles