ఆర్టికల్ 370 తాత్కాలికమే!


Thu,July 11, 2019 02:28 AM

Karnataka crisis rocks Rajya Sabha again House adjourned till noon

-రాజ్యసభలో కేంద్రం స్పష్టీకరణ.. కర్ణాటక అంశంపై దద్దరిల్లిన సభ
-2018-19లో 3,133 కోట్ల డిజిటల్ లావాదేవీలు..
-ఎన్నారై భర్తల మీద 4,698 ఫిర్యాదులు

న్యూఢిల్లీ, జూలై 10: జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రాజ్యాంగంలో తాత్కాలికమేనని కేంద్రం బుధవారం రాజ్యసభకు తెలిపింది. జమ్ముకశ్మీర్ ప్రజల ప్రత్యేక హక్కుల కోసం నిర్దేశించిన ఆర్టికల్ 35ఏ కూడా భారత రాష్ర్టపతి ఆమోదంతో రాజ్యాంగంలో చేర్చబడిందని పేర్కొంది. ప్రస్తుతం ఆర్టికల్ 370 రాజ్యాంగంలో తాత్కాలికమైన ఉత్తర్వుగా (పార్ట్ XXI - తాత్కాలిక, పరివర్తన, ప్రత్యేక నిబంధనలు) ఉన్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం, రాజ్యాంగం ఉత్తర్వులు (జమ్ము కశ్మీర్ కోసం), 1954లో ఆర్టికల్ 35ఏ ఉన్నది. ఆర్టికల్ 370 కింద దీన్ని చేర్చారు అని అన్నారు. జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్గత భాగమని, రాజ్యాంగ విషయాలు అంతర్గతమని, పార్లమెంటు వాటిని చూసుకుంటుందని తెలిపారు. ఈ విషయంలో విదేశీ ప్రభుత్వాలు, సంస్థల ప్రమేయం ఉండదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టికల్ 370, 35ఏను ప్రభుత్వం ఉపసంహరించుకోనుందా? అని సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. మరోవైపు, కర్ణాటకలో పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ నిరసనలతో రాజ్యసభ బుధవారం కూడా వాయిదా పడింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై గురువారం సభలో చర్చిస్తామని కాంగ్రెస్ సభ్యులు తెలిపారు.

దేశంలో ఐఏఎస్‌ల కొరత..

సాధారణ పరిస్థితుల్లో 11 రోజుల్లోగా దరఖాస్తుదారునికి పాస్‌పోర్ట్‌ను అందజేస్తామని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నకు సమాధానమిస్తూ తత్కాల్ క్యాటగిరీ వాళ్లకు ఒకటి, రెండు రోజుల్లో పాస్‌పోర్ట్ అందిస్తామని చెప్పారు. మరోవైపు, పెండ్లి చేసుకొని భార్యలను విడిచిపెట్టిన ఎన్‌ఆర్‌ఐ భర్తలపై దాదాపు 4,698 ఫిర్యాదులు నమోదయ్యాయని వి మురళీధరన్ తెలిపారు. దేశంలో దాదాపు 1,500మంది ఐఏఎస్‌ల కొరత ఉన్నట్టు సిబ్బంది మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖిత పూర్వక సమాధానంలో చెప్పారు. దేశంలో 2018-19లో సుమారు రూ. 3,133.58 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కాగా, మధ్యవర్తిత్వ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

505
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles