శక్తిమంత భారత ప్రజాస్వామ్యం

Sun,November 10, 2019 02:40 AM

- అయోధ్య వివాదం కేసులో స్పష్టంచేసిన సుప్రీంకోర్టు తీర్పు: మోదీ
- తీర్పును స్వాగతించిన అన్ని వర్గాలు, సెక్షన్ల ప్రజలు
- బెర్లిన్‌ గోడను కూల్చేసిందీ ఇదే రోజు
- జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, నవంబర్‌ 9: భారత ప్రజాస్వామ్యం సజీవం, శక్తిమంతమైందని అయోధ్య తీర్పు రుజువు చేసిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నవ్యశకానికి నాంది అని అన్నారు. దేశ ప్రజలు పగ, భయం, వ్యతిరేకతను వదిలేసి, నవ భారత నిర్మాణంలో కలిసి రావాలని కోరారు. శనివారం మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ‘భారత్‌ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని అంతర్జాతీయ సమాజం గుర్తింపు తెచ్చేలా చేసింది. ఈనాడు మన ప్రజాస్వామ్యం శక్తిమంతమైందో ప్రపంచానికి తెలిసింది’ అని అన్నారు. తీర్పును దేశంలోని అన్ని వర్గాలు, సెక్షన్ల ప్రజలు హృదయపూర్వకంగా స్వాగతించారని, ఇది భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి, సౌభ్రాతృత్వ స్ఫూర్తికి నిదర్శనం అని తెలిపారు. న్యాయస్థానం తీర్పును సమాజంలోని ప్రతి సెక్షన్‌ స్వాగతించిందని, ఇది పురాతన భారత సంప్రదాయమైన మైత్రి, అన్యోన్యతలకు ప్రతిబింబంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. అయోధ్య వివాదంపై చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పు పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ అభివృద్ధికి శాంతి, ఐక్యత, మైత్రి తప్పనిసరి అని పేర్కొన్నారు. ఎటువంటి ప్రతికూలతలు ఉన్నా మరిచిపోయేలా చేసిన రోజు నవంబర్‌ 9 అని అభిప్రాయపడ్డారు. ‘వందల ఏండ్ల చరిత్ర గల వివాదంపై ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. న్యాయస్థానంలో రోజువారీ విచారణ జరుగుతున్నప్పుడు దేశ ప్రజలంతా శుభం జరుగాలని ఆకాంక్షించారు.
MODI-AYODHYA1
ఈ రోజు ఫలితం వెలువడింది. ప్రతి ఒక్కరి వాదనను చాలా సహనంతో సావధానంగా ఆలకించిన సుప్రీంకోర్టు ఏకగ్రీవ తీర్పు చెప్పింది. దేశ అత్యున్నత న్యాయస్థానం అయోధ్యపై తన దృఢచిత్తాన్ని ప్రదర్శించింది. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో సువర్ణ అధ్యాయం లిఖించుకున్న రోజు ఇది. మనదేశంలోని జడ్జిలు, కోర్టులు, మన న్యాయవ్యవస్థ ప్రశంసకు అర్హులే’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘సరిగ్గా 30 ఏండ్ల క్రితం 1989 నవంబర్‌ తొమ్మిదో తేదీన బెర్లిన్‌ గోడ కూల్చివేతతో తూర్పు, పశ్చిమ జర్మనీల్లో నివసిస్తున్న రెండు వేర్వేరు సిద్ధాంతాలు గల ప్రజలను తిరిగి కలిపేసింది. ఇదే రోజు కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభమైంది. అయోధ్యపై తీర్పు వెలువడింది ఇదే రోజు. కలిసి ముందడుగు వేయాలని నవంబర్‌ 9 మనకు గుణపాఠం నేర్పింది. సుప్రీంకోర్టు తీర్పు మనకు నూతన పాఠాలు బోధించింది. అయోధ్య వివాదం కొన్ని తరాలపై ప్రభావం చూపింది. కానీ న్యాయస్థానం తీర్పుతో నవ భారత నిర్మాణాన్ని నూతన తరంతో ప్రారంభించాలని తీర్మానించుకుందాం’ అని మోదీ చెప్పారు. ‘దేశ అభివృద్ధికి మన మధ్య సామరస్యత, ఐక్యత, శాంతి చాలా ముఖ్యం’ అని తెలిపారు.
MODI-AYODHYA2
అయోధ్య తీర్పులో అంతిమ విజేత భారతదేశం. కలిసిమెలిసి జీవించాలన్న దేశ ప్రజల ఆకాంక్షల విజయమిది. గతాన్ని వదిలి, దేశ నిర్మాణం వైపు ముందుకు కదులుదాం. శాంతి, సామరస్యంతో కూడిన శ్రేయోభారత నిర్మాణం దిశగా అడుగులు వేద్దాం. ఈ సమున్నత భారతదేశంలో అందరికీ చోటు ఉంది. భారత భక్తి భావాన్ని బలోపేతం చేయాల్సిన సమయమిది. దేశ ప్రజలు శాంతి సద్భావన, ఐక్యమత్యంతో నిలవాలి.
- వెంకయ్య నాయుడు, ఉప రాష్ర్టపతి
MODI-AYODHYA3
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అందరూ సమదృష్టి, ఔదార్యంతో చూడాలని విజ్ఞప్తి చేస్తున్నా.
- రాజ్‌నాథ్‌ సింగ్‌, రక్షణ మంత్రి
MODI-AYODHYA4
కోర్టు ఇచ్చిన తీర్పును అందరూ అంగీకరించాలి. శాంతి, సామరస్యపూర్వక వాతావరణాన్ని కొనసాగించేందుకు అందరూ కృషి చేయాలి.
- నితిన్‌ గడ్కరీ, కేంద్రమంత్రి
MODI-AYODHYA5
తీర్పును మనసారా స్వాగతిస్తున్నా. రెండు మతాల ప్రజలకు ఈ తీర్పు సంతోషాన్ని, ఊరటను కలిగించింది. మేము 2003 నుంచి చెప్తున్నదే ఈ తీర్పులో ప్రతిఫలించింది. మనం మతసామరస్యాన్ని కాపాడుకుంటూ, అభివృద్ధివైపు అడుగులు వేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలువాలి.
- శ్రీశ్రీ రవిశంకర్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు
MODI-AYODHYA6
తీర్పును స్వాగతిస్తున్నా. గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ కేసుకు సరైన ముగింపు లభించింది. ఈ ఫలితాన్ని గెలుపు లేదా ఓటమిగా చూడొద్దు. అయోధ్య వివాదం సమసిపోవాలని మేం కోరుకున్నాం. అది జరిగింది.
- ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌

సుప్రీంకోర్టు తీర్పును నీతి, న్యాయం, లౌకికవాదం వంటి విస్తృతమైన అంశాల దృష్టి కోణంలో మాత్రమే చూడాలి. ఈ కేసులో ఏ ఒక్క పార్టీనో, కక్షిదారుడో విజయం సాధించినట్టు కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడొద్దు.
- సీపీఎం

865
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles