లాంచ్‌ప్యాడ్‌పై బాహుబలి రాకెట్!


Thu,July 11, 2019 02:39 AM

First Images Of India  Bahubali Rocket That Will Launch Chandrayaan 2

-జీఎస్‌ఎల్వీ మార్క్-3ఫొటోలు విడుదల చేసిన ఇస్రో
-15న చంద్రయాన్-2 ప్రయోగం

శ్రీహరికోట, జూలై 10: చంద్రయాన్-2ను నింగిలోకి మోసుకెళ్లే బాహుబలి రాకెట్ జీఎస్‌ఎల్వీ మార్క్-3కి సంబంధించిన చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం విడుదల చేసింది. లాంచ్‌ప్యాడ్‌పైకి రాకెట్‌ను తరలిస్తున్న దృశ్యాలను పక్క ఫొటోలో చూడొచ్చు. చంద్రయాన్-2 మిషన్‌ను భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 15న శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి చేపట్టే ఈ ప్రయోగానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. 640 టన్నుల బరువున్న జీఎస్‌ఎల్వీ మార్క్ 3 రాకెట్ 3.8 టన్నుల బరువున్న ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. చంద్రుడిపై భారత్ చేపడుతున్న రెండో ప్రయోగం ఇది. 2008లో చంద్రయాన్-1 ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగనున్న తొలి వ్యోమనౌకగా చంద్రయాన్-2 నిలువనుంది. ఇంతకుమునుపెన్నడూ ఏ దేశమూ ఆ ప్రాంతానికి వ్యోమనౌకను పంపలేదు.
rocket

చంద్రయాన్-2 విశేషాలు

చంద్రయాన్-1కి ఇది కొనసాగింపు. 2018 సెప్టెంబర్ 18న ఈ మిషన్‌కు ఆమోదం లభించింది. ఈ నెల 15న శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-2ను ప్రయోగించనున్నారు. సెప్టెంబర్ 6న ఇది చంద్రుడిపై దిగనుంది.

చంద్రయాన్ 2లోని ఆర్బిటార్ ఒక ఏడాదిపాటు పనిచేయనుంది. చంద్రుడి ఉపరితలంపై దిగే ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రగ్యాన్) 14 రోజులపాటు పనిచేస్తాయి. ల్యాండ్ అయిన ప్రదేశం నుంచి రోవర్ 500 మీటర్ల వరకు వెళ్లగలదు.

చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువుగా (సాఫ్ట్) ల్యాండింగ్ సాగించే తొలి మిషన్ ఇదే. అలాగే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చంద్రుడిపై పరిశోధనలు జరిపేందుకు భారత్ చేపడుతున్న తొలి ప్రయోగం కూడా ఇదే. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ సాగించాయి. చంద్రయాన్-2 విజయవంతమైతే ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలువనుంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇప్పటివరకు వివిధ దేశాలు 38 ప్రయత్నాలు చేశాయి. అందులో సక్సెస్ రేట్ 52 శాతం మాత్రమే.

1032
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles