పీవోకే మనదే

Wed,September 18, 2019 03:11 AM

-ఏదో ఒక రోజు దానిపై మనకు అధికారం లభిస్తుంది
-పాక్‌తో ఉగ్రవాదంపైనే చర్చలు
-విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్‌లో అంతర్భాగమని, ఏదో రోజు దానిపై భారత్‌కు భౌతికంగా కూడా న్యాయాధికారం లభిస్తుందని విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. మోదీ 2.0 సర్కారులో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి జైశంకర్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఒక పొరుగుదేశం నుంచి మనకు ప్రత్యేక సవాల్ ఎదురవుతున్నది. ఆ దేశం సాధారణ సరిహద్దు దేశంగా మారి, సీమాంతర ఉగ్రవాదంపై చర్యలు చేపట్టేంతవరకు అది మనకు సవాల్‌గానే మిగలనుంది అని పేర్కొన్నారు. సుమారు 75 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో.. కశ్మీర్, విదేశీ సంబంధాలు, అంతర్జాతీయంగా భారత్ స్థాయి తదితర అంశాలపై జైశంకర్ మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు అనేది పాకిస్థాన్‌తో సమస్య కాదు అని, సీమాంతర ఉగ్రవాదమే అసలు సమస్య అని చెప్పారు. ఆ దేశంతో చర్చలు జరుగాలంటే.. మొదట ఉగ్రవాదంపైనే జరుగాలని స్పష్టం చేశారు. పాక్‌తో ఇకపై పీవోకేపైనే చర్చలు సాగుతాయని, కశ్మీర్‌పై కాదని ఇటీవల పలువురు నేతలు వ్యాఖ్యానించడంపై మీడియా ప్రశ్నించగా.. పీవోకేపై మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది.

పీవోకే భారత్‌లో అంతర్భాగం. ఏదో రోజు దానిపై మనకు భౌతికంగానూ న్యాయాధికారం లభిస్తుంది అని పేర్కొన్నారు. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంపై జైశంకర్ స్పందిస్తూ.. ఆర్టికల్ 370ని రద్దు చేసేందుకు భారత్‌కు గల కారణాలను అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకుంటుందని చెప్పారు. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక నిబంధన. వాస్తవానికి ఇది క్రియారహితంగా ఉంది. సంకుచిత స్వభావం కలిగిన కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని దుర్వినియోగం చేశారు. అభివృద్ధిని అడ్డుకుని, వేర్పాటువాదాన్ని పెంచి పోషించారు. ఈ వేర్పాటువాదాన్ని అడ్డుపెట్టుకుని పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్నది అని జైశంకర్ వివరించారు. కశ్మీర్‌పై 1971 నుంచీ కూడా భారత వైఖరి స్పష్టంగానే ఉందని, ఇందులో మార్పు ఉండబోదన్నారు. కశ్మీర్ విషయంలో ప్రజలు చెప్పేదానిపై ఓ స్థాయిని దాటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Ranbir-Singh

వారివి ఒట్టి మాటలే.. చేతల్లేవ్..

ఉగ్రవాదంపై పాకిస్థాన్ కేవలం మాటలకే పరిమితమైందని జైశంకర్ ధ్వజమెత్తారు. సమస్యకు మంచి మాటలే సమాధానమని వారు భావిస్తున్నారు. వారు సృష్టించిన ఉగ్రవాదాన్ని అంతం చేయడమే అసలు సమస్య. ఉగ్రవాదానికి పాల్పడుతున్న పొరుగుదేశంతో చర్చలకు అంగీకరించే దేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే చూపించండి అని ఆయన ప్రశ్నించారు. తొలి వంద రోజుల్లో తన మంత్రిత్వ శాఖ పనితీరుపై జైశంకర్ వివరిస్తూ.. జాతీయ భద్రత, విదేశీ విధాన లక్ష్యాల మధ్య బలమైన బంధాన్ని ఏర్పరచడం ఈ వంద రోజుల్లో ప్రభుత్వం సాధించిన కీలక విజయాల్లో ఒకటని చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై.. అది జీ20 అయినా, వాతావరణ సదస్సులైనా.. ప్రస్తుతం భారత్ గళం గట్టిగా వినబడుతున్నదన్నారు. సీమాంతర ఉగ్రవాదం, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలపై అంతర్జాతీయ సమాజానికి భారత్ తన వాదనను బలంగా వినిపించిందని చెప్పారు.

పురోగమిస్తున్న భారత్, అమెరికా సంబంధాలు

భారత్-అమెరికా మధ్య సంబంధాలు పురోగమన దిశలో సాగుతున్నాయని జై శంకర్ అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా బుష్ ఉన్నా, ఒబామా ఉన్నా, ట్రంప్ ఉన్నా.. ఇరు దేశాల మధ్య సంబంధాలు మాత్రం పురోగమిస్తున్నాయని చెప్పారు. రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సమస్యలు సాధారణమేనన్నారు. ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ ఈ నెల 22న హ్యూస్టన్‌లో మూడోసారి సమావేశం కానున్నారని చెప్పారు. 2014లో న్యూయార్క్‌లో, 2015లో శాన్ జోస్‌లో ప్రధాని ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. హ్యూస్టన్‌లో నిర్వహించే హౌదీ మోదీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరుకానుండడంపై జైశంకర్ స్పందిస్తూ.. అది ఇండో-అమెరికా కమ్యూనిటీ ఘనత అని పేర్కొన్నారు. ఇండో-అమెరికా కమ్యూనిటీ ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. మోదీ సభకు ట్రంప్ హాజరుకావడం ద్వారా పాక్‌కు ఎలాంటి సందేశం పంపనున్నారని విలేకరులు ప్రశ్నించగా.. అది పాక్ అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుందన్నారు.

సమతుల్యత అవసరం..

భారత్, చైనా సంబంధాలపై జైశంకర్ స్పందిస్తూ.. ప్రపంచశక్తులుగా ఎదుగుతున్న రెండు దేశాల మధ్య సమతుల్యతను కనుగొనడం అవసరం అని చెప్పారు. రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ అవి వివాదాలుగా మారకూడదని ఉహాన్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నిర్ణయించారని జైశంకర్ వివరించారు. గత వారం తూర్పు లడఖ్‌లో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగినట్లు వార్తలు వెలువడడంపై ఆయన స్పందిస్తూ.. అది ఘర్షణ కాదని, కేవలం చిన్నపాటి తగాదా అని చెప్పారు. ద్వైపాక్షిక యంత్రాంగం ద్వారా దాన్ని పరిష్కరించినట్లు తెలిపారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రితో సమావేశం అవకాశాల గురించి జైశంకర్ మాట్లాడుతూ.. ఒకవేళ సమావేశమైతే అప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని బదులిచ్చారు. పాక్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆయన స్పందిస్తూ.. ఆ దేశంలో మైనార్టీల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. మైనార్టీల సంఖ్యను వెల్లడించడం కూడా వారు నిలిపేశారు. మానవ హక్కుల ఉల్లంఘనపై ఆడిట్ నిర్వహిస్త్తే ఏ దేశం అట్టడుగున నిలుస్తుందో నాకు బాగా తెలుసు అని వ్యాఖ్యానించారు. పాక్‌పై ప్రపంచానికి తెలియవస్తున్నదని, సీమాంతరం ఉగ్రవాదం జరుగలేదని చెప్పే దేశం ప్రపంచంలో ఒక్కటీ లేదన్నారు.

1106
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles