బీజేపీకి గవర్నర్ ఆహ్వానం

Sun,November 10, 2019 01:57 AM

-ప్రభుత్వం ఏర్పాటుకు పిలుపు
-మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభనకు తెర!

ముంబై, నవంబర్ 9: మహారాష్ట్రలో 15 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సమ్మతి తెలియజేయాల్సిందిగా ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ శనివారం ఆహ్వానించారు. అంతకుముందు అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోణి రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. శనివారం అర్ధరాత్రితో 13వ అసెంబ్లీ గడువు ముగియనుంది. శుక్రవారం సీఎం ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ కోశ్యారీ ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడేంతవరకు ఫడ్నవీస్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ నుంచి తమకు లేఖ అందినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌పాటిల్ తెలిపారు.

ఆదివారం జరిగే పార్టీ కోర్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి, తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటుకు సమ్మతి తెలుపాల్సిందిగా బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరినట్లు రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీకి అక్టోబర్ 21న ఎన్నికలు జరిగాయి. అదే నెల 24న ఫలితాలు వెలువడ్డాయి. 15 రోజులు గడచినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ గానీ, కూటమి గానీ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలను అన్వేషించాలని గవర్నర్ నిర్ణయించారు. ఈ మేరకు అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 105, శివసేన 56, కాంగ్రెస్ 44, ఎన్సీపీ 54 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు అవసరం.
KOSHYARI
బీజేపీ, దాని మిత్రపక్షం శివసేన 166 స్థానాల్లో గెలుపొందాయి. అయితే ముఖ్యమంత్రి పదవి విషయంలో రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. మరోవైపు ఫిరాయింపులను అడ్డుకునేందుకు శివసేన తన ఎమ్మెల్యేలను ముంబై శివారులోని మలాడ్‌లో ఉన్న ఓ హోటల్‌కు తరలించింది. కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేలను రాజస్థాన్‌కు తరలించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెడ్ తోరట్ ఆదివారం వారితో సమావేశం కానున్నారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ వచ్చే వారం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజాతీర్పు మేరకు బీజేపీ, శివసేన ఉమ్మడిగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని శరద్ పవార్ శనివారం మరోసారి పునరుద్ఘాటించారు.

412
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles