భారీ జరిమానాలతో మార్పు


Thu,September 12, 2019 02:49 AM

Nitin Gadkari defends steep fines under Motor Vehicles Act

- రోడ్డు క్రమశిక్షణ పెరిగింది.. ప్రమాదాలూ తగ్గాయి
- ఆదాయం కోసం ఈ చట్టాన్ని తీసుకురాలేదు
- రాష్ర్టాలకే అమలు అధికారం: కేంద్ర మంత్రి గడ్కరీ


న్యూఢిల్లీ: ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధించడం వల్ల ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని, రోడ్డు క్రమశిక్షణ కూడా పెరిగిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మోటారు వాహనాల సవరణ చట్టం కింద భారీగా పెనాల్టీలు విధించడాన్ని మరోసారి ఆయన సమర్థ్ధించుకున్నారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ చట్టం అమల్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు. లైసెన్సు కోసం చాలా మంది ఆర్టీవో కార్యాలయాల్లో దరఖాస్తులు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గడం మరో పెద్ద మార్పు అని అన్నారు. గతంలో ట్రాఫిక్ నియమాలను ప్రజలు పెద్దగా పట్టించుకునేవారు కాదని, అందుకే సవరణ చట్టంలో భారీగా జరిమానాలు విధించినట్లు గడ్కరీ చెప్పారు. 30 ఏండ్ల కిందటి జరిమానాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించామని, బ్రిటన్, కెనడా, కాలిఫోర్నియా, అర్జెంటినా పాటిస్తున్న చట్టాలను అధ్యయనం చేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. భారీ జరిమానాలతో ఆదాయం పెంచుకోవడం ప్రభుత్వ ఉద్దేశం కాదని గడ్కరీ స్పష్టం చేశారు. పెనాల్టీల ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్రప్రభుత్వ ఖజానాలకు కూడా చేరుతుందన్నారు. చట్టం అమలుపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందన్నారు. గుజరాత్ ప్రభుత్వం జరిమానాలను తగ్గించడంపై గడ్కరీ స్పందిస్తూ.. ఇటువంటి నిర్ణయాలకు ఆయా రాష్ర్టాలే బాధ్యత వహించాలన్నారు.

ఈ చట్టాన్ని అమలు చేయం: మమత

మోటారు వాహనాల సవరణ చట్టాన్ని పశ్చిమబెంగాల్‌లో అమలు చేయబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు. భారీ జరిమానాల వల్ల సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని బుధవారం మీడియాతో అన్నారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్ర చట్టాల అమలుపై నిర్ణయం తీసుకునే ప్రత్యేక హక్కు రాష్ర్టాలకు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే చేపట్టిన సేఫ్ డ్రైవ్ సేవ్ లైఫ్ ప్రచారం మంచి ఫలితాన్ని ఇస్తున్నదని తెలిపారు.

553
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles