పటేల్ దార్శనికత అమోఘం

Wed,September 18, 2019 03:08 AM

-ఆయన స్ఫూర్తితోనే 370 రద్దు
-ప్రధాని మోదీ వెల్లడి
-జన్మదినం సందర్భంగా స్వరాష్ట్రంలో పర్యటన

కేవడియా, సెప్టెంబర్ 17: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దార్శనికత ఎంతో అమోఘమని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. పటేల్ స్ఫూర్తితోనే జమ్ముకశ్మీర్ విషయంలో తాము ఒక నిర్ణయం తీసుకోగలిగామని వెల్లడించారు. తన 69వ జన్మదినం సందర్భంగా మంగళవారం సొంత రాష్ట్రం గుజరాత్‌కు వచ్చిన ప్రధాని కేవడియాలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, దశాబ్దాలుగా సాగుతున్న కశ్మీర్ సమస్యకు పటేల్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఓ పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నించామని చెప్పారు. హైదరాబాద్ సంస్థానం విషయంలోనూ పటేల్ నిర్ణయాన్ని ప్రధాని ప్రశంసించారు. సర్దార్ పటేల్ దార్శనికత ఫలితమే హైదరాబాద్ విమోచన దినోత్సవం (సెప్టెంబర్ 17) అని మోదీ చెప్పారు. ఐక్యత ప్రతిమ వద్దకు వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగడం పట్ల మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 11 నెలల క్రితం సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఐక్యత ప్రతిమ పేరుతో మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన లక్షల మందికి మోదీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. డ్యామ్ వద్ద ఆయన నర్మదా నదికి పూజలు చేశారు. డ్యామ్ పూర్తి సామర్థ్యం మేరకు నీరు చేరడంతో గుజరాత్ ప్రభుత్వం నమామి దేవీ నర్మదే మహోత్సవ్‌ను నిర్వహిస్తున్నది. అనంతరం మోదీ కేవడియాలోని సీతాకోక చిలుకల పార్కును సందర్శించి కొన్ని సీతాకోకచిలుకలను గాలిలోకి ఎగురవేశారు.

తల్లితో కలిసి భోజనం

పుట్టిన రోజు సందర్భంగా మోదీ తన తల్లి హీరాబెన్‌ను కలుసుకున్నారు. కేవడియా నుంచి గాంధీనగర్‌కు వచ్చి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. తల్లితో కలిసి భోజనం చేశారు. బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మోదీకి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రధాని మోదీకి సీఎం కే చంద్రశేఖర్‌రావు, ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి మరిన్ని సంవత్సరాలపాటు సేవలందించేలా భగవంతుడు మోదీని దీవించాలని ప్రార్థిస్తున్నట్టు ప్రధానికి పంపిన ప్రత్యేక సందేశంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మోదీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషంగా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ శుభాకాంక్షలకు మోదీ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

910
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles