ఆవులపై గోల్డ్ లోన్ ఇవ్వండి

Fri,November 8, 2019 01:28 AM

-ఆవు పాలలో బంగారం ఉంటుందని ఘోష్ చెప్పారు
-అప్పులిచ్చే ఓ ఆర్థిక సంస్థను కోరిన బెంగాల్ వ్యక్తి

కోల్‌కతా, నవంబర్ 7: పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఇటీవల ఆవు పాలలో బంగారం ఉంటుందని చెప్పారు. తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ.. విదేశీ ఆవు ల పైభాగం బర్రె మాదిరి నిటారుగా ఉంటుం ది. భారతీయ ఆవులకు మాత్రం మూపురం ఉంటుంది. ఈ మూపురంలో బంగారు ధమని ఉంటుంది. స్యూరుడి కాంతి దానిపై పడినప్పుడు బంగారం ఉత్పత్తవుతుంది. అందుకే ఆవు పాలు పసుపు లేదా బంగారం రంగులో ఉంటాయి అని తెలిపారు. దీంతో దిలీప్ ఘోష్ మాటలను చాలా మంది గ్రామస్తులు నమ్ముతున్నారు. డాన్కునికి చెందిన ఓ వ్యక్తి గురువారం తన రెండు ఆవులను తీసుకుని స్థానిక మణప్పురం ఫైనాన్స్ శాఖ వద్దకు వెళ్లాడు. తన ఆవులు రోజుకు 15 లీటర్లకు పైగా పాలు ఇస్తాయని, ఆ పాలలో బంగారం ఉంటుందని చెప్పాడు. తన ఆవులను తనఖా పెట్టుకుని గోల్డ్ లోన్ ఇవ్వాలని అతడు కోరడంతో ఆ సంస్థ సిబ్బంది నోరెళ్లబెట్టారు. ఈ విషయం తెలిసిన స్థానిక మీడియా ఆ వ్యక్తి వద్దకు వెళ్లి ఆరా తీయగా దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాడు. ఆవు పాలలో బంగారం ఉంటుందని ఇటీవల విన్నాను. నాకు 20 ఆవులున్నాయి. నా కుటుంబం వీటిపైనే ఆధారపడుతుంది. నా పాల వ్యాపారాన్ని పెంచుకునేందుకు బంగారంపై అప్పు కోసం రెండు ఆవులను తీసుకుని వచ్చాను అని చెప్పాడు. మరోవైపు బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలపై గారల్‌గాచా గ్రామ సర్పంచ్ మనోజ్ సింగ్ మండిపడ్డారు. దీలిప్ ఘోష్ మాటలు నమ్మి పలువురు గ్రామస్తులు ప్రతి రోజు తన వద్దకు ఆవులను తీసుకొచ్చి ఎంత అప్పు వస్తుందని అడుగుతున్నారని, తాను సమాధానం చెప్పలేకపోతున్నానంటూ వాపోయారు. ఆవు పాలలో బంగారం ఉంటుందన్న ఘోష్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు.

635
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles