ఎవరికి ఓటేసినా బీజేపీకే పడింది

Wed,October 23, 2019 02:41 AM

-మహారాష్ట్రలో ఒక గ్రామంలో ఓటర్లు, నేతల ఆరోపణ

పుణె/చండీగఢ్, అక్టోబర్ 22: మహారాష్ట్రలోని సతారా లోక్‌సభ నియోజకవర్గానికి సోమవారం జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ఒక గ్రామంలో ఎవరికి ఓటు వేసినా బీజేపీకే పడిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత శశికాంత్ షిండే ఆరోపించారు. సతారా పరిధిలోని నావ్లేవాది గ్రామంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. గ్రామంలోని ఓటర్లు ఎవరికి ఓటు వేసినా అది బీజేపీకే పడింది. దీంతో మా పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే నేను అక్కడికి వెళ్లి అధికారులతో మాట్లాడాను. అప్పడికే దాదాపు 293 ఓట్లు ఈ విధంగా బీజేపీకి పడ్డాయి. అధికారులను నిలదీయడంతో వారు అప్పటికప్పుడు ఆ ఈవీఎంను మార్చారు అని తెలిపారు. తాను పోలింగ్ కేంద్రంలో ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఓటు వేయడానికి అక్కడికి వచ్చారని, ఆయన తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తే బీజేపీ ఎన్నికల గుర్తు కమలం వద్ద లైటు వెలిగిందని చెప్పారు. దీన్ని గుర్తించిన అధికారులు కూడా ఈవీఎం మెషిన్‌లో ఏదో లోపం ఉన్నదని అంగీకరించారని, దాని స్థానంలో మరోటి చేశారని పేర్కొన్నారు. పోలింగ్ అధికారిణి కీర్తి నలవాడే స్పందిస్తూ కొత్త ఈవీఎం మెషిన్‌ను ఏర్పాటు చేసింది వాస్తవమే. మెషిన్ బటన్‌లో సమస్య ఉండటం వల్లే మార్చాం అని చెప్పారు. ఉదయం పోలింగ్ ప్రారంభానికి ముందు మాక్ పోలింగ్ నిర్వహించామని, అప్పుడు పోలింగ్ ఏజెంట్లు ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తలేదని పేర్కొన్నారు.

హర్యానాలో పెరిగిన పోలింగ్ శాతం


హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 68.46 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం సాయంత్రం వరకు 65.75 శాతం ఉండగా.. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన సమాచారాన్ని అధికారులు క్రోడీకరించి 68.46 శాతం పోలింగ్ నమోదైందని తేల్చారు. ఇదే రాష్ట్రంలో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 76.54 శాతం పోలింగ్ నమోదు కాగా.. దానితో పోల్చితే ప్రస్తుతం పోలింగ్ శాతం తగ్గినట్టే. ఈ ఏడాదిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా హర్యానాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో కలిపి 70.36 శాతం పోలింగ్ నమోదైంది.

673
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles