జేఎన్‌యూ హింసపై ముమ్మర దర్యాప్తు

Tue,January 14, 2020 03:27 AM

-ఆయిశీతో పాటు మరో ఇద్దరు విద్యార్థులను ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు
-సమాచారం భద్రపరచాలని పోలీసులు, వాట్సాప్‌, గూగుల్‌కు హైకోర్టు ఆదేశం
-వర్సిటీలో రక్షణలేదన్న జేఎన్‌యూటీఏ.. తరగతుల బహిష్కరణ

న్యూఢిల్లీ, జనవరి 13: ఢిల్లీలోని జేఎన్‌యూలో చోటుచేసుకున్న హింసాకాండపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసు నేర విభాగానికి చెందిన కొందరు అధికారులు వర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులను ప్రశ్నించారు. వీరిలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిశీ ఘోష్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థులు పంకజ్‌ మిశ్రా, వాస్కర్‌ విజయ్‌మేక్‌ ఉన్నారు. ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇటీవల విడుదల చేసిన తొమ్మిది మంది నిందితుల ఫొటోల్లో ఈ ముగ్గురు కూడా ఉన్నారు. వీరితోపాటు ఘటనకు సంబంధమున్నట్టు భావిస్తున్న అక్షత్‌ అవస్థి, రోహిత్‌ షా, దౌలత్‌రావ్‌ు కాలేజీకి చెందిన కోమల్‌ శర్మను కూడా ప్రశ్నించేందుకు నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు. వర్సిటీలో జరిగిన దాడి ఘటనలో ఈ ముగ్గురి ప్రమేయం ఉన్నట్టు ఇటీవల ఇండియాటుడే చేపట్టిన స్టింగ్‌ ఆపరేషన్‌ తేలింది. అయితే, అక్షత్‌ అవస్థి, రోహిత్‌ షాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే, వాళ్ల ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తున్నదని పోలీసులు వివరించారు.

తరగతులను పునఃప్రారంభించండి

విద్యార్థుల ప్రయోజనాల కోసం తరగతులను పునః ప్రారంభించాలని జేఎన్‌యూ టీచర్లకు పరిపాలన విభాగం విజ్ఞప్తి చేసింది. వర్సిటీలోని అన్ని కార్యకలాపాలను బహిష్కరిస్తామని రెండు అధ్యాపక సంఘాలు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేసింది. వర్సిటీలో సోమవారం ప్రారంభం కావాల్సిన తరగతులను విద్యార్థులు, టీచర్లు బహిష్కరించా రు. ఫీజుల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు హెచ్‌ఆర్డీ మంత్రిత్వ శాఖ అధికారులతో ఐదుగురు జేఎన్‌యూ టీచర్స్‌ అసోసియేషన్‌ (జేఎన్‌యూటీఏ) సభ్యులు సోమవారం సమావేశమయ్యా రు. అకడమిక్‌ కార్యకలాపాలను ప్రారంభించే వాతావరణం లేదని వారు చెప్పారు. కాగా, జేఎన్‌యూ దాడి ఘటనలో వామపక్ష విద్యార్థి సంఘాల పాత్ర ఉందని ఆరోపిస్తూ.. ఏబీవీపీ సోమవారం ఎనిమిది వీడియోలను విడుదల చేసింది. ఓ వీడియోలో సీపీఐ నేత డీ రాజా కుమార్తె అపరాజిత ఉన్నట్టు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి సిద్ధార్థ్‌ యాదవ్‌ ఆరోపించారు.

సమాధానమివ్వండి

జేఎన్‌యూ హింసాకాండకు సంబంధించిన సమాచారం, సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాల్ని భద్రపరుచాలని కోరుతూ ముగ్గురు జేఎన్‌యూ ప్రొఫెసర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఈ అంశంపై సమాధానమివ్వాలని కోరుతూ సోమవారం ఢిల్లీ పోలీసు కమిషనర్‌, ఢిల్లీ ప్రభుత్వం, వాట్సాప్‌, గూగుల్‌, యాపిల్‌ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. అయితే, సీసీటీవీ ఫుటేజీని తమకు ఇవ్వాలని జేఎన్‌యూ పరిపాలన విభాగాన్ని ఇదివరకే కోరామని, అయితే వారి నుంచి ఇంకా స్పందన రాలేదని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. అలాగే, ‘యునిటీ అగైనిస్ట్‌ లెఫ్ట్‌', ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఆరెస్సెస్‌' గ్రూపుల్లో ప్రసారమైన సందేశాల్ని, ఫొటోలను, వీడియోలు భద్రపర్చాల్సిందిగా వాట్సాప్‌కు కూడా ఓ లేఖను రాశామని పోలీసులు తెలిపారు. మరోవైపు, నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై పార్లమెంటరీ స్థాయీ సంఘం(హోంశాఖ వ్యవహారాలు) అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు.

728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles